నగర శివార్లకు సీఎం వరాలు

ABN , First Publish Date - 2022-08-18T14:46:14+05:30 IST

నగర శివార్లకు సీఎం వరాలు

నగర శివార్లకు సీఎం వరాలు

మేడ్చల్‌ జిల్లాలోని నియోజకవర్గాలకు రూ. 70 కోట్లు 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): నగర శివార్లలోని నియోజకవర్గాలకు సీఎం వరాల జల్లు కురిపించారు. మేడ్చల్‌ జిల్లాలో కలిసి ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కోదానికి అదనంగా రూ.10 కోట్ల నిధులు అందచేస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడారు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వం రూ. 5 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తోందని, అదనంగా మరో రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మేడ్చల్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాలకు ఈ నిధులు అందచేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం జీవో జారీ చేస్తామన్నారు. త్వరలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. 


సీఎం పర్యటన ఇలా..

హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 3.36 గంటలకు అంతాయిపల్లిలోని మేడ్చల్‌ జిల్లా నూతన కలెక్టరేట్‌కు సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. ఆయనకు మంత్రి మల్లారెడ్డితో పాటు కలెక్టర్‌ హరీష్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు. 3.49 గంటలకు సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్‌ చాంబర్‌లోని కుర్చీలో హరీ్‌షను కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు. కలెక్టర్‌ హరీష్‌ దంపతులు, ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు జ్ఞాపికలను అందజేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన రాకకు అరగంట ముందే ట్రాఫిక్‌ను నిలిపేయడంతో జనం ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2022-08-18T14:46:14+05:30 IST