శాంతిభద్రతల పరిరక్షణలో Telangana Police నంబర్‌ వన్‌

ABN , First Publish Date - 2021-07-25T11:56:07+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్‌శాఖ దేశంలోనే ప్రథమ స్థానం..

శాంతిభద్రతల పరిరక్షణలో Telangana Police నంబర్‌ వన్‌

  • హోంమంత్రి మహమూద్‌ అలీ


హైదరాబాద్ సిటీ/మదీన : శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్‌శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోందని హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. బండ్లగూడలో నూతనంగా నిర్మించిన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని శనివారం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు విభాగాలను ప్రారంభించిన ఆయన రిసెప్షన్‌, జీడీ ఎంట్రీల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌తో రాష్ట్రంలో శాంతిసామరస్యాలు పరిఢవిల్లుతున్నాయన్నారు. కరోనా సమయంలో పోలీస్‌ అధికారులు చేసిన సేవలు మరువలేనివన్నారు. 


ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో స్టేషన్‌కు వస్తే తప్పక న్యాయం జరుగుతుందనే భరోసాను ప్రజల్లో కల్పించగలిగామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు, షీ టీమ్‌ల ఏర్పాటుతో మహిళలపై వేధింపులు తగ్గుముఖం పట్టాయన్నారు. పోలీస్‌శాఖలో పెద్దఎత్తున మహిళలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, హసన్‌జాఫ్రీ, అడిషనల్‌ కమిషనర్లు అనిల్‌కుమార్‌, డీఎస్‌ చౌహాన్‌, పోలీస్‌ హౌసింగ్‌బోర్డు ఇన్‌చార్జి రెమా రాజేశ్వరి, దక్షిణ మండలం డీసీపీ గజారావు భూపాల్‌, అడిషనల్‌ డీసీపీ సయ్యద్‌ రఫీఖ్‌, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మాజిద్‌, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ కేఎన్‌ ప్రసాద్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T11:56:07+05:30 IST