పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ

ABN , First Publish Date - 2022-05-21T08:59:45+05:30 IST

‘‘తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఒక రోల్‌ మోడల్‌గా మారింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న సంక్షోభ పరిస్థితులన్నింటినీ అధిగమించాం.

పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ

  • ఇందుకు పాలనా సంస్కరణలే కారణం
  • తెలంగాణ విజయాలను చాటాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఒక రోల్‌ మోడల్‌గా మారింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న సంక్షోభ పరిస్థితులన్నింటినీ అధిగమించాం. ఈ రోజు తెలంగాణ ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తూ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడానికి పరిపాలనా సంస్కరణలే ప్రధాన కారణం. కేవలం పెట్టుబడులకు కేంద్ర బిందువుగానే కాకుండా ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులోనూ రాష్ట్రం ఎంతో ముందుంది’’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇంగ్లాండ్‌  పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం లండన్‌ హైకమిషన్‌ కార్యాలయంలోని నెహ్రూ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌, బ్రిటన్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ చర్చాగోష్ఠిలో మంత్రి కేటీఆర్‌ అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ కాలంలో పూర్తిచేసిన తీరును ఈ సందర్భంగా ఆయన వివరించగా.. సమావేశానికి హాజరైనవారు చప్పట్లతో అభినందించారు. తెలంగాణ సాధించిన విజయాలను రాష్ట్రానికి పరిమితం చేయకుండా భారతదేశ విజయాలుగా పరిగణించి, ప్రపంచానికి చాటాల్సిన అవసరముందన్నారు. ప్రపంచంతో పోటీపడి ముందుకు పోవాలంటే భారతదేశంలో అద్భుతమైన విప్లవాత్మక పాలనా సంస్కరణలు అవసరం అని అన్నారు. స్నేహపూర్వక వాతావరణంతో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తే దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకుపోతోందని పేర్కొన్నారు.  


వేదాంత గ్రూప్‌ చైర్మన్‌కు  ఆహ్వానం

తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను పరిశీలించడానికి హైదరాబాద్‌కు రావాలని వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ వేద్‌జీని మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించారు. శుక్రవారం లండన్‌లో ఆయనతో భేటీ అయ్యారు. 

Updated Date - 2022-05-21T08:59:45+05:30 IST