తెగిన ‘పంచాయితీ’!

ABN , First Publish Date - 2021-01-22T05:25:49+05:30 IST

ఈ నెల 23వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది.

తెగిన ‘పంచాయితీ’!

పల్లెపోరుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

మధ్యాహ్నం నుంచే ‘కోడ్‌’ కూసింది!

జిల్లాలో 948 పంచాయతీలకు ఎన్నికలు

25న నోటిఫికేషన్‌, 4 విడతలుగా ఫిబ్రవరిలో పోలింగ్‌

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ప్రజల్లో వీడని సందిగ్ధత

ఆశావహుల్లో ఓటు ఖర్చు భయం


ఎట్టకేలకు పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్‌.. ఇప్పుడు జరపడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదనల మధ్య హైకోర్టు మెట్లు ఎక్కిన పంచాయితీ గురువారం ఓ కొలిక్కి వచ్చింది. ఎన్నికలు జరుపుకోవచ్చని రాష్ట్ర అత్యున్నత స్థానం తీర్పు ఇవ్వడం, వెనువెంటనే కోడ్‌ అమలులోకి వచ్చింది. అయితే, ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తామని పలువురు రాష్ట్ర మంత్రులు ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగంలో సందిగ్ధత నెలకొంది. ఇదిలాఉంటే హైకోర్టు తీర్పు మేరకు గతంలో  విడుదల చేసిన ఎన్నికల హెడ్యూల్‌ ప్రకారం గురువారం మధ్యాహ్నం నుంచే కోడ్‌ అమలులోకి వచ్చింది. ఎన్నికలపై కమ్ముకున్న సందిగ్ధత కారణంగా పల్లెల్లో అణగారి ఉన్న రాజకీయ సందడి హై కోర్టు తీర్పుతో ఒక్కసారిగా ఊపిరిపోసుకుంది. జిల్లా పరిధిలోని తొమ్మిది వందల పైచిలుకు పంచాయతీలలో రాజకీయ కలకలం మొదలయ్యింది. 


నెల్లూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 23వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది.  షెడ్యూల్‌లో ప్రకటించిన విధంగా నాలుగు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. షెడ్యూల్‌లో ఫిబ్రవరి 5, 7, 9, 13వ తేదీలలో దశలవారీగా ఎన్నికలు జరగాల్సి ఉంది. పోలింగ్‌ తేదీలు ఇవే ఉంటాయా, మారుతాయా అనే విషయం ఎన్నికల నోటిఫికేషన్‌లో తెలుస్తుంది. జిల్లా పరిధిలో 948 పంచాయతీలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. 


కోడ్‌ అమలులోకి.. కానీ...


హైకోర్టు తీర్పుతో గురువారం నుంచే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. అయితే ఈ కోడ్‌ ఏమేరకు అమలవుతుంది అనేది అనుమానమే. సాధారణంగా అయితే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన రోజు నుంచే కోడ్‌ అమలులోకి వస్తుంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్లకు ఎన్నికల కోడ్‌ను అమలు చేయాల్సిందిగా ఆదేశాలు అందుతాయి. ఆ క్షణం నుంచి కలెక్టర్లు ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వెళ్లిపోతారు. జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కోడ్‌ను అమలులోకి తెస్తారు. అయితే చరిత్రలో  ఎన్నడూ లేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఎస్‌ఈసీ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపడం ఇప్పుడు సాధ్యం కాదని భీష్మించుకుంది. ఈ నేపథ్యంలో కోడ్‌ అమలులోకి వచ్చినా దానిని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం ప్రభుత్వ సూచనల మేరకు మౌనం వహిస్తోంది. 


కొనసాగుతన్న సందిగ్ధత


ఎన్నికల్లో పోటీ చేయడం అంటే చిన్న ఖర్చు కాదు. ఈ విషయం అందరికి తెలిసిందే. నాకు ఓటేయ్యండి.. అని ఒక్కమాట అడిగితే చాలు ఇక ఆ రోజు నుంచి సదరు నాయకుడు బుక్‌ అయిపోయినట్లే. ఈ ఎన్నికల్లో గత పది నెలలుగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల జోబులు గుల్ల అవుతున్నాయి. మార్చిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలను నోటిఫికేషన్‌ విడుదలయ్యింది.  ఆ తరువాత వెంటనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అయితే కరోనా కారణంగా ఎన్నికలన్నీ వాయిదా పడ్డాయి. ఇక అప్పటి నుంచి అంటే స్థానిక సంస్థలకు పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు ఖర్చులు తప్పడం లేదు. దాబా ఖర్చుల నుంచి ఇంటి అవరసరాల వరకు అన్నీ ఆశావహుల ఖాతాలో పడిపోతున్నాయి. అవసరం తీర్చకుంటే ఓటు పోతుందేమో అనే భయంతో గత పది నెలలుగా ఈ ఖర్చులను భరిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ఎన్నికలు జరుగుతాయని, గెలుపో, ఓటమో ఈ ఖర్చుల బాధ తప్పుతుందని భావిస్తున్న అభ్యర్థులకు ఇప్పటికీ నిరాశ తప్పడం లేదు. ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు జరుగుతాయంటోంది. హైకోర్టు కూడా ఎన్నికలు జరపాల్సిందేనని తీర్పు ఇచ్చింది. కానీ ప్రభుత్వం కుదరదంటోంది. ఈ ఎన్నికల కమిషనర్‌ ఉన్నంత వరకు ఎన్నికలకు అంగీకరించే ప్రశ్నేలేదని అధికార పార్టీ మంత్రులు తెగేసి చెబుతున్నారు. గురువారం హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు జరుగుతాయా, వాయిదా పడుతాయా..!? అనే సందిగ్ధత ప్రజల్లో...ఖర్చు మాటేమిటిరా భగవంతుడా అనే భయం అభ్యర్థుల్లో వెంటాడుతోంది. 

Updated Date - 2021-01-22T05:25:49+05:30 IST