బలైపోయిన తహసీల్దార్‌!

ABN , First Publish Date - 2021-09-09T06:12:42+05:30 IST

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’..

బలైపోయిన తహసీల్దార్‌!
కొమ్మాది వివాదాస్పద భూమి, (ఇన్‌సెట్‌) ఎమ్మెల్యే కన్నబాబురాజు, సుకుమారవర్మ, జరజాపు శ్రీనివాసరావు, రూరల్‌ తహసీల్దార్‌ ఆర్‌.నరసింహమూర్తి

కొమ్మాది భూ వివాదంలో రూరల్‌ మండల రెవెన్యూ అధికారి నరసింహమూర్తి సస్పెన్షన్‌

మోసపూరిత రిజిస్ట్రేషన్‌కు అడ్డం పడడమే ఆయన చేసిన తప్పు!

నకిలీ దరఖాస్తులతో కుట్ర చేస్తున్నారంటూ భూ యజమాని భార్య చేసిన ఫిర్యాదు మేరకు వెబ్‌ల్యాండ్‌లో రెడ్‌ మార్కింగ్‌

తన డిజిటల్‌ సంతకం కూడా తొలగించిన అధికారి

లావాదేవీకి ఇబ్బంది తలెత్తడంతో మండల కార్యాలయానికి వెళ్లి కేకలు వేసిన ఎమ్మెల్యే కన్నబాబురాజు

అక్కడి నుంచే జేసీకి ఫిర్యాదు

ఒత్తిడి తట్టుకోలేక ఆన్‌లైన్‌లో వివరాలు నమోదుచేసిన తహసీల్దార్‌

ఈ వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదంటూ ఆయన్ను సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌

రెవెన్యూ వర్గాల్లో విస్మయం

రంగంలోకి ఇంటెలిజెన్స్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్నట్టుగా... కొమ్మాది భూ వివాదంలో విశాఖపట్నం రూరల్‌ తహసీల్దార్‌ ఆర్‌.నరసింహమూర్తి బలైపోయారు. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై రెవెన్యూ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఒక విన్నపం వచ్చినప్పుడు దానికి స్పందించి తహసీల్దార్‌ వెంటనే పని చేశారని, ఆ తరువాత ఫిర్యాదు వస్తే అదే తరహాలో చర్యలు తీసుకున్నారని...అందులో తప్పు ఏముందని? ప్రశ్నిస్తున్నాయి. ఈ వివాదంలో ప్రజా ప్రతినిధిని, ఆయన కుమారుడిని ఏమీ చేయలేక ఒక అధికారిని బలి చేయడం అన్యాయమని పేర్కొంటున్నాయి.


ఏం జరిగిందంటే...?

ఎమ్మెల్యే కన్నబాబురాజు తన కుమారుడు సుకుమార వర్మ ఎండీగా వున్న ‘కశ్యప్‌ డెవలపర్స్‌’ పేరు మీద కొమ్మాదిలో తుమ్మల కృష్ణ చౌదరికి చెందిన 12.26 ఎకరాల భూమిని కొనడానికి ముందుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ భూమి కృష్ణచౌదరిదా?, కాదా? అని తెలుసుకోవడానికి 1-బి రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. అందులో ఆయన పేరే ఉంది. దాంతో ఎమ్మెల్యే అండ్‌ కో మధ్యవర్తులకు అడ్వాన్స్‌ ఇచ్చేసింది. ఆ  ఆస్తిని రిజిస్టర్‌ చేసుకోవాలంటే...భూమి వివరాలు ఆన్‌లైన్‌ వెబ్‌ల్యాండ్‌లో కూడా ఉండాలి. కానీ అందులో లేవు. దాంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జాప్యం జరిగే అవకాశం వుందని స్వయంగా ఎమ్మెల్యేనే రంగంలోకి దిగారు. ఆ భూమిని ఆన్‌లైన్‌ చేయాలని విశాఖపట్నం ఆర్‌డీఓకు దరఖాస్తు చేయించారు. ఆ దరఖాస్తు అక్కడి నుంచి రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చింది.


వెంటనే ఎమ్మెల్యే కన్నబాబురాజు తహసీల్దార్‌ నరసింహమూర్తికి ఫోన్‌ చేసి, తానే ఆ భూమిని కొంటున్నానని, రికార్డులన్నీ బాగానే ఉన్నాయని, త్వరగా పని పూర్తిచేయాలని కోరారు. దాంతో తహసీల్దార్‌ దరఖాస్తులో పేర్కొన్న కొమ్మాదిలోని భూమిని పరిశీలించి, అక్కడ విచారణ చేసి, ఆ భూమి కృష్ణచౌదరిదేనని నిర్ధారించుకొని, అవే వివరాలను తన డిజిటల్‌ సంతకంతో వెబ్‌ల్యాండ్‌లో నమోదుచేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే...భూ యజమాని అమెరికాలో ఉండగా, ఆయనకు తెలియకుండా ఆ భూమిని విక్రయించాలనుకున్న దళారులు ...ఆర్డీవోకు తప్పుడు దరఖాస్తు చేయగా, ఆ పని త్వరగా చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకువచ్చారు. 


ఫిర్యాదుతో ‘రెడ్‌ మార్కింగ్‌’

కొమ్మాదిలో భూమిని కొంటున్నట్టు పత్రికలో ప్రకటన ఇచ్చి, అందులో పేర్కొన్న గడువు పూర్తికాక ముందే ఎమ్మెల్యే అండ్‌ కో మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆగస్టు 26న రిజిస్ట్రేషన్‌కు యత్నించారు. అయితే పత్రికలో ప్రకటన చూసి కంగారుపడిన కృష్ణచౌదరి భార్య లక్ష్మీ సూర్య ప్రసన్న... తాము భూమిని అమ్మడం లేదని, ఎవరో నకిలీ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడుతున్నారంటూ జిల్లాలో రెవెన్యూ, పోలీసు అధికారులందరికీ ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే రూరల్‌ తహసీల్దార్‌ నరసింహమూర్తిని కూడా కలిసి రిజిస్ట్రేషన్‌ జరగకుండా చూడాలని అభ్యర్థించారు. అమెరికాలో వున్న కృష్ణ చౌదరితో ఫోన్‌లో మాట్లాడించారు. ఆన్‌లైన్‌లో భూమి వివరాలు నమోదు చేయాల్సిందిగా తాను దరఖాస్తు చేయలేదని, ఎవరో నాటకం ఆడుతున్నారని ఆయన చెప్పడంతో మోసం గ్రహించిన తహసీల్దార్‌ వెంటనే వెబ్‌ల్యాండ్‌లో తన డిజిటల్‌ సంతకం తీసేశారు. అంతేకాకుండా ఆ భూమి వివరాలకు ‘రెడ్‌ మార్కింగ్‌’ చేశారు. ఆ తరువాత జిల్లా రిజిస్ట్రార్‌కు, మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌కు ఫోన్‌ చేసి, కొమ్మాది భూమిని రిజిస్టర్‌ చేయవద్దని సూచించారు.


ఆఫీసులో వీరంగం వేసిన ఎమ్మెల్యే

ఆగస్టు 26న ఈ భూమిని రిజిస్టర్‌ చేసుకోవడానికి ఎమ్మెల్యే అండ్‌ కో మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లింది. ఆ ప్రక్రియలో భాగంగా వెబ్‌ల్యాండ్‌ ఓపెన్‌ చేస్తే...ఆ భూమి వివరాలు రెడ్‌ మార్కింగ్‌తో వుండడంతో రిజిస్ట్రేషన్‌ చేయలేమని సబ్‌ రిజిస్ట్రార్‌ చేతులెత్తేశారు. దాంతో అగ్రహోదగ్రుడైన ఎమ్మెల్యే కన్నబాబురాజు అక్కడి నుంచి నేరుగా రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి వీరంగం వేశారు. ఆయన నోటి దురుసు గురించి జిల్లాలో తెలియని అధికారి లేరు. అదే శైలిలో తహసీల్దార్‌పై ఎగిరిపడి ‘వెబ్‌ల్యాండ్‌లో ఎలా తీసేశావ్‌? వెంటనే పెట్టు. లేదంటేనే...!!’ అంటూ చిందులేశారు. అక్కడి నుంచే జాయింట్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి, తహసీల్దార్‌పై ఫిర్యాదు చేశారు. ఎవరో వచ్చి ఫిర్యాదు చేస్తే..వెబ్‌ల్యాండ్‌ వివరాలు తీసేశారని ఆరోపించారు. వెంటనే వాటిని పెట్టించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక తహసీల్దార్‌ భయాందోళనతో మళ్లీ ఆ వివరాలను వెబ్‌ల్యాండ్‌లో పెట్టారు. దగ్గరుండి ఆ పని పూర్తిచేసుకున్న ఎమ్మెల్యే...తన పని పూర్తయిందని మళ్లీ జేసీకి ఫోన్‌ చేసి అక్కడి నుంచి కదిలారు. ఇలా అత్యంత హైడ్రామా నేపథ్యంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆ వివరాలు వెబ్‌ల్యాండ్‌లో ప్రత్యక్షం కాగా సబ్‌ రిజిస్ట్రార్‌ వాటిని పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కేసులో వెబ్‌ల్యాండ్‌లో పెట్టడం, తీయడం అంతా మీ ఇష్టమేనా? నిబంధనలు పాటించరా? అనే కారణాలతో తహసీల్దార్‌ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. 


వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్‌

విశాఖపట్నంలో సంచలనం కలిగించిన ఈ భూ వివాదంలో అసలు ఏమి జరిగిందో తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ఇంటెలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దిగాయి. బుధవారం మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో పలువురు అధికారుల నుంచి వివరాలు సేకరించాయి.


ఆర్థిక వ్యవహారాల మాటో..?

ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. కొంత బ్యాంకు ఖాతాల ద్వారా, మరికొంత అనధికారికంగా ఇచ్చారు. వీటికి అధికారిక లెక్కలు ఉన్నాయా?, నల్లధనమా?  అనేది తేల్చాల్సి ఉంది.

Updated Date - 2021-09-09T06:12:42+05:30 IST