తేజస్వికి కలిసిరాని కాంగ్రెస్ పొత్తు!

ABN , First Publish Date - 2020-11-10T22:50:52+05:30 IST

బిహార్ యువ నేత తేజస్వి యాదవ్ పదునైన మాటలు, కేంద్ర, రాష్ట్ర

తేజస్వికి కలిసిరాని కాంగ్రెస్ పొత్తు!

పాట్నా : బిహార్ యువ నేత తేజస్వి యాదవ్ పదునైన మాటలు, కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలపై ఘాటైన విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ, ఓట్ల రూపంలో ఎందుకు మారలేదనే ప్రశ్న ఆయన మద్దతుదారుల మనసులను తొలిచేస్తోంది. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ ఇచ్చిన హామీ యువతను బాగా ఆకట్టుకుందని, అయితే ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న మిగిలిన పార్టీల కన్నా కాంగ్రెస్ ప్రజల మన్ననలను పొందడంలో విఫలమవడంతో, ఆ కూటమి పరాజయం బాటలో కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ, మంగళవారం వెల్లడవుతున్న శాసన సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిలవడం ఆశ్చర్యంగా ఉందని చెప్తున్నారు. 


ఆర్జేడీ (144), కాంగ్రెస్ (70), సీపీఐ (6), సీపీఐ(ఎంఎల్) (19), సీపీఎం (4) కలిసి బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగో స్థానానికి పరిమితమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కూటమిలోని పార్టీలు తాము పోటీ చేసిన స్థానాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు నమోదు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ అతి తక్కువ (20) స్థానాల్లో  మాత్రమే గెలిచే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ప్రచారం చేసినప్పటికీ, ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌తో జట్టుకట్టిన ఆర్జేడీకి చేదు ఫలితాలే వచ్చాయి. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో 39 స్థానాలను ఎన్డీయే కైవసం చేసుకోగా, కాంగ్రెస్ ఒక స్థానాన్ని దక్కించుకుంది. ఆర్జేడీకి కనీసం ఒక స్థానమైనా లభించలేదు. 


కాంగ్రెస్ బిహార్‌లో చిన్న పార్టీ స్థాయికి తగ్గిపోయిందని ఆ పార్టీ నేతలు చెప్తుండటం గమనార్హం. శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి, బాలీవుడ్ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా కూడా తాజా ఎన్నికల్లో వెనుకంజలో ఉన్నారు. 75 స్థానాల్లో పోటీ చేస్తామని పట్టుబట్టిన ఈ పార్టీకి తేజస్వి యాదవ్ 70 స్థానాలు ఇచ్చారు. తేజస్వి కాంగ్రెస్‌కు ఈ విధంగా సానుకూలంగా వ్యవహరించకపోతే, ఫలితాలు వేరే విధంగా ఉండేవని ఆర్జేడీ నేతలు చెప్తున్నారు. 


Updated Date - 2020-11-10T22:50:52+05:30 IST