మూలకారణానికి మందు

ABN , First Publish Date - 2020-10-16T05:28:57+05:30 IST

బీభత్సం కొద్దికొద్దిగా ఉపశమిస్తుండగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిస్థితిని, నష్టాన్ని అంచనావేసి, తదుపరిచర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్...

మూలకారణానికి మందు

బీభత్సం కొద్దికొద్దిగా ఉపశమిస్తుండగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిస్థితిని, నష్టాన్ని అంచనావేసి, తదుపరిచర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, మృతుల కుటుంబాలకు, ఇళ్లు కూలిపోయినవారికి, దెబ్బతిన్నవారికి ప్రభుత్వ సహాయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు 5 కోట్ల రూపాయలను తక్షణం మంజూరు చేశారు కూడా. గురువారం మంత్రివర్గ సహచరులతో, అధికారులతో జరిపిన సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింద న్న అంచనాను పేర్కొంటూ, కేంద్రం తక్షణం 1350 కోట్లు సహాయం అందించాలని కెసిఆర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జిల్లాకలెక్టర్లతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు తప్ప, ప్రత్యేకమైన ప్రకటనలు వెంటనే ఏమీ చేయలేదు. 


తక్షణం చేయవలసినవి చేయవలసిందే. ధ్వంసమయినవాటిని పునర్‌నిర్మించడం, తిష్ఠ వేసిన వరదనీటిని తోడిపోయడం, మంచినీరు, విద్యుత్‌ వంటి అత్యవసర సరఫరాలను పునరుద్ధరించడం, వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవడం– ఇవన్నీ జరగవలసిందే. తీరప్రాంతాలలో తుఫానులు, వాయుగుండాలు సాధారణమే. ఒకనాడు నిస్సహాయంగా ప్రకృతి ప్రకోపానికి బలికావలసివచ్చేది. అప్పటి చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల వల్ల, సాంకేతిక విజ్ఞానంలో సాధించిన ప్రగతి కారణంగా, ముందస్తు హెచ్చరికలు, సురక్షిత ప్రాంతాలకు తరలింపులు వేగంగా చేస్తూ, ప్రాణనష్టాన్ని కనీసస్థాయికి తగ్గించగలిగాము. కానీ, ఆస్తినష్టానికి, పంటనష్టానికి చేయగలిగింది ఏమీ లేదు. సమాజం సామూహికంగా ఆ నష్టాలను భర్తీచేయవలసిందే. బహుశా, ఆ నష్టాలను కూడా మరింత తగ్గించగలిగే వైజ్ఞానిక పురోగతి మున్ముందు వస్తుందేమో? 


అల్పపీడనాలు, వాయుగుండాలు సహజమైనవని మనం అనుకుంటున్నాము కానీ, అకాలంలో వర్షాలు రావడం, వచ్చినప్పుడు అసాధారణ స్థాయిలో వర్షపాతం ఉండడంలో మానవదోషం కూడా ఉండవచ్చునని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాము. వాతావరణం వేడెక్కుతున్నది, మనమే వేడెక్కిస్తున్నాము. సముద్రమట్టాలు పెరుగుతున్నాయి, హిమ ధ్రువాలు కరిగిపోతున్నాయి, ఓజోన్‌ పొర చీలికలు పీలికలు అవుతున్నది. వీటన్నిటి వల్ల రుతుగతులు చెదిరిపోతున్నాయి. ప్రపంచమంతా ఒక్కటై చేయవలసిన మహాప్రయత్నం చేస్తే ఈ పర్యావరణ క్షీణతను నిరోధించవచ్చు. 


మానవకల్పిత ఉత్పాతాలకు కారణమయిన వాటిలో మితిమీరిన పట్టణీకరణ కూడా ఒకటి. ఈ పట్టణీకరణ మొత్తంగా పర్యావరణానికి చేస్తున్న చెరుపు ఒక ఎత్తు, పట్టణాలలో నివసించే అసంఖ్యాక మానవాళికి కలిగిస్తున్న హాని మరొక ఎత్తు. సాధారణంగా, పల్లెల కంటె మెరుగైన ప్రాథమిక వసతులు, విలాస సదుపాయాలు ఉంటాయని భావించే పట్టణాలు, ఉపద్రవం వచ్చినప్పుడు, కుదేలయిపోతాయి. అసహాయంగా అలమటించిపోతాయి. ప్రస్తుత భారీవర్షాలు తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాలను, చిన్నపట్టణాలను ప్రభావితం చేసిన తీరు వేరు, హైదరాబాద్‌ మహానగరాన్ని అతలాకుతలం చేసిన తీరువేరు. దాదాపు కోటి మంది జనాభా కాళ్లకింది నేల కదిలిపోయినట్టు విలవిలలాడిపోయింది. వర్షపాతం అసాధారణంగా ఉన్నది నిజమే కానీ, ప్రస్తుత దుస్థితికి మానవ తప్పిదం కారణం కాదని ఎవరు వాదించినా అది పొరపాటే. తప్పిదం అన్న మాట చిన్నది, మృదువైనది. బాధ్యతారాహిత్యం, నేరం, దుర్మార్గం, ఇటువంటి మాటలన్నిటికీ అర్హమైన వైఖరిని ప్రభుత్వాలు ప్రదర్శిస్తూ వచ్చాయి. 


హైదరాబాద్‌ దుఃఖదాయిని సెప్టెంబర్‌ మాసం అంటారు. అందుకు కారణం 1908 నాటి మూసీ వరదలు. వేలాది మంది మరణించిన ఉపద్రవం అది. సహాయకార్యక్రమాలు చేయడానికి ఆనాడు అందుబాటులో ఉన్న సాధనాలు కూడా పరిమితం. అయినప్పటికీ, అప్పటి ప్రభుత్వం, సామాజిక సేవకులు చేయగలిగినంత చేశారు. ఒకసారి ప్రమాదం వచ్చిన తరువాత చేయగలిగింది కొద్దిపాటే అని తెలిసిన అప్పటి పాలకులు, ఈ వరదలను శాశ్వతంగా నివారించడానికి ఏమి చేయాలో ఆలోచించి, అప్పుడు అందుబాటులో ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్‌ నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహాయం తీసుకుంది. ఆయన పరిస్థితిని సమీక్షించి, సూచనలు చేశారు. ఆ సూచనలను ప్రభుత్వం తూచ తప్పకుండా పాటించింది. జంటజలాశయాలను నిర్మించింది. హైదరాబాద్‌కు మురుగునీటి పారుదల, వరదనీటి పారుదల వ్యవస్థలను రూపొందించింది. 


జంటజలాశయాలు హైదరాబాద్‌ను చాలాకాలం వరదలనుంచి కాపాడాయి. 1970లో మూసీ కట్టలు తెంచుకుంది. 1994, 2000, 2009, 2015, 2016, ...ఇప్పుడు 2020– ఏదో ఒక స్థాయిలో భారీవర్షాలు నగరాన్ని తలకిందులు చేశాయి. 2000 వరదల తరువాత అనేక అధ్యయనాలు జరిగాయి. ప్రభుత్వ ఆదేశంపైన కమిటీలు పనిచేశాయి, నివేదికలు చేరాయి. 2016లో కూడా నగరంలో వరదనీటి పారుదలకు అవరోధంగా ఉన్న ఆక్రమణల విషయమై ఒక కమిటీ వేశారు. సిఫార్సులను ఆమోదించడానికి, అమలుచేయడానికి సంకల్పం లేకపోవడమో, సాధ్యం కాకపోవడమో జరుగుతోంది. బహుశా ఇప్పుడు కూడా దీర్ఘకాలికమైన చర్యలు ఏవీ ఉండవు. ప్రస్తుతానికి గాయానికి కట్టుకట్టి ఊరుకుంటారు. వ్యాధి లోపల ముదురుతూనే ఉంటుంది. 


జంటనగరాలలో మురుగునీటి పారుదలను, వరదనీటిపారుదలను అసాధారణ వర్షాల సమయంలో కూడా నిర్వహించగలిగే శాశ్వత వ్యవస్థను సంకల్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు. దానితోపాటు, జలదేవతల దారులను కొల్లగొట్టే ఆక్రమణలకు అవకాశం లేని పట్టణ ప్రణాళిక రచన జరిగితేనే ఫలితం ఉంటుంది.


Updated Date - 2020-10-16T05:28:57+05:30 IST