ఆర్చరీ క్రీడకు పునర్వైభవం తీసుకొస్తాం: కామినేని అనిల్

ABN , First Publish Date - 2022-01-09T00:41:56+05:30 IST

దేశంలో, రాష్ట్రంలో ఆర్చరీ క్రీడకు పునర్వైభవం తీసుకొస్తామని తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు కామినేని అనిల్‌ చెప్పారు.

ఆర్చరీ క్రీడకు పునర్వైభవం తీసుకొస్తాం: కామినేని అనిల్

హైదరాబాద్‌: దేశంలో, రాష్ట్రంలో ఆర్చరీ క్రీడకు పునర్వైభవం తీసుకొస్తామని తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు కామినేని అనిల్‌ చెప్పారు. అందులో భాగంగానే దశాబ్దానికి పైగా నిలిచిపోయిన జాతీయ ర్యాంకింగ్‌ ఆర్చరీ టోర్నమెంట్‌ (ఎనఆర్‌ఏటీ)ను ఎన్టీపీసీ సహకారంతో తిరిగి ప్రారంభించామని తెలిపారు. 2000వ దశకంలో ఏటా ఈ టోర్నీ నిర్వహించడం ద్వారా క్రీడాకారుల్లో పోటీతత్వం పెరగడంతో పాటు ఇందులో ఆడిన వారికి చెప్పుకోదగ్గా స్థాయిలో ఆర్థిక ప్రోత్సాహం కూడా అందించగలిగాం. అప్పట్లో క్రమం తప్పకుండా ఈ టోర్నీ నిర్వహించడం వల్ల రాష్ట్ర, జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్లేయర్లు తయారయ్యారు. అందుచేత మళ్లీ ఈ టోర్నీని నిర్వహించాలని నిర్ణయించి, హైదరాబాద్‌ వేదికగా శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈసారి టోర్నీ ఓవరాల్‌ ప్రైజ్‌ మనీ రూ.90 లక్షలని ఆయన తెలిపారు. 


గతంలో కేవలం సీనియర్‌ కేటగిరీలో మాత్రమే ఈ టోర్నీని నిర్వహించేవాళ్లం. కానీ ఈసారి జూనియర్‌, సబ్‌ జూనియర్‌ విభాగాల్లోనూ పోటీలు పెడతున్నాం. నామమాత్రంగా కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్చరీ రేంజ్‌ను రూపొందించి అందులో పోటీలు జరుపుతున్నాం. దీనివల్ల క్రీడాకారులకు ఇంటర్నేషనల్‌ ఈవెంట్లలో తలపడిన అనుభూతిని కలిగిస్తున్నాం. తద్వారా వారికి ఇత‌ర దేశాలకు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ టెక్నాల‌జీ, సెట‌ప్ చూసి ఒత్తిడికి గుర‌వ‌కుండా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికి మా ఈ ప్ర‌య‌త్నాలు దోహ‌ద‌ప‌డుతుంది’ అని అనిల్‌ తెలిపారు. ఇక, గచ్చిబౌలి స్టేడియంలో ఇండోర్‌ ఆర్చరీ అకాడమీ నెలకొల్పడానికి కొంత స్థలాన్ని కేటాయించాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డిని కోరామని తెలిపారు. ప్రభుత్వం సహకారమందిస్తే తప్పకుండా అంతర్జాతీయ స్థాయిలో రెసిడెన్షియల్‌ అకాడమీని ఏర్పాటు చేసి హైదరాబాద్‌ను ఆర్చరీ హబ్‌గా తయారు చేస్తామని అనిల్‌ చెప్పారు.

Updated Date - 2022-01-09T00:41:56+05:30 IST