తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేంద్రానికి KCR స్ట్రాంగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2022-06-02T15:49:06+05:30 IST

నగరంలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేంద్రానికి KCR స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్: నగరంలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం... కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని అనేకసార్లు ప్రధానిని అడిగినా ఫలితం లేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయ పరమైన నిధులపై కేంద్రం కోత విధించిందని విమర్శించారు.  ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దారుణంగా విఫలం అయిందన్నారు. రైతాంగ సమస్యలపై కేంద్ర మంత్రులు హేళనగా మాట్లాడారని చెప్పారు. దేశంలో రైతులు బిక్షగాళ్ళు కాదని... రైతులతో పెట్టుకోవద్దని కేసీఆర్ మరోసారి కేంద్రాన్ని ముఖ్యమంత్రి హెచ్చరించారు.


రాష్ట్రాలను బలహీన పరచాలని చూస్తే సహించేది లేదన్నారు. తెలంగాణలో ఐటిఐఆర్ రాకుండా కేంద్ర అడ్డు పడిందని తెలిపారు. బయ్యారం స్టీల్, కాజీపేట పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో తీరని అన్యాయం చేసిందని అన్నారు. నియోజకవర్గాలను డీలిమిట్ చేయాలని పునర్వ్యవస్తీకరణ చట్టంలో ఉన్నా కావాలనే కాలయాపన చేస్తోందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల కోసం కేంద్రనికి లేఖ రాసినట్లు తెలిపారు. ఎఫ్ఆర్బీఎంకు లోబడే కేంద్రాన్ని అప్పులు అడిగినట్లు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్ష పాటిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణ వల్ల తెలంగాణ ఐదేళ్లలో 25వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని కేసీఆర్ తెలిపారు. 


తెలంగాణకు గుదిబండలా కేంద్ర వైఖరి...

దేశంలో బలమైన కేంద్రం.. బలహీన రాష్ట్రాలు అనేలా పాలన ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరిందన్నారు. రాష్ట్రాలను కేంద్రం ఆర్థికంగా బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తున్నారని తెలిపారు. హైకోర్టును విభజించకుండా ఐదేళ్లు తాత్సారం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్ర వైఖరి గుదిబండలా మారిందన్నారు. రాష్ట్రాలపై ఆంక్షలను కేంద్రం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయిందన్నారు. దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిదని ప్రశ్నించారు. ఐదేళ్లకోసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యంకాదని... సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలని అన్నారు. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలని... దేశంలో గుణాత్మక మార్పు రావాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. అంతకుముందు తెలంగాణ అమర వీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. 

Updated Date - 2022-06-02T15:49:06+05:30 IST