గర్భిణులను అక్కున చేర్చుకుంటూ కొవిడ్‌ నుంచి రక్ష

ABN , First Publish Date - 2021-04-26T05:30:00+05:30 IST

ఈ సమయంలో ఆసుపత్రిలో అడుగు పెట్టాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ నెలలు నిండిన గర్భిణుల సంగతేంటి? ఒకవేళ వాళ్లు కొవిడ్‌ బారినపడితే వారికి ప్రసవం చేసేదెవరు? తల్లీబిడ్డలను సంరక్షించి సురక్షితంగా ఇంటికి చేర్చేదెవరు? ఇలాంటి పరిస్థితుల్లో మేమున్నాం అంటూ అక్కున చేర్చుకుంటున్నారు నిర్మల్‌ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రి వైద్యులు...

గర్భిణులను అక్కున చేర్చుకుంటూ కొవిడ్‌ నుంచి రక్ష

ఈ సమయంలో ఆసుపత్రిలో అడుగు పెట్టాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ నెలలు నిండిన గర్భిణుల సంగతేంటి? ఒకవేళ వాళ్లు కొవిడ్‌ బారినపడితే వారికి ప్రసవం చేసేదెవరు? తల్లీబిడ్డలను సంరక్షించి సురక్షితంగా ఇంటికి చేర్చేదెవరు? ఇలాంటి పరిస్థితుల్లో మేమున్నాం అంటూ అక్కున చేర్చుకుంటున్నారు నిర్మల్‌ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రి వైద్యులు. కరోనా సోకిన గర్భిణులకు ప్రసవాలు చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆ విశేషాలు ఇవి...


కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయి. ఓవైపు ఆక్సిజన్‌ కొరత, మరోవైపు ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేక, చికిత్స అందక రోగులు భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కష్టకాలంలో నిర్మల్‌ జిల్లాలో ప్రభుత్వ మహిళా వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు. కరోనా భయంలోనూ గర్భిణులకు ప్రసవాలు చేస్తూ అన్ని వర్గాల ప్రశంసలను అందుకుంటున్నారు. 


నిర్మల్‌ జిల్లాలో గడిచిన పక్షం రోజుల వ్యవధిలో పదమూడు మంది కరోనాతో బాధపడుతున్న గర్భిణులకు ప్రసవాలు జరిగాయి. ఇందులో భైంసా ఏరియా ఆసుపత్రిలోనే పది మందికి ప్రసవాలు జరిగాయి. ఈ ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళా వైద్యురాలు డాక్టర్‌ వనిత తన సిబ్బంది సహకారంతో ఈ ప్రసవాలను విజయవంతంగా పూర్తిచేశారు. కరోనా సోకిన ఈ గర్భిణులు ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ‘‘ఇప్పుడు మేము ప్రసవాలు చేయలేం’’ అంటూ మోహం చాటేశారు. దీంతో వాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో భైంసా ఏరియా ఆసుపత్రిలో చేరారు. ఆపత్కాలంలో వచ్చిన గర్భిణుల పరిస్థితిని చూసి చలించిన మహిళా వైద్యులు కరోనా విపత్కర పరిస్థితులను సైతం లెక్క చేయకుండా ప్రసవాలు చేశారు. డాక్టర్‌ వనిత నేతృత్వంలో ఆరు సాధారణ ప్రసవాలు నిర్వహించారు. అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సురేందర్‌, వనజల నేతృత్వంలో మరో నాలుగు ప్రసవాలు జరిగాయి. అలాగే నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ప్రసూతి వైద్యశాలలో డాక్టర్‌ రజిని, డాక్టర్‌ మమతలు సైతం తమ సిబ్బంది సహకారంతో కరోనా మహమ్మారి కాలంలో నిరుపేద గర్భిణులకు అండగా నిలిచి ప్రసవాలు చేశారు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా.. కరోనా సోకిన గర్భిణులకు ప్రసవాలు చేయడంతో మహిళా వైద్యులకు, పారామెడికల్‌ సిబ్బందికి అభినందనలు వెల్లువెత్తాయి.






సాటి మహిళగా సేవలు అందించా..

మేము నిత్యం రోగులకు, ముఖ్యంగా గర్భిణులకు సేవలు అందించే పనిలో బిజీగా ఉంటాం. అందులోనూ కరోనా కష్టకాలంలో ఆసుపత్రికి వస్తున్న గర్భిణులు కొవిడ్‌ బారిన పడి రావడం అంటే బాధాకరమే. ఈ సమయంలో ప్రసవం చేయకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. సాటి మహిళగా ఆసుపత్రికి వస్తున్న కొవిడ్‌ బాధిత గర్భిణులను చేరదీసి వైద్య సేవలు అందిస్తున్నాం. ఇందుకు సంబంధించి అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పుట్టే బిడ్డ ప్రమాదంలో పడుతుందా? అన్న దాని కంటే ఎక్కువగా గర్భిణుల ప్రాణాపాయ స్థితిపై మేము దృష్టి పెట్టి సేవలు అందిస్తున్నాం. నిజంగా ఈ పరిస్థితుల్లో కొవిడ్‌ మాకు కూడా సోకుతుందని తెలుసు. కానీ గర్భిణులకు ఎలాంటి హాని జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే విజయవంతంగా ప్రసవాలు చేస్తున్నాం. ఇందులో అనస్థీషియా వైద్యులు, తమ ఆస్పత్రి సిబ్బంది సహకారం మరువలేం.

- డాక్టర్‌ వనిత 

భైంసా ఏరియా ఆసుపత్రి వైద్యురాలు





మా సిబ్బంది కృషి వెల కట్టలేనిది

నిర్మల్‌ జిల్లాలో ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న కొవిడ్‌ గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయడమంటే మామూలు విషయం కాదు. కరోనా కష్టకాలంలోనూ గర్భిణులకు సేవలు అందిస్తున్న మా వైద్య సిబ్బంది కృషి వెల కట్టలేనిది. వైద్యులతో పాటు స్టాఫ్‌ నర్సులు, మహిళా సిబ్బంది ఇందులో భాగస్వాములు అవుతున్నారు. వారి ప్రాణాలను లెక్క చేయకుండా అందిస్తున్న సేవలు అనిర్వచనీయం. ఇలాంటి కష్టకాలంలో సేవలు అందిస్తున్న వారికి ప్రోత్సాహకాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటాం. 

- డాక్టర్‌ దేవేందర్‌ రెడ్డి

నిర్మల్‌ జిల్లా ఆసుపత్రుల 

కో ఆర్డినేటర్‌



ట్విట్టర్‌లో కల్వకుంట్ల కవిత అభినందన 

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గర్భిణులకు విశిష్ట సేవలు అందిస్తున్న నిర్మల్‌ జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రి వైద్యాధికారులను, సిబ్బందిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌ ద్వారా అభినందించారు. కరోనా పాజిటివ్‌ గర్భిణులకు శస్త్ర చికిత్స నిర్వహించి.. తల్లీబిడ్డలు సురక్షితంగా ఉండేలా చూసిన ఏరియా ఆస్పత్రి స్త్రీ వైద్య నిపుణురాలు డా. సోమ వనితను కవిత ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ విశిష్ట సేవలు అందించడం గొప్ప విషయమని కవిత కొనియాడారు. 

- కొండూరి రవీందర్‌, నిర్మల్‌




Updated Date - 2021-04-26T05:30:00+05:30 IST