TS News: తెలంగాణ ధనిక రాష్ట్రం: కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-08-17T22:52:11+05:30 IST

TS News: తెలంగాణ ధనిక రాష్ట్రం: కేసీఆర్‌

TS News: తెలంగాణ ధనిక రాష్ట్రం: కేసీఆర్‌

హైదరాబాద్: తెలంగాణ (Telangana) ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రకటించారు. కొందరు మూర్ఖులు తెలివి తక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ను కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని చూసి దేశమంతా నివ్వెరపోతోందని తెలిపారు. ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే దెబ్బతింటారని హెచ్చరించారు. మతం, కులం పేరిట దేశాన్ని విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ఏ రకంగానూ ప్రజలకు మంచిది కాదని సూచించారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఒకసారి దెబ్బతిన్నామంటే మళ్లీ ఏకం కావడం అంత సులభం కాదన్నారు. చైనా, సింగపూర్‌ (China Singapore) తరహాలో కుల, మతాలకు అతీతంగా పనిచేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి మిగిలిన చోట్ల ఎందుకు జరగడం లేదు? అని ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వాళ్లు ఉంటారని, ప్రజలంతా ఐకమత్యంగా చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పొరపాటు చేస్తే మళ్లా గోస పడతామని, ఇప్పుడిప్పుడే మనం కోలుకుంటున్నామని, ఈ శాంతిని, స్వేచ్ఛను, మన ఆస్తుల్ని కాపాడుకోవాలని కోరారు. 


‘‘మేడ్చల్‌ జిల్లా (Medchal district) అవుతుందని ఎవరూ ఊహించలేదు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైంది. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్ల జిల్లాల ఏర్పాటు చేశాం. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరకు వస్తే అంత వేగంగా పనులు జరుగుతాయి. మరో 10 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. అందరికీ కొత్త కార్డులు ఇస్తున్నాం. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. ఢిల్లీలో కూడా కరెంట్‌ సమస్యలున్నాయి. దేశంలో 75 ఏళ్ల నుంచి అసమర్థ పరిపాలన.. తెలివి తక్కువ పరిపాలన వల్లే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాం. మన జీఎస్‌డీపీ రూ.11 లక్షల 55 వేల కోట్లుగా ఉంది. 12 రాష్ట్రాల నుంచి వలస వచ్చి తెలంగాణలో బతుకుతున్నారు. ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నాం. మేడ్చల్‌ జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యేకు అభివృద్ధి కార్యక్రమాల కోసం మరో రూ. 10కోట్లు మంజూరు చేస్తాం. మిషన్‌ భగీరథతో రాష్ట్రంలో నీటికొరత తీర్చుకున్నాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.

Updated Date - 2022-08-17T22:52:11+05:30 IST