Komatireddy Venkatreddy కాంగ్రెస్‌లోనే ఉంటారా?

ABN , First Publish Date - 2022-08-19T02:24:14+05:30 IST

కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ (Komatireddy Brothers)కు ఫైర్ బ్రాండ్ నేతలుగా పేరుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని....

Komatireddy Venkatreddy కాంగ్రెస్‌లోనే ఉంటారా?

హైదరాబాద్: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ (Komatireddy Brothers)కు ఫైర్ బ్రాండ్ నేతలుగా పేరుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఐదారు నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్‌ చేయగలరన్న టాక్‌ ఉంది. ఇలాంటి సమయంలో రాజ్‌గోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) ఎపిసోడ్‌ కాంగ్రెస్‌ను కుదిపేసింది. కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణ పాలిటిక్స్‌ హీటెక్కాయి. రాజ్‌గోపాల్‌రెడ్డి త్వరలో బీజేపీ (Bjp)లో చేరబోతుండడంతో ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది. కానీ.. వెంకట్‌రెడ్డి (Venkatreddy తీరు మాత్రం సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇటీవలి ఢిల్లీ పరిణామాలతో వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు మునుగోడు ఉపఎన్నిక (By Election) వస్తే తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేకనే నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో భాగంగానే.. ఆయన్ను దూషించిన కాంగ్రెస్ (Congress) నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పినా వెంకట్‌రెడ్డి మాత్రం ఒప్పుకోవడం లేదట. ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోనే.. రోజుకో కొత్త మెలిక పెడుతూ అనుమానాలకు తావిస్తున్నారట.


మునుగోడు కార్యకర్తల భరోసా సభలో నోరుజారిన అద్దంకి దయాకర్‌.. మరుసటి రోజే మీడియా సాక్షిగా క్షమాపణలు చెప్పారు. కానీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం.. రేవంత్‌రెడ్డి కూడా సారీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సారీ చెప్పారు. కానీ వెంకట్‌రెడ్డేమో అద్దంకిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు కూడా ఖంగు తింటున్నాయి. సాక్ష్యాత్తూ రేవంత్‌రెడ్డే సారీ చెప్తే వెంకట్‌రెడ్డి ఎందుకు బెట్టు చేస్తున్నారన్న ప్రశ్నలు కాంగ్రెస్ ముఖ్య నేతల మదిలోనూ మెదులుతున్నాయట. ఓ పక్క రాజ్‌గోపాల్‌రెడ్డిపై ప్రజల్లో ఇమేజ్ పోయేలా పోస్టర్లు వేసినా పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన పర్యటించినా వెంకట్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 


మరోవైపు రాజ్‌గోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచే మునుగోడులో కాంగ్రెస్ బలోపేతానికి పార్టీ వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల్లోనూ వెంకట్‌రెడ్డి పాల్గొనకుండా పార్టీ పెద్దలే చూసుకుంటారనడం అటు కాంగ్రెస్‌తోపాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక వరుస పరిణామాలను గమనిస్తున్న కాంగ్రెస్‌ ముఖ్యులు వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారని అభిప్రాయ పడుతున్నారట. అయితే సోదరుడి విషయంలో వెంకట్‌రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకే పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కరుడు కట్టిన కాంగ్రెస్ నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. ప్రజల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ క్రమంలో ఇటీవల బర్త్‌ డే సందర్భంగా నల్గొండ నుంచి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా వెంకట్‌రెడ్డి ప్రకటించారు.


ఇక అనూహ్య రాజకీయ పరిణామాల తర్వాత నల్గొండకు వచ్చిన వెంకట్‌రెడ్డిని కొంతమంది కౌన్సిలర్లు కలిశారట. బీజేపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతుందనే విషయంపై ఆరా తీశారట. దీంతో వెంకట్‌రెడ్డి తన మనోగతం బయట పెట్టేశారట. కాంగ్రెస్‌ను వీడేది లేదని 20 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా ఉందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం అవుతానని చెప్పుకొచ్చారట. అంతేకాదు.. పార్టీ మారే ఆలోచనే లేదని అవసరమైతే రేవంత్‌రెడ్డే కాంగ్రెస్‌ నుంచి బయటకు పోతారని బాంబు పేల్చారట. 


ఇదిలావుంటే కార్యకర్తలకు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ వెంకట్‌రెడ్డి మాటల వెనుక మాత్రం ఏదో జరగబోతోందోనన్న ధోరణి కనిపిస్తోందట. వాస్తవానికి.. వెంకట్‌రెడ్డి చెప్పిన పరిస్థితులు అసలు కాంగ్రెస్‌లో ఉన్నాయా అని కూడా నల్గొండ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయట. అయితే గతంలో వెంకట్‌రెడ్డి తాను సీఎం రేసులో ఉండే క్యాండెట్‌ని అన్న సందర్భాలను గుర్తు చేసుకొని ఇప్పటి మాటలు కూడా ఎంతవరకు నిజమో అని కాంగ్రెస్‌ శ్రేణులు సందిగ్ధంలో పడిపోయాయట. వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థంకాక ఆయన ముఖ్య అనుచరులు కూడా కన్ఫ్యూజన్‌లో పడిపోతున్నారట.


మొత్తంగా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారం అటు కాంగ్రెస్‌తోపాటు ఇటు నల్గొండ జిల్లాలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరబోతున్నా.. మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమని తెలుస్తున్నా.. ఆయన బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరగుతున్నా వెంకట్‌రెడ్డి మాత్రం సైలెంట్‌గా ఉండడం చర్చనీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్‌ క్యాడర్‌తోపాటు నల్గొండ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ వెంకట్‌రెడ్డి పార్టీలోనే కొనసాగుతారా లేక తమ్ముని బాటలో పయనిస్తారా అన్నది తేలాల్సి ఉంది. 



Updated Date - 2022-08-19T02:24:14+05:30 IST