Instagram Reel: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు జాగ్రత్త.. లేదంటే ఈ కుర్రాడిలానే మీరూ..

ABN , First Publish Date - 2022-09-05T01:12:39+05:30 IST

సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకునేందుకు యూజర్లు చేసే విన్యాసాలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్

Instagram Reel: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు జాగ్రత్త.. లేదంటే ఈ కుర్రాడిలానే మీరూ..

వరంగల్: సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకునేందుకు యూజర్లు చేసే విన్యాసాలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోల కోసం చేసే ప్రమాదకర స్టంట్లు కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం రైలు పట్టాలపై రీల్ షూట్ చేస్తుండగా వెనకనుంచి వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. 


ఇంటర్ చదువుతున్న అజయ్ కాజీపేటలోని వడ్డేపల్లి ట్రాక్‌పై రైలు వస్తుండగా రీల్ షూట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కాసేపు వేచి చూసిన తర్వాత రైలు వస్తుండడాన్ని గమనించి ట్రాక్‌కు ఆనుకుని నడుస్తుండగా మరొకరు షూట్ చేస్తున్నారు. పట్టాలకు, తనకు మధ్య కొంత దూరం ఉండడంతో రైలు తన పక్కగా వెళ్లిపోతుందని భావించాడు. కానీ, వేగంగా వస్తున్న రైలు ఇంజిన్ ముందుభాగం కుర్రాడి ఎడమ భుజాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లడంతో అతడు అమాంతం ఎగిరి కిందపడ్డాడు. రాళ్ల మధ్య బలంగా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న రైల్వే గార్డ్ ఒకరు అజయ్‌ను చూసి వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అక్కడి నుంచి వెంటనే వరంగల్‌లోని ఎంజీఎంకి తరలించారు. అజయ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.


ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాల బారినపడుతున్న యువతీయువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రమాదాలు ఎన్ని జరిగినా, నిత్యం ఇలాంటి వార్తలు వస్తున్నా యవత మాత్రం రీల్స్, సెల్ఫీ క్రేజ్ నుంచి బయటపడలేకపోతున్నారు. పేరు సంపాదించుకోవాలన్న వ్యామోహం వారితో అలా చేయిస్తోంది. 

Updated Date - 2022-09-05T01:12:39+05:30 IST