KCR Bangalore Tour: రెండుమూడు నెలల్లో సంచలన వార్త చెబుతా: తెలంగాణ సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-05-26T22:53:18+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో..

KCR Bangalore Tour: రెండుమూడు నెలల్లో సంచలన వార్త చెబుతా: తెలంగాణ సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యమని, రెండుమూడు నెలల్లో సంచలన వార్త చెప్తానని కేసీఆర్‌ వ్యాఖ్యానించడం విశేషం. కాంగ్రెస్, బీజేపీ ఎవరొచ్చినా దేశానికి ఒరిగిందేమీ లేదని, ఉజ్వల్‌ భారత్‌ కావాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. భారత్‌లో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయని, దేశంలో అపారమైన యువశక్తి ఉందని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌యేతర కూటమే లక్ష్యంగా కేసీఆర్ కొంత కాలంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. పలు రాష్ట్రాల్లో బీజేపీతో రాజకీయంగా విభేదిస్తున్న పలు పార్టీల నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ గ్యాప్ రానురానూ పెరుగుతోంది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఈ దూరానికి మరోసారి సాక్ష్యంగా నిలిచింది.



ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు వచ్చారు. ప్రధానికి స్వాగతం పలకాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆయన ఇక్కడ అడుగు పెట్టడానికి ముందే బెంగళూరు పర్యటనకు వెళ్లిపోయారు. ప్రధాని హైదరాబాద్‌ నుంచి వెళ్లిన తర్వాతే కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌లో అడుగు పెట్టే అవకాశముంది. ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ మధ్య ఇప్పటికే గ్యాప్‌ పెరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5న ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చారు. దానికి సీఎం కేసీఆర్‌ రావద్దంటూ పీఎంవో నుంచి తమకు సందేశం వచ్చిందని ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. దీనిని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఖండించారు కూడా. ఇక, సమతా మూర్తి శిలా ఫలకంపైనా కేసీఆర్‌ పేరు పెట్టలేదు. దాంతో, శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి ముఖ్యమంత్రి స్వాగతం పలకలేదు. వీడ్కోలు కూడా చెప్పలేదు. అప్పటి నుంచే పీఎం, సీఎం మధ్య పొరపొచ్చాలు ప్రారంభమయ్యాయని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. అప్పటి నుంచి ప్రధానిని కలిసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం లేదు. ఇప్పుడు మరోసారి ప్రధాని నగరానికి వచ్చినా పట్టించుకోలేదని తెలుస్తోంది.

Updated Date - 2022-05-26T22:53:18+05:30 IST