మనస్లు పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డ!

ABN , First Publish Date - 2022-10-01T09:12:37+05:30 IST

ప్రపంచంలో ఎనిమిదో ఎత్తయిన మౌంట్‌ మనస్లు పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలిగా తెలంగాణ బిడ్డ అన్విత చరిత్ర సృష్టించింది.

మనస్లు పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డ!

  • యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అన్విత ఘనత
  • ప్రపంచంలో 8వ ఎత్తైన పర్వతాన్ని  
  • అధిరోహించిన తొలి భారతీయురాలిగా రికార్డు

భువనగిరి టౌన్‌, సెప్టెంబరు 30: ప్రపంచంలో ఎనిమిదో ఎత్తయిన మౌంట్‌ మనస్లు పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలిగా తెలంగాణ బిడ్డ అన్విత చరిత్ర సృష్టించింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పడమటి అన్వితారెడ్డి ప్రపంచవ్యాప్తంగా పలు పర్వతాలను అధిరోహిస్తూ ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ ఎలబ్రూస్‌ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలిగా ఇప్పటికే ఆమె పేరిట రికార్డు ఉండటం విశేషం. ఈ క్రమంలో.. భారత పర్వతారోహణ రంగంలో రెండు అరుదైన రికార్డులు సాధించిన తొలి తెలంగాణ మహిళగా ఆమె నిలిచారు. మనస్లు పర్వతం నేపాల్‌లో సముద్ర మట్టానికి 8,163 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పర్వత శిఖరాగ్రాన్ని ఆమె గత నెల 28వ తేదీన చేరుకుని, జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ ఏడాది అగస్టు 30న భువనగిరి నుంచి బయలుదేరి అవసరమైన పత్రాలను సమర్పించిన అనంతరం గత నెల 11న మనస్లు పర్వత మొదటి బేస్‌ క్యాంప్‌నకు ఆమె చేరుకున్నారు. 12 నుంచి రొటేషన్స్‌ విధానంలో మనస్లు పర్వతంపై పట్టు సాధించారు.


 24న బేస్‌ క్యాంప్‌ నుంచి పర్వతారోహణను ప్రారంభించిన ఆమె నాలుగురోజుల పాటు అధిరోహణం కొనసాగించి, గత నెల 28న మనస్లు పర్వత శిఖరాగ్రాన్ని చేరుకున్నారు. ఇలాంటి అరుదైన రికార్డును తమ బిడ్డ సాధించడం పట్ల అన్విత తల్లిదండ్రులు పడమటి మధుసూదన్‌రెడ్డి, చంద్రకళ హర్షం వ్యక్తంచేశారు. మధుసూదన్‌ రైతు కాగా, చంద్రకళ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. అన్విత ఉస్మానియా వర్సీటీలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత పర్వతారోహణపై దృష్టి పెట్టారు. ఆమెకు ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌ ఎండి, బి.శేఖర్‌బాబు అండగా నిలవగా, మహిళా, శిశు సంక్షేమ శాఖ, హన్మకొండకు చెందిన ఎంఎస్‌ సన్నిధి డెవలపర్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌, ఎంఎస్‌ దివీస్‌ లేబోరేటరీ చౌటుప్పల్‌ స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్నారు. దసరాకల్లా అన్విత భువనగిరికి రానున్నట్లు తెలుస్తోంది. భువనగిరి ఖిల్లాపై పర్వతారోహణ శిక్షణ పొందిన అన్విత, రష్యాలో మంచుతో కప్పి ఉండే 18,510 అడుగుల ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని గత ఏడాది డిసెంబరు 7న మైనస్‌ 40డిగ్రీల చలిలో అధిరోహించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా పర్వతారోహకురాలిగా రికార్డు నమోదుచేశారు. ఈ ఏడాది మే 16న 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని, 2015లో సిక్కింలోని 4,800 మీటర్ల ఎత్తైన రినాక్‌ పర్వతాన్ని, 2019లో 6,400 మీటర్ల బీసిరాయ్‌ పర్వతాన్ని, 2020 జనవరిలో 5,896 మీటర్ల ఎతైన కిలిమంజారో పర్వతాన్ని, 2021 ఫిబ్రవరిలో లద్దాఖ్‌లోని 6వేల మీటర్ల ఎత్తైన ఖడే పర్వతాన్ని అన్విత అధిరోహించారు.

Updated Date - 2022-10-01T09:12:37+05:30 IST