అప్పు పుట్టలే!

ABN , First Publish Date - 2022-05-28T07:35:53+05:30 IST

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. అప్పు కోసం సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్ర ప్రభుత్వం

అప్పు పుట్టలే!

ఆర్బీఐ ఈ-వేలంలో కనిపించని రాష్ట్ర ఇండెంట్‌

కేంద్రం నుంచి అనుమతి ఇంకా లభించనట్లే..

ఏపీ సహా 11 రాష్ట్రాలకు 21,450 కోట్లకు ఓకే

రాష్ట్రం 31న తీసుకోవాల్సిన 3000 కోట్లకు నీళ్లు

ఇప్పటివరకు రూ.11 వేల కోట్ల అప్పు చేజారినట్లే

జూన్‌ నెలలో ప్రభుత్వానికి గడ్డు కాలమే

సొంత రాబడి నెలకు సగటున 10-12 వేల కోట్లు

అత్యవసరంగా సర్దాల్సిన మొత్తం 13,200 కోట్లు

రైతుబంధు అమలుకే రూ.7,600 కోట్లు అవసరం

వేతనాలు, పింఛన్లకు 4000 కోట్లు 

వడ్డీ చెల్లింపులకు 1600 కోట్లు

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. అప్పు కోసం సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కనికరించలేదు. ఈనెల 31న తీసుకోవాల్సిన రూ.3000 కోట్ల అప్పునకు అనుమతి ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలకు రూ.21,450 కోట్ల అప్పులను అనుమతించిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ అప్పునకు మాత్రం ఓకే చెప్పలేదు. ఈనెల 31న ఏయే రాష్ట్రాలు ఎంత అప్పు తీసుకోవడానికి అనుమతిస్తున్నారో పేర్కొంటూ ఆర్బీఐ శుక్రవారం షెడ్యూల్‌ జారీ చేసేసింది. దాని ప్రకారం..పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకోవడానికి అనుమతించింది. మరో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర ఏకంగా రూ.6000 కోట్ల అప్పు తీసుకోనుంది. తమిళనాడుకు రూ.2000 కోట్లు, కేరళకు రూ.1,500 కోట్ల అప్పునకు కేంద్రం అనుమతించింది. రాష్ట్రానికి మాత్రం మళ్లీ మొండి చెయ్యి చూపింది. దాంతో, ఆర్బీఐ ఈనెల 31న నిర్వహించే ఈ-వేలం పాటకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇండెంటు పెట్టుకోలేకపోయింది. ఈ రూ.3000 కోట్ల అప్పు కూడా చేజారుతుండడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అందాల్సిన రూ.11,000 కోట్ల అప్పు చేతికి రాకుండాపోయినట్లే.

రెండు నెలల్లో 11 వేల కోట్లు ఫట్‌

ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ‘స్టేట్‌ డెవల్‌పమెంట్‌ లోన్స్‌ (ఎస్‌డీఎల్‌)’ను సేకరిస్తుంటాయి. వీటి కింద రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.55,570 కోట్ల రుణాలు తీసుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఇందులో మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో రూ.15 వేల కోట్ల అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే, బడ్జెట్‌లో చూపిన అప్పులతోపాటు వివిధ కార్పొరేషన్ల కోసం తీసుకుంటున్న గ్యారంటీ అప్పులను కూడా కలిపి లెక్కిస్తామని, అవి ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిమితికి లోబడి ఉంటేనే అనుమతిస్తామని కేంద్రం మెలిక పెట్టిన విషయం తెలిసిందే. దాంతో, ఏప్రిల్‌లో రావాల్సిన రూ.3000 కోట్ల అప్పు రాలేదు. ఈనెల 2న రూ.3000 కోట్లు, 17న రూ.2000 కోట్ల అప్పు తీసుకోవాల్సి ఉండగా కేంద్రం అనుమతించకపోవడంతో ఆర్బీఐ ద్వారా అప్పు తీసుకోలేకపోయింది. తాజాగా 31వ తేదీన తీసుకోవాల్సిన రూ.3000 కోట్ల అప్పునకూ ఎదురు దెబ్బ తగిలింది. దీనికి ఇండెంట్‌ పెట్టాలంటే కేంద్రం నుంచి అనుమతి లభించాల్సి ఉంది. ఈసారి అనుమతి వస్తుందని రాష్ట్ర అధికారులు ఆశలు పెట్టుకున్నారు. కార్పొరేషన్లకు చెల్లించే సామర్థ్యం ఉందంటూ పలుమార్లు లేఖల ద్వారా వివరించినా.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్‌ను కలిసి వచ్చినా అప్పులపై ఎలాంటి స్పష్టత రాలేదు. దాంతో ఇండెంట్‌ పెట్టలేకపోయింది. ఈ రెండు నెలల్లో రూ.11 వేల కోట్ల అప్పు లభించకపోవడంతో జూన్‌లో తీసుకోవాల్సిన మిగతా రూ.4000 కోట్ల అప్పుపైనే ఆశలు పెట్టుకోవాలి.

గడ్డు కాలం... గట్టెక్కేదెలా?

అప్పులు పుట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర భారం పడబోతోంది. రెవెన్యూ రాబడులను నమ్ముకుని కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రాబడులైనా ప్రభుత్వ పథకాలు, వేతనాలు, వడ్డీ చెల్లింపులకు సరిపోతాయా అంటే కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. జూన్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కోక తప్పదని వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల మద్యం రేట్లను పెంచినా వచ్చే అదనపు రాబడి రూ.2000 కోట్ల వరకే ఉంటుందని అంచనా. ఇక, భూముల అమ్మకం కూడా పెద్దగా సాగడం లేదు. పన్నేతర రాబడుల కింద రావాల్సిన రూ.25,421 కోట్లలో రూ.15,500 కోట్లను భూముల అమ్మకం ద్వారా పొందాల్సి ఉంది. ఈ భూ విక్రయ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. నెలకు సగటున రూ.16 వేల కోట్ల నిధులను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పులు, గ్రాంట్లను పక్కన పెడితే.. రాష్ట్ర సర్కారుకు వచ్చే సొంత ఆదాయం నెలకు రూ.10 నుంచి 12 వేల కోట్ల వరకూ ఉంటుంది. ఏప్రిల్‌ నెలలో వచ్చిన ఆదాయం రూ.10 వేల కోట్లలోపే ఉండడం గమనార్హం. ఇందులో ఉద్యోగుల వేతనాలు, సర్వీసు పెన్షనర్ల పింఛన్లకే నెలకు రూ.4000 కోట్లు కావాలి. వడ్డీ చెల్లింపుల కోసం మరో రూ.1600 కోట్లు అవసరం. ఇతర ప్రభుత్వ పథకాలను పక్కన పెట్టినా.. జూన్‌లో రైతుబంధుకు రూ.7,600 కోట్లు సర్దాలి. అంటే.. వచ్చే నెలలో తప్పనిసరిగా ఖర్చు చేయాల్సిన నిధులు రూ.13,200 కోట్ల వరకూ ఉన్నాయి. వీటిని సమకూర్చడానికే అధికారులు నానా తంటాలు పడుతున్నారు. దీనినిబట్టి.. వచ్చే నెలలో మిగిలిన సంక్షేమ పథకాల అమలు కష్టమే. ప్రస్తుత పరిస్థితుల్లో జూన్‌ నెల గడవడం కష్టమేనని తెలుస్తోంది.

ఏప్రిల్‌ రాబడి రూ.9,983 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల అయిన ఏప్రిల్‌లో రెవెన్యూ రాబడుల కింద సర్కారుకు రూ.9,983.80 కోట్ల రెవెన్యూ రాబడి సమకూరింది. ఇందులో పన్నుల రాబడి రూ.9,291.97 కోట్లు. ఈ మేరకు కాగ్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ నివేదిక సమర్పించింది. జీఎస్టీ కింద రూ.3,387.66 కోట్లు (7.34ు), స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కింద రూ.1,342.25 కోట్లు (8.60ు), సేల్స్‌ ట్యాక్స్‌ కింద రూ.2,308.41 కోట్లు (7ు), ఎక్సైజ్‌ సుంకాల కింద రూ.1,047.03 కోట్లు (5.98ు), కేంద్ర పన్నుల్లో వాటా కింద 597.77 కోట్లు(4.82ు), ఇతరాల కింద రూ.608.81 కోట్లు సమకూరాయి. రాష్ట్ర ప్రభుత్వం నమ్ముకున్న కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద పెద్దగా నిధులు రాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.41,001.73 కోట్లను అంచనా వేయగా.. మొదటి నెలలో వచ్చింది రూ.189.66 కోట్లే (0.46ు). పన్నేతర రాబడి కింద కూడా రూ.502.17 కోట్లే (1.98ు) సమకూరాయి. ఇక, ఏప్రిల్‌లో వడ్డీ చెల్లింపులకు రూ.1,631.62 కోట్లు, వేతనాలకు రూ.3,271.65 కోట్లు, పెన్షన్లకు రూ.1,468.30 కోట్లు, సబ్సిడీలకు రూ.770.39 కోట్లు, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు రూ.2,043.63 కోట్లు ఖర్చు చేసింది. అంటే.. ఏప్రిల్‌లో 9,983 కోట్లు వస్తే.. 9,455 కోట్లను ఖర్చు చేసింది. వివిధ మార్గాల్లో ఏప్రిల్‌లో సర్కారు తీసుకున్న అప్పు రూ.264 కోట్లు!!

Updated Date - 2022-05-28T07:35:53+05:30 IST