గల్ఫ్ దేశాల్లో NRI లను ఇబ్బందుల్లో నెడుతున్న సోషల్ మీడియా పోస్టులు.. జైలు, దేశ బహిష్కరణతో బెంబేలు!

ABN , First Publish Date - 2022-01-23T14:24:13+05:30 IST

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులు అక్కడి చట్టపరమైన చిక్కులను తెలుసుకోకుండా చేసే సోషల్ మీడియా పోస్టులు వారిని తరచూ ఇబ్బందుల్లో నెడుతున్నాయి.

గల్ఫ్ దేశాల్లో NRI లను ఇబ్బందుల్లో నెడుతున్న సోషల్ మీడియా పోస్టులు.. జైలు, దేశ బహిష్కరణతో బెంబేలు!

జెడ్డా: గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులు అక్కడి చట్టపరమైన చిక్కులను తెలుసుకోకుండా చేసే సోషల్ మీడియా పోస్టులు వారిని తరచూ ఇబ్బందుల్లో నెడుతున్నాయి. సహాయం కోరుతూ, సెన్సిసిటివ్ విషయాలపై స్పందిస్తూ చేసే సోషల్ మీడియా పోస్టింగ్‌లు చాలా మంది ఎన్నారైలను వారికి తెలియకుండానే జైలుపాలు చేయడంతో పాటు దేశ బహిష్కరణతో ఇంటిముఖం పట్టిస్తున్నాయి. ఎన్నో వ్యయ, ప్రయాసలతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ప్రవాస భారతీయులు ఇలా అర్థాంతరంగానే స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్న ఘటనలు ప్రతి యేటా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఓ ఎన్నారైకు సౌదీ అరేబియాలో ఇలాంటి సంఘటనే ఎదురైంది. సహాయం కోరుతూ అతడు చేసిన సోషల్ మీడియా పోస్టుతో జైలుకెళ్లడంతో పాటు దేశ బహిష్కరణకు గురయ్యాడు. జైలు శిక్ష పూర్తి చేసుకుని ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చాడు.  


అసలేం జరిగిందంటే.. తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన సురేందర్ నగవత్ నాయక్ రెండేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. సౌదీలోని పారిశ్రామిక నగరమైన జుబైల్‌లో ఓ సౌదీ కుటుంబం వద్ద కారు డ్రైవర్‌గా పనికి కుదిరాడు. ఆ సమయంలో సౌదీ యజమానితో సురేందర్ రెండేళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. దాంతో రెండేళ్లు సదరు యజమాని వద్ద డ్రైవర్‌గా పని చేశాడు. తన కాంట్రాక్ట్ ముగియడంతో తనను భారత్‌కు పంపించాల్సిందిగా యజమానిని కోరాడు సురేందర్. కానీ, యజమాని మాత్రం అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీస్తుండడంతో సురేందర్ తన పరిస్థితిని వివరిస్తూ సౌదీ నుంచి స్వదేశానికి వెళ్లేందుకు తనకు సహాయం చేయాల్సిందిగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. చివరకు యజమానికి కూడా ఆ వీడియో చేరింది. 


అంతే.. తన పరువు, మర్యాదకు భంగం కలిగించాడంటూ సురేందర్‌పై కేసు వేశాడు యజమాని. ఇంకేముంది ఆ తర్వాతి రోజు పోలీసులు సురేందర్‌ను అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. సోషల్ మీడియాను తప్పుదోవలో వినియోగించాడంటూ సురేందర్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అంతేగాక అతడి మొబైల్ ఫోన్‌ను కూడా జప్తు చేసింది. ఈ ఊహించని పరిణామంతో సురేందర్ నిర్ఘాంతపోయాడు. జరిగిన విషయాన్ని రాజేష్, యాసీన్ అనే ఇద్దరు ప్రవాస భారతీయులకు తెలియజేశాడు. దాంతో వారు అతనిపై దయ చూపాల్సిందిగా ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. వారి ద్వారానే ఈ విషయం రియాద్‌లోని భారత ఎంబసీ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఎంబసీ అధికారులు కలుగజేసుకుని సౌదీ అథారిటీతో మాట్లాడి సురేందర్ జైలు శిక్షను తగ్గించారు. దాంతో సురేందర్ ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చాడు. 


ఇక అప్పులు చేసి మరీ సౌదీ వెళ్లిన సురేందర్ ఖాళీ చేతులతో ఇలా స్వదేశానికి చేరడంతో అతడి కుటుంబ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ విషయం స్థానిక ఎంఎల్ఏ సంజయ్ కుమార్ దృష్టికి వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ఆర్థిక సాయం కింద రెండు లక్షలు ఇప్పించారు. ఇదిలాఉంటే.. ఇప్పటికీ సౌదీలోని వివిధ ప్రాంతాల్లో చాలా మంది ఎన్నారైలు ఇలాగే అక్కడి చట్టపరమైన చిక్కులను తెలుసుకోకుండా సోషల్ మీడియా సందేశాలను పోస్ట్ చేయడం ద్వారా శిక్షలు పడి అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. కనుక గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న ప్రవాస భారతీయులు సోషల్ మీడియా పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు.  

Updated Date - 2022-01-23T14:24:13+05:30 IST