Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-09-03T23:58:37+05:30 IST

తెలంగాణ కేబినెట్‌ (Telangana Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించాలని

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్‌ (Telangana Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించాలని, సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాదాపు 3 గంటలపాటు కొనసాగిన మంత్రివర్గ సమావేశం కొనసాగింది. ఈనెల 16, 17, 18 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 6 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ఎజెండాను రూపొందించడంతోపాటు ఇతర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో మార్చి 7న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై 15వ తేదీన ముగిశాయి. ఆ సమావేశాలు నిరవధికంగా (సినె డై) వాయిదా పడ్డాయే తప్ప ప్రొరోగ్‌ కాలేదు. స్పీకర్‌ ఎలాంటి ప్రతిపాదన చేయకపోవడంతో గవర్నర్‌ ప్రొరోగ్‌ చేయలేదు. 


దీంతో ఆ సమావేశాలకు కొనసాగింపుగానే... ప్రస్తుత వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ప్రారంభం కావడం.. అప్పట్లో ఇది పెద్ద దుమారానికి దారి తీసింది. ఆ తర్వాత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 21న శాసన సభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని భావించినా.. ఇతర కార్యక్రమాల దృష్ట్యా సమావేశాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. ఆ ఒక్క రోజు సమావేశాన్ని నిర్వహించి ఉంటే.. ఇప్పుడు వర్షాకాల సమావేశాలను నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఆ సమావేశం రద్దు కావడం, ఆరు నెలల్లోగా అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉండడంతో ఈ నెల 6 నుంచి సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


మరోవైపు సెప్టెంబరు 17ను విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్న బీజేపీ.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తామే ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. ఏడాదిపాటు వజ్రోత్సవాలు నిర్వహించే యోచనలో ఉంది. హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమై ఈ సెప్టెంబరు 17వ తేదీకి 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా తెలంగాణ విలీన వజ్రోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.



Updated Date - 2022-09-03T23:58:37+05:30 IST