పక్కా ప్లాన్‌ ప్రకారమే సికింద్రాబాద్‌ స్టేషన్‌ దాడి ఘటన

ABN , First Publish Date - 2022-06-18T01:21:31+05:30 IST

హైదరాబాద్: పక్కా ప్లాన్‌ ప్రకారమే సికింద్రాబాద్‌ స్టేషన్‌ ముట్టడి జరిగింది. సికింద్రాబాద్ స్టేషన్‌కు రైళ్లలో చేరుకోవాలని ఆందోళనకారులు ముందే నిర్ణయించుకున్నారు.

పక్కా ప్లాన్‌ ప్రకారమే సికింద్రాబాద్‌ స్టేషన్‌ దాడి ఘటన

హైదరాబాద్: పక్కా ప్లాన్‌ ప్రకారమే సికింద్రాబాద్‌ స్టేషన్‌ ముట్టడి జరిగింది. సికింద్రాబాద్ స్టేషన్‌కు రైళ్లలో చేరుకోవాలని ఆందోళనకారులు ముందే నిర్ణయించుకున్నారు. 10 ప్లాట్‌ ఫామ్‌లలో మకాం వేయాలని ప్లాన్‌ వేసుకున్నారు. బస్సుల్లో వచ్చేవాళ్లు ఉదయం 9 గంటల లోపే రావాలని నిర్ణయించుకుని 9 గంటలకు సికింద్రాబాద్ మెయిన్‌ గేట్ నుంచి లోపలకు వెళ్లారు. ఆ వెంటనే అప్పటికే ప్లాట్‌ ఫామ్‌లపై ఉన్న ఆందోళనకారులు హంగామా సృష్టించారు. ముందుగా ప్రయాణికుల ట్రైన్ ఇంజిన్లను ముట్టడించారు. ఇంజిన్ల ముందు వాహనాలు వేసి తగులబెట్టారు. ఇంజిన్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత బోగీలను ధ్వంసం చేసుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత బోగీలను తగలబెట్టారు. అనంతరం పట్టాలపై నిలబడి బోగీలపై రాళ్లు రువ్వారు.


వీరిని కంట్రోల్ చేయటం కోసం పోలీసులు తొలుత లాఠీచార్జ్‌ చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌తో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్ పేట గ్రామ వాసి డీ. రాకేశ్ మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.


కాల్పుల ఘటన తర్వాత ఆందోళనకారులు రైలు పట్టాలపై చేరుకున్నారు. చర్చలకు రావాలంటూ పోలీసుల నుంచి పిలుపు వచ్చినా ఒప్పుకోలేదు. ఆపరేషన్ క్లియర్‌ని మొదలుపెట్టిన పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్‌లో మొత్తం 10 గంటల పాటు ఆందోళన కొనసాగింది. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రశాంత వాతావరణం నెలకొంది.


మరోవైపు రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనపై  రైల్వే పోలీసులు  సెక్షన్ 143, 147, 324, 307, 435,427, 448, 336, 332, 341,రెడ్ విత్ 149 తో పాటు ఇండియన్ రైల్వే యాక్ట్ 150, 151, 152, కింద కేసులు నమోదు చేశారు. ఎంత మంది దాడిలో పాల్గొన్నారో ఇంకా గుర్తించలేదని, ఆస్తి నష్టం ఇంకా అంచనా వేయలేదని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. 

Updated Date - 2022-06-18T01:21:31+05:30 IST