సాంకేతిక చిక్కులు

ABN , First Publish Date - 2021-05-11T04:21:18+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌, నిర్థారణ పరీక్షలకు సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. సర్వర్‌ డౌన్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్థారణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నిర్థారణ పరీక్షలు చేసుకోవాలన్నా, వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నా ఆధార్‌ నెంబరుతో ముందుగా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. ఇది మంచిదే అయినా... తరచూ సర్వర్‌ డౌన్‌ అవుతుండడంతో లబ్ధిదారులకు ఎటువంటి సమాచారం అందడం లేదు.

సాంకేతిక చిక్కులు



పరీక్షలు, వ్యాక్సినేషన్‌కు ఇబ్బందులు

సకాలంలో చేరని సమాచారం

సర్వర్‌ డౌన్‌ కారణమంటున్న అధికారులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా వ్యాక్సినేషన్‌, నిర్థారణ పరీక్షలకు సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. సర్వర్‌ డౌన్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్థారణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నిర్థారణ పరీక్షలు చేసుకోవాలన్నా, వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నా ఆధార్‌ నెంబరుతో ముందుగా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. ఇది మంచిదే అయినా... తరచూ సర్వర్‌ డౌన్‌ అవుతుండడంతో లబ్ధిదారులకు ఎటువంటి సమాచారం అందడం లేదు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదుకు సిబ్బంది నానా యాతన పడుతున్నారు. కనీసం రోజుకు 50 మంది వివరాలు నమోదు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. నిర్థారణ పరీక్షలు చేసుకున్న వారికి వారం రోజులు దాటుతున్నా, ఎటువంటి సమాచారం రావడం లేదు. దీంతో ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. కరోనా పరీక్షలు చేయించుకున్న వారికి పాజిటివ్‌ వస్తేనే సెల్‌ఫోన్‌కు సమాచారం వస్తుందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. నెగిటివ్‌ ఉంటే ఎటువంటి సమాచారం రాదని గతం నుంచి చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్థారణ కోసం శాంపిల్స్‌ ఇచ్చిన అనేకమంది రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడంతో వ్యాధి నిర్థారణ జరగకుండానే మందులు వాడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. 

- రిమ్స్‌ ఆడిటోరియంలో సరిగ్గా పది రోజుల కిందట 20983297 ఐడీ నెంబర్‌తో ఒక వ్యక్తి నుంచి శాంపిల్‌ సేకరించారు. ల్యాబ్‌లో సర్వర్‌ డౌన్‌ ఉందని చెప్పుకొచ్చిన సిబ్బంది నాలుగు రోజుల పాటు శాంపిల్‌ ఇచ్చిన వ్యక్తికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం ఐడీ నెంబర్‌ జనరేట్‌ అయినట్లు కూడా సంబంధిత వ్యక్తికి మెసేజ్‌ వెళ్లలేదు. తరువాత కొద్దిరోజులకు సర్వర్‌ పనిచేస్తుందని చెప్పుకొచ్చిన ల్యాబ్‌ సిబ్బంది ఆ శాంపిల్‌ బ్రొకెన్‌ కింద పక్కన పెట్టి ఉండవచ్చని బదులిచ్చారు. మొత్తం వ్యవహారంలో శాంపిల్‌ తీసుకున్న సిబ్బంది.. సర్వర్‌ డౌన్‌ పేరుతో నిర్లక్ష్యం చేసినట్లు రుజువవుతోంది. నేటికి పది రోజులు గడిచిపోతున్నా ఆ వ్యక్తికి ఇంకా శాంపిల్‌ ఫలితం చేరకపోవడం గమనార్హం. 


 సిబ్బంది కొరత

రోజుకు పదివేల కరోనా పరీక్షలు తప్పనిసరి అని ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారు. కానీ ఆ మేరకు ల్యాబ్‌ల్లో సిబ్బందిని సమకూర్చకపోవడం వల్లే ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో 5 వేల నుంచి ఆరు వేలమందికి కరోనా నిర్థారణ పరీక్షల కోసం శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. తగినంతమంది సిబ్బంది లేకపోవడం, తరచూ సర్వర్‌ మొరాయించడం వంటి కారణాలతో అందరికీ పాజిటివ్‌ లేదా నెగిటివ్‌ అనే మెసేజ్‌ వెళ్లడంతో సర్వర్‌ సమస్య చూపి సిబ్బంది తాత్సారం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 


 రెండో డోస్‌ వేసుకున్నా మళ్లీ మెసేజ్‌....

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న పలువురి పరిస్థితి ఆయోమయంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తొలి డోస్‌, రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న అనేకమందికి మళ్లీ వ్యాక్సిన్‌కు రావాలని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వెళుతున్నాయి. శ్రీకాకుళం నగరం పరిధిలోని గుజరాతిపేట పీహెచ్‌సీ పరిధిలో ఇటీవలే రెండో డోస్‌ వేసుకున్న ఒక మహిళకు మీరు రెండో డోస్‌ వేసుకొనేందుకు ఆసుపత్రికి రావాలని మెసేజ్‌ వెళ్లింది. దీంతో ఆమె ఆందోళన చెంది వెంటనే అధికారులను సంప్రదించగా సర్వర్‌ సమస్య అని బదులిచ్చి సర్దిచెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి శాంపిల్స్‌ ఇచ్చినా, వ్యాక్సిన్‌ వేసుకున్నా సంబంధిత వ్యక్తి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వెంటనే వెళ్లాల్సి ఉంది. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి పరీక్షలు చేయించుకున్నా, వ్యాక్సిన్‌ వేయించుకున్నా మెసేజ్‌లు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా రైలు, విమాన ప్రయాణికులకు వ్యాధి నిర్థారణ, వ్యాక్సినేషన్‌ మెసేజ్‌లు తప్పనసరి. సర్వర్‌ డౌన్‌ సాకుతో ఎటువంటి మెసేజ్‌లు పంపకపోవడం, తప్పుడు మెసేజ్‌లు వెళ్లడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సాంకేతిక తప్పిదాలు జరగకుండా చూడాల్సిన అవసరముంది.



Updated Date - 2021-05-11T04:21:18+05:30 IST