‘ఆ... పెట్రోల్‌ పంపును తరలించారో లేదో చెప్పండి’

ABN , First Publish Date - 2020-09-23T12:36:58+05:30 IST

హైదరాబాద్‌ పాతబస్తీ పేట్లబురుజులోని పోలీసుశాఖ అవసరాల కోసం నిర్వహిస్తున్న పెట్రోల్‌ పంపును సబ్‌-స్టేషన్‌ సమీపం నుంచి మరోచోటుకు తరలించారో లేదో చెప్పాలని

‘ఆ... పెట్రోల్‌ పంపును తరలించారో లేదో చెప్పండి’

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పాతబస్తీ పేట్లబురుజులోని పోలీసుశాఖ అవసరాల కోసం నిర్వహిస్తున్న పెట్రోల్‌ పంపును సబ్‌-స్టేషన్‌ సమీపం నుంచి మరోచోటుకు తరలించారో లేదో చెప్పాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 5కి వాయిదా వేసింది. హైదరాబాద్‌ పాతబస్తీ పేట్లబురుజులో పోలీసుశాఖ అవసరాల కోసం నిర్వహిస్తున్న పెట్రోల్‌ పంపునకు 15 మీటర్ల దూరంలో, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి కేవలం 2 మీటర్ల దూరంలో 132/32 కేవీ, 11/32కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ.. మొయినుద్దీన్‌ ఖాన్‌ 2018లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. పెట్రోల్‌పంపు, ప్రసూతి ఆసుపత్రి సమీపంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయడం వల్ల అనుకోని ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, సబ్‌-స్టేషన్‌ను మరో చోటుకు తరలించాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిని విచారించిన ధర్మాసనం క్షేత్రస్థాయిలో పరిశీలించి వేర్వేరుగా నివేదికలు ఇవ్వాలని జిల్లా మెజిస్ట్రేట్‌ను, చీఫ్‌ ఎలక్ర్టికల్‌ ఇన్‌స్పెక్టర్‌ను గతంలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. దీనిని పరిశీలించిన ధర్మాసనం పెట్రోల్‌పంపును మరోచోటికి తరలించారో లేదో చెప్పాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. 

Updated Date - 2020-09-23T12:36:58+05:30 IST