‘తీజ్‌’జోష్‌

Published: Thu, 04 Aug 2022 23:54:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తీజ్‌జోష్‌

గోర్‌ బంజారాల తీజ్‌ బతుకమ్మ పండుగ

తొమ్మిది రోజులు తండాల్లో సందడే సందడి

పెళ్లికాని యువతులకు ప్రత్యేకం ఈ ఉత్సవం

నేటి నుంచి 14 వ తేదీ వరకు నిర్వహణ


నెహ్రూసెంటర్‌, ఆగస్టు 4 : తెలంగాణ పండుగల్లో బతుకమ్మ, బోనాలు ప్రత్యేకమైనవి. ప్రకృతిని, ప్రకృతితో పూజించి, పువ్వులు, గడ్డితో జరుపుకునే సంప్రదాయ చరిత్రకు ఆనవాళ్లివి. ఈ రెండింటిలోనూ మహిళలకే ఎక్కువ ప్రాముఖ్యం కన్పిస్తుంది. గిరిజన, లంబాడ యువతులు జరుపుకునే తీజ్‌’ (గడ్డి బతుకమ్మ) పండుగ ఈ కోవలోకే వస్తుంది. ఏటా ఆగస్టు 5 నుంచి 14వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు నిర్వహించుకునే తీజ్‌ పండుగ ఉత్సవాలపై ప్రత్యేక కథనం..


తీజ్‌ పండుగను ఎందుకు జరుపుకుంటారంటే..

గోర్‌ బంజరాలు శ్రీసేవాలాల్‌ మహారాజ్‌, దండి మేరా మాతను దైవదూతలుగా కొలుస్తారు. తండాల్లోని కన్య (పెళ్లికాని అమ్మాయిలు)లు తమ తల్లిదండ్రులకు పంటలు బాగా పండాలని, ఎక్కువ అభివృద్ధి చెందాలని, భావి జీవి తం దివ్యంగా కొనసాగాలని, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగాలు మరింత బలపడాలని, పార్వతీదేవి శివుని ప్రేమ పొందడానికి 107 జన్మలు ఎత్తి 108వ జన్మలో శివున్ని భర్తగా పొందిన రోజు గుర్తుగా తీజ్‌ పండుగను నిర్వహిస్తారని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. ఈ దేవతలను కొలుస్తూ కన్యలు ఎన్నో విధాలుగా అభ్యర్థిస్తూ శ్రావణమాసంలో తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు. 


తీజ్‌ ఆరంభదినం.. తీజ్‌ బో యేరో...

తండా యువకుల సాయంతో పూజారి కర్ర సామగ్రి రం గురంగుల వస్త్రాలతో ఒకమంచె (డాక్లో)ను తయారు చేసుకుని, అలంకరిస్తారు. ఆ తర్వాత మహిళా గిరిజనులు పాట లు పాడుతుండగా అంతకు ముందే తయారు చేసుకున్న ఎరువును బల్లపై అమర్చిన ఐదు దోనల్లో ప్రతీ అమ్మాయి పేరఉన్న బుట్టలో సమానంగా పోస్తారు. ముందుగా నానబెట్టి ఉంచిన గోధుమలను తండానాయక్‌ ఇంటి నుంచి సేకరించి దేవుడి పేరుమీద అమర్చిన దోన(ఆకుతో చేసిన డొప్ప)ల్లోను, ప్రతీ బుట్టలోను వేస్తారు. ఆ బుట్టలో గోధుమనారు బాగా పెరిగే విధంగా పూజారి, తండా పెద్దలు గోధుమలు చల్లుతారు. అనంతరం ఆ బుట్టలను మంచెపైకి ఎక్కించి రోజూ ఆ బుట్టల్లో నీళ్లు చల్లుతారు. 


రెండోరోజు.. బో రడీ తీజ్‌..

యువతీయువకులు చెలలో బోరడీ ఆటను ఆడుకుంటారు. చెలలో ఉండే రేగుచెట్టు ముళ్లకు నానబెట్టిన శనిగలను గుచ్చుతూ అమ్మాయిలు పాటలు పాడుతారు. ఆ సమయంలో యువకులు ఆ చెట్టును కర్రతో కదలిస్తుంటారు. కదిలే చెట్టు ముళ్లకు శనగలను గుచ్చడం వీలుకాక అమ్మాయిలు నానా బాధలు పడుతుంటారు. అమ్మాయిలు పాటలు పాడుతూ.. యువకులను ఆనందింప చేసి శనిగలను రేగుముళ్లకు గుచ్చి బోరడీ ఆటను ముగిస్తారు. ఇది నిజజీవితంలో ఎలా బతకాలో నేర్పించేందుకు ఈ కథా సూత్రం వర్తిస్తుందని చెబుతారు. ఇదిలా ఉండగా రెండో రోజు పండుగ ప్రారంభం నుంచి తొమ్మిదో రోజు ఉదయం వరకు రోజూ ఉదయం స్నానాలు ఆచరించిన తర్వాత సేవాలాల్‌, మేరామ మాతాల ప్రతిమలను కుటుంబసభ్యులు పూజించిన తర్వాత కన్యలు బావివద్ద నుంచి శుభ్రమైన పాత్రలో నీరు తీసుకువచ్చి పాటలు పాడుతూ.. తీజ్‌ బుట్టల్లో రోజుకు మూడుసార్లు నీరుపోసి నియమనిష్టలతో, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇంటివద్ద తయారు చేసిన ఆహార పదార్థాలను దేవతలకు నైవేథ్యంగా సమర్పిస్తారు. సాయంత్రం వేళలో సంస్కృతిక కార్యక్రమాలు కూడ జరుపుకుంటారు.


డమోళీ తీజ్‌ (ఏడో రోజు)...

తొమ్మిది రోజుల తీజ్‌పండుగ కాలంలో డమోళితీజ్‌ చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున మహిళలు స్నానమాచరించిన తర్వాత బియ్యపు పిండితో రొట్టెలు తయారు చేసి, వాటిని ముక్కలుగా చేసి చెక్కబెల్లం కలిపి వాటిని ముద్దలుగా (ముద్దలచూర్మో) తయారు చేస్తారు. ఒకరి ఇంటిలో తయారైన చుర్మో ముద్దలను మొదట తండా నాయకుడి ఇంటికి వెళ్లి ఆ తర్వాత ప్రతీ ఇంటికి వెళ్లి చుర్మో ముద్దలను పంచుకుంటారు. అందరి ఇళ్లలో తయారు చేసిన చుర్మో ముద్దలను సేకరించిన కన్యలు ఆ బుట్టల వద్దకు చేరుకుని దేవునికి నైవేథ్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ చుర్మోను ప్రసాదంగా స్వీకరిస్తారు. 


గణగోర్‌ తీజ్‌.. (8వ రోజు)..

ఈ ఎనిమిదో రోజు గణగోర్‌ నామకరణంతో శివపార్వతుల పూజలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతీ ఇంటికి కన్యలు వెళ్లి పాయసం తయారు చేయడానికి బియ్యం, చెక్కర, పాలు సేకరిస్తారు. తండా యువకులు పూజారితో చెరువుగట్టుకు వెళ్లి నల్లమట్టిని సేకరించి శివపార్వతుల విగ్రహాలను తయారు చేస్తారు. అలాగే మరో రెండు స్త్రీ, పురుషుల ప్రతిమలు తయారు చేసి శివపార్వతుల విగ్రహాలను మంచెపై ఉంచి వధూవరులుగా అలంకరించి పెళ్లితంతు నిర్వహించి తర్వాత, పూజలు నిర్వహిస్తారు. 


కడావ్‌ తీజ్‌..(9వ రోజు)..

తీజ్‌ చివరి రోజు కడావ్‌తీజ్‌గా పిలుస్తారు. కడావ్‌ పూజ చేసిన తర్వాత మంచెపై ఉంచిన బుట్టల తీజ్‌ నిమజ్జనం చేయడంతో పరిసమాప్తమవుతోంది. కడావ్‌ పూజ కొరకు తండాలోని అన్ని ఇళ్లలో నుంచి బియ్యం, బెల్లం, నెయ్యి సేకరించి వాటితో పాయసం చేస్తారు. ఆ పాయసంతో పూజారి సేవాలాల్‌ మహారాజ్‌కు బోగ్‌ బండారో నిర్వహిస్తారు. ఎవరి ఇంటివద్ద వారు తండావాసులు కూడ బోగ్‌ బండారో నిర్వహిస్తారు. ఆ తర్వాత తీజ్‌ దగ్గర మేరా మాయాడీ పూజ నిర్వహిస్తారు. తీజ్‌ మొదలుపెట్టినప్పటి నుంచి కడావ్‌ పూజ అయ్యే వరకు తీపి పదార్థాలతోటే దేవునికి నైవేద్యం అందించి నియమనిష్టలతో పూజలు చేసి శాశాహారాన్నే తీసుకుంటారు. చివరిరోజు మాత్రం మేరామా యాడీ పూజకు పొట్టెలును బలిచ్చి మాంసహారంతో భుజిస్తారు. 


తొమ్మిది రోజుల ఉత్సవాల్లో ఇలా...

తొమ్మిది రోజులు నియమ నిబంధనలు, నిష్టలతో సాం స్కృతిక కార్యక్రమాలతో నిర్వహించే తీజ్‌ పండుగలో దేవతను నిమజ్జనం చేసే చివరిరోజు ఉత్సాహభరిత వాతావరణంలో తండాపెద్దలు, యువతీయువకులు పాటలు పాడుతూ.. నృత్యం చేస్తూ ఎంతో సమన్వయంగా ముందుకు సాగుతారు. గోర్‌ బంజారాలు మాత్రమే నిర్వహించే ఈ పండుగ కొనసాగే తొమ్మిది రోజుల పాటు గోర్‌ బంజారాల సంస్కృతి ఉట్టిపడుతుంది. పంచకట్టు, కమీజ్‌ రుమాల్‌ ధరిచి పురుషులు, పేట్యా, టుక్రి, కాంచ్లీ, చేతులకు బలియాలు వేసుకుని స్త్రీలు వారికి తగ్గట్టుగానే యువతీయువకులు సంస్కృతికి తగినట్టుగానే తయారవుతారు. గడ్డి బతుకమ్మలు తెచ్చిన ఆడపడుచులకు సోదరులు కాళ్లు కడుగుతారు. ఆపై పారే నీటిలో గడ్డి బతుకమ్మలను వదులుతారు. 


ఐక్యత చాటేలా  తీజ్‌ పండుగ ఇలా..: డాక్టర్‌ బానోత్‌ నెహ్రూరాథోడ్‌ రిటైర్డ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌, మహబూబాబాద్‌ జిల్లా 

గోర్‌ బంజారాలు ఐక్యతకు మారుపేరుగా నిలిచేలా తీజ్‌ పండుగను శ్రావణమాసపు సెలవు దినాల్లో పండుగ నిర్వహించుకోవాలి. గోర్‌ బంజారాలు ఐక్యత చాటేలా తీజ్‌ పం డుగ ఉండాలి. దీనికి అనుగుణంగా యావత్‌ గోర్‌ బంజారాలు ప్రభుత్వం నుంచి సెలవు దినాలు లభించేలా ప్రయత్నించాలి. ప్రభుత్వం కూడ గోర్‌ బంజారాల న్యాయమైన డిమాండ్‌కు అనుగుణంగా క్యాలెండర్‌లో పండుగ తేదీలను ప్రకటించాలి. 


తీజ్‌ పండుగకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి.. : మాలోతు నెహ్రూనాయక్‌, మాలోతు తండా, ఉప్పరిగూడెం, కురవి మండలం

లంబాడీలకు ప్రత్యేకమైన భాషా, ఆచారం సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా మా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నాం, కానీ, మా సంస్కృతి సంప్రదాయాలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు రావడంలేదు. ఒకేసారి పండుగను జరుపుకోవాలంటే ప్రభుత్వం అధికారికంగా తేదీని ప్రకటించాలి. లంబాడీల పండుగలకు గుర్తింపు ఇవ్వాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.