ltrScrptTheme3

వాషింగ్టన్‌ డీసీలో అంబరాన్నంటిన బతుకమ్మ, దసరా సంబరాలు

Oct 18 2021 @ 10:40AM

వాషింగ్టన్‌ డీసీ: తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ యూఎస్ఏ వాషింగ్టన్‌ డీసీ చాఫ్టర్‌ ఆధ్వర్యంలో వర్జీనియాలోని అశ్‌బర్న్‌‌లో  బ్రాడ్‌ రన్‌ హైస్కూల్‌‌లో బతుకమ్మ, దసరా వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. టీడీఎఫ్‌ అధ్యక్షులు కవిత చల్ల ఆధ్వర్యంలో వినయ తిరిక్కోవల్లూరు, జీనత్‌ కుందూరు కోఆర్డినేటర్‌‌గా వ్యవహరించిన ఈ వేడుకల్లో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలను పూర్తిగా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, 12 సంవత్సరాలకు పైబడిన వారికి మాత్రమే అనుమతించారు. మేళ తాళాలతో ఊరేగింపుగా సాగిన బతుకమ్మ పండుగలో దాదాపు 800 మందికి పైగా పాల్గొన్నారు. ఆ తర్వాత బతుకమ్మలన్నిటిని ఒకచోట పెట్టి, పాటలు పాడుతూ, పాటకనుగుణంగా స్టెప్పులు వేస్తూ మహిళలు బతుకమ్మ ఆట పాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

తమ తమ బతుకమ్మలను అందంగా అలంకరించగా, చక్కటి బతుకమ్మలకు పోటీలు కూడా నిర్వహించారు. మన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ పేర్చిన బతుకమ్మలకు, బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్బంగా జరిగిన దసరా జమ్మి పూజలో తెలంగాణ డెవలప్‌ మెంట్‌ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ కవిత చల్లా, తమ కార్యవర్గ సభ్యులతో పాటు దూర ప్రాంతాల నుండి వచ్చిన చాలా మంది పాల్గొని పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అందరూ జమ్మిని ఇచ్చి పుచ్చుకుని ఆలింగనాలు చేసుకుని, బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

మహిళలు తెలంగాణ సాంప్రదాయంలో రంగు రంగుల వస్త్ర ధారణలో మెరిసిపోతూ, చూడ ముచ్చటగా అలంకరించుకునిరాగా స్కూల్‌ ఆవరణం అంతా ఒక తెలంగాణ పల్లె వాతావరణాన్ని తలపింపజేసింది. ఈ సందర్భంగా కల్పనా బోయినపల్లి నిర్వహణలో ఏర్పాటు చేసిన నగలు, బట్టలు, అలంకరణ సామగ్రిలాంటి స్టాల్స్‌‌లో మహిళలు, పురుషులు సందడిగా కనిపించారు.

తెలంగాణ రుచులతో ఏర్పాటు చేసిన ఫుడ్‌ స్టాల్స్‌‌లో అందరూ తెలంగాణ రుచులని ఆస్వాదించారు. మంజువాణి నాట్య బృందం ప్రదర్శించిన నృత్యరూపకం పలువురిని అలరించింది. నృత్యంలో ఒక ప్రత్యేక పాత్ర ద్వారా ఆకట్టుకున్న వికాస్‌, తన మిమిక్రీతో కూడా అందరినీ కడుపుబ్బ నవ్వించాడు. రవలిక బానోత్‌ 'డుక్కు డుక్కు' పాటపై చేసిన నృత్యానికి అందరూ స్టెప్పులు, ఈలలు  వేశారు. 

అమెరికా చట్ట సభలకు ఎన్నికైన కొందరు అమెరికన్‌ సభ్యులు ఈ బతుకమ్మ పండుగలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటా, వేటా, జీడబ్ల్యుటీసీఎస్‌, క్యాట్స్‌, ఉజ్వల సంస్థలు సపోర్టింగ్‌ సంస్థలుగా వ్యవహరించాయి. ఆ తర్వాత జరిగిన బతుకమ్మ నిమజ్జనం తర్వాత ఒకరికొకరు సద్దులు, పసుపు, కుంకుమలను ఇచ్చి పుచ్చుకున్నారు.  

కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పాటు అందించిన కార్యవర్గ సభ్యులు జీనత్‌ కుందురు, రామ్మోహన్‌ సూరనేని, మల్లారెడ్డి, నవీన్‌ చల్ల, రవి పళ్ళ, హర్ష రెడ్డి, నరేందర్‌‌కు మరియు స్పాన్సర్స్‌కి, వాలంటీర్స్‌కి, డీసీ వనిత లీడర్షిప్‌కి అధ్యక్షులు కవిత చల్ల పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆటా అధ్యక్షులు భువనేశ్‌ బుజాల, తానా మాజీ అధ్యక్షులు సతీష్‌ వేమన, జీడబ్ల్యుటీసీఎస్‌ మాజీ అధ్యక్షులు సత్యనారాయణ మన్నే, జీడబ్ల్యుటీసీఎస్‌ అధ్యక్షులు సుధా పాలడుగు, క్యాట్స్‌ అధ్యక్షులు సుధా కొండపు, ఉజ్వల అధ్యక్షులు అనిత ముతోజు, వేటా కార్యవర్గ లోకల్‌ టీం, ఇతర స్థానిక తెలుగు సంస్థల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కోవిడ్‌ కారణంగా గత రెండు సంవత్సరాలుగా జరపని ఈ పండుగ గత జ్ఞాపకాలని తలచుకుంటూ, కొత్త ఉత్సాహంతో ఈ బతుకమ్మ సంబరాల్లో అందరూ ఆనందంగా పాల్గొని విజయవంతం చేసిన అందరికీ ప్రెసిడెంట్‌ కవిత చల్ల, కోఆర్డినేటర్‌ వినయ, మంజు, కల్పన ధన్యవాదాలు తెలిపారు. అందరు క్షేమంగా ఉండాలి అని ప్రార్ధిస్తూ కార్యక్రమాన్ని  టీడీఎఫ్‌ యూఎస్‌ఏ అధ్యక్షురాలు కవిత చల్ల ముగించారు.


Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.