హైదరాబాద్‌లో నామ్‌కే వాస్తేగా ఫీవర్‌ సర్వే.. ఎందుకిలా!?

ABN , First Publish Date - 2021-05-15T17:43:47+05:30 IST

‘మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉందా..? ఇతరత్రా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా..?’ ...

హైదరాబాద్‌లో నామ్‌కే వాస్తేగా ఫీవర్‌ సర్వే.. ఎందుకిలా!?

  • జ్వరం ఉందా.. లేదా..? సరే..!
  • ఇంటింటి సర్వేలో సిబ్బంది తీరిది
  • థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయని బృందాలు
  • జ్వరం ఉన్నా.. చాలామంది చెప్పట్లేదు!
  • కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు రావడంపైనా అభ్యంతరం


హైదరాబాద్‌ సిటీ : బల్కంపేటలోని ఓ ఇంటికి వచ్చిన ఫీవర్‌ సర్వే బృందం సభ్యులు.. మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉందా..? ఇతరత్రా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా..? అని అడిగారు. ఎవరికీ జ్వరం లేదని చెప్పడంతో థర్మామీటర్‌తో పరీక్షించకుండానే వెళ్లిపోయారు. గోల్నాకలోని ఓ బస్తీలో ఇంటింటి సర్వేకు వచ్చిన సిబ్బంది కొన్ని చోట్ల ఇళ్లలో జ్వరం ఉందో లేదో పరీక్షించగా.. మరికొన్ని చోట్ల స్థానికులు చెప్పింది రాసుకొని వెళ్లిపోయారు. జగద్గిరిగుట్ట పరిధిలోని ఓ ప్రాంతంలో సర్వే బృందాన్ని అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. ‘ఇంటింటికీ వెళ్తున్న మీ వల్ల మాకు వైరస్‌ సోకితే ఎలా..?’ అని అభ్యంతరం తెలిపారు.


హైదరాబాద్‌లో కరోనా కట్టడి లక్ష్యంగా చేపట్టిన ఫీవర్‌ సర్వే సాగుతున్న తీరింది. కొన్ని చోట్ల నామమాత్రంగా పరీక్షలు చేస్తుండగా.. ఇంకొన్ని చోట్ల అది కూడా జరగడం లేదు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించాల్సిన సిబ్బంది.. వారు చెప్పింది విని వెనక్కి తిరుగుతున్నారు. కనీసం జ్వరం ఉందా..? లేదా..? అన్నదీ పరీక్షించడం లేదు. లెక్కల్లో ఇన్ని ఇళ్లు తిరిగామని చెబుతున్నా.. జ్వరం ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉండడానికి క్షేత్రస్థాయిలో సర్వే సరిగా జరగకపోవడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహానగరంలో వైరస్‌ శరవేగంగా విస్తరిస్తుండడంతో ఇంటింటికీ తిరిగి జ్వరాలు పరీక్షించే బాధ్యతలను ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖకు అప్పగించింది. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతోపాటు జీహెచ్‌ఎంసీలోని ఎంటమాలజీ వర్కర్లతో కూడిన బృందాలు నగరంలో ఫీవర్‌ సర్వే చేపట్టాయి. ఏఎంవోహెచ్‌లకు సర్వే సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. 700కు పైగా బృందాలు నిత్యం 45-50 వేల ఇళ్లలో సర్వే చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో సర్వే జరుగుతున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఏది..?

కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లకు వెళ్లి ప్రజలకు జ్వరం ఉందా..? లేదా..? అన్నది థర్మామీటర్‌తో పరీక్షించాలి. జ్వరం, జలుబు, దగ్గు, ఇతర కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి కరోనా కిట్‌ అందించాలి. ఐదు రోజుల పాటు ఇచ్చిన మందులు వాడాలని, ఈ లోపు ఏదైనా ఇబ్బంది ఉంటే జీహెచ్‌ఎంసీలోని కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి వైద్య సలహాలు పొందాలని సర్వే బృందాలు ప్రజలకు చెప్పాలి. జ్వరం వచ్చిన వారిని గుర్తించి బయటకు రాకుండా చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తి తగ్గించవచ్చన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కానీ, సర్వే చేస్తున్న బృందాలు మాత్రం ఇష్టానికి వ్యవహరిస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయాలన్న ప్రాథమిక విషయాన్నీ సిబ్బంది విస్మరిస్తున్నారు. 


ఇక ప్రజలు కూడా సహకరించడం లేదు. సర్వే బృందాలు జ్వరం ఉన్నట్టు గుర్తిస్తే ఇరుగు పొరుగుకు తెలుస్తుందన్న భయంతోనూ కొందరు వాస్తవాలు దాస్తున్నారు. ఇళ్లకు వెళ్తున్న బృందాలు ఆ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తే తప్ప ఎందరికి జ్వరం ఉంది..? ఎవరికి లేదు..? అన్నది తెలిసే అవకాశం లేదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. అడిగి వెళ్లిపోతే సర్వే చేయడం అనవసరమన్నారు.

Updated Date - 2021-05-15T17:43:47+05:30 IST