పరస్పర బదిలీలకు Telangana government అంగీకారం

ABN , First Publish Date - 2022-06-20T21:09:26+05:30 IST

ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల (మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌)కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణ వ్యాప్తంగా

పరస్పర బదిలీలకు Telangana government అంగీకారం

హైదరాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల (మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌)కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణ వ్యాప్తంగా 2,558 మంది ఉద్యోగులకు ప్రయోజనం పొందుతారు. టీచర్ల పరస్పర బదిలీలకు ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ క్యాడర్ల ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక జోన్‌ నుంచి మరో జోన్‌కు, ఒక మల్టీ జోన్‌ నుంచి మరో జోన్‌కు పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు, అధికారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే... ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పరస్పర బదిలీ కోరుకునేవారికి ఎలాంటి సీనియారిటీ రక్షణ ఉండదంటూ మొదట్లో జారీ చేసిన జీవో 21లో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 


పరస్పర బదిలీలు కోరుకునేవారి సీనియారిటీని పరిరక్షించాలని సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆ మేరకు జిల్లా క్యాడర్‌ పోస్టుల పరస్పర బదిలీలకు సీనియారిటీ రక్షణ కల్పిస్తూ మళ్లీ 402 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోపై కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. సీనియారిటీ రక్షణతో ఇతర జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగుల కారణంగా అప్పటికే ఆయా జిల్లాల్లో పని చేస్తున్న తమ సీనియారిటీలో తేడాలు వస్తాయని, కొత్తగా వచ్చేవారు తమకంటే సీనియర్లు అయ్యే అవకాశముందంటూ కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు కోర్టు 402 జీవోను సస్పెండ్‌ చేసింది. దాంతో పరస్పర బదిలీలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-06-20T21:09:26+05:30 IST