విమర్శిస్తూనే.. సై

ABN , First Publish Date - 2022-05-24T08:29:45+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానాన్ని అవకాశం దొరికినపుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గట్టిగానే విమర్శిస్తున్నారు.

విమర్శిస్తూనే.. సై

  • జాతీయ విద్యా విధానం అమల్లో తెలంగాణ పరుగులు!
  • మాతో చర్చించలేదంటూనే సంస్కరణలకు కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌
  • ఉన్నత విద్యలో వేగంగా మార్పులు
  • ఎక్కడైనా చేరు... పక్క కాలేజీలో చదువుకో
  • అవసరం వస్తే చదువుకు బ్రేక్‌ తీసుకో
  • చాలా రకాల పీజీలకు డిగ్రీ ఏదైనా ఒకే
  • పొరుగు రాష్ట్రాల వారికి 20 శాతం సీట్లు
  • సమాంతరంగా ఆన్‌లైన్లో మరో డిగ్రీ
  • ఇంజనీరింగ్‌లో 30 శాతం ఆన్‌లైన్‌ బోధన
  • ఇంటర్నల్‌ మార్కులు 40 శాతానికి పెంపు
  • యూజీసీ, ఏఐసీటీఈ ద్వారా కేంద్రం నిర్దేశం
  • వర్సిటీల ద్వారా అమలు చేయిస్తున్న రాష్ట్రం
  • పాఠశాల విద్యలోనే జాగ్రత్తగా అడుగులు
  • ఇంటర్‌ను కలిపేస్తే ఉద్యోగ సంఘాలు
  • మరింత బలపడతాయని అనుమానం


ఎవరినీ సంప్రదించకుండా కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానంతో సమస్యలు ఎదురవుతాయి తప్ప విజయవంతం కాదు. ప్రజాస్వామ్య దేశంలో చర్చలు, సంప్రదింపులు ఉండాలి. ఒకరు పాలసీలు రూపొందించి అందర్నీ అమలు చేయాలనడం సరికాదు. కొత్త విధానాలను అమలు చేసే ముందు అన్ని రాష్ట్రాలతో చర్చించి, అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంది. లేదంటే ఇబ్బందులు తప్పవు.

- రెండు రోజుల క్రితం ఢిల్లీలో కేంద్రంపై కేసీఆర్‌ విసుర్లు


హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానాన్ని అవకాశం దొరికినపుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గట్టిగానే విమర్శిస్తున్నారు. అయితే, వాటిని అమలు చేయడంలో మాత్రం తెలంగాణ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. ఉద్యోగ సంఘాలు బలంగా ఉన్న పాఠశాల, ఇంటర్‌ విద్యను ఒకే గొడుగు కిందకు తెచ్చే విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. జాతీయ విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకు రాకపోవడంతో దీనిని అమలు చేయాలా? వద్దా? అనే విషయంలో రాష్ట్రానికి వెసులుబాటు ఉంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ), ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) వంటి వాటి ద్వారా కేంద్రం ఎప్పటికప్పుడు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్గదర్శకాలను జారీ చేస్తుండడంతో రాష్ట్రాలు ఆ మేరకు ఉన్నత విద్యలో మార్పులు చేయక తప్పడం లేదు. తెలంగాణ సర్కారు కూడా ఉన్నత విద్య కోర్సుల్లో జాతీయ విద్యావిధానంలో పేర్కొన్న అంశాలను అమలు చేయడానికి వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం నేరుగా నిర్ణయాలను ప్రకటించకుండా ఉన్నత విద్యా మండలి, ఆయా వర్సిటీలద్వారా ఈ విధానాలను అమల్లోకి తెస్తోంది. ప్రభుత్వ జోక్యం లేకుండా వర్సిటీల స్థాయిలోనే నిర్ణయాలను తీసుకుని అమలు పరుస్తున్నారు. ఉన్నత విద్యా మండలి ద్వారా కూడా కొన్ని నిర్ణయాలను అమలు చేస్తున్నారు. వాటి వివరాలను పరిశీలిస్తే...


క్లస్టర్‌ విధానం!

సరైన మౌలిక సదుపాయాలు, నిపుణులైన బోధకులు అందుబాటులో లేని కళాశాలల విద్యార్థులకు కూడా ఉత్తమ బోధనను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం క్లస్టర్‌ విధానాన్ని ప్రకటించింది. ఇందు లో భౌగోళికంగా ఒకే ప్రాంతంలో ఉన్న కొన్ని కళాశాలలను గుర్తించి క్లస్టర్‌గా ప్రకటిస్తారు. ఆ క్లస్టర్‌ పరిధిలోని ఒక కాలేజీలో చదివే విద్యార్థి కొన్ని సబ్జెక్టులను ఇతర కాలేజీలకు వెళ్లి చదువుకోవచ్చు. ల్యాబ్‌, గ్రంథాల యం ఇతర మౌలిక సదుపాయాలను కూడా గ్రూప్‌లో మెరుగ్గా ఉన్న కాలేజీలకు వెళ్లి ఉపయోగించుకోవచ్చు. 


ఎప్పుడైనా చేరొచ్చు... బ్రేక్‌ తీసుకోవచ్చు

కొత్తగా ప్రకటించిన విధానంలో చదువును మధ్యలో నిలిపి వేసి ఉద్యోగం చేయవచ్చు. తిరిగి మళ్లీ వచ్చి మిగతా కోర్సు చదువును పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం...మూడేళ్ల డిగ్రీ కోర్సును 6 ఏళ్లలో, 4 ఏళ్ల డిగ్రీ కోర్సును 8 ఏళ్లల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ నిర్ణీత గడువులోపు కోర్సును పూర్తి చేయలేకపోతే సదరు విద్యార్థి అడ్మిషన్‌ రద్దు అవుతుంది. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం విద్యార్థులకు మల్టిపుల్‌ ఎంట్రీస్‌, మల్టిపుల్‌ ఎగ్జిట్‌ విధానాన్ని ప్రతిపాదించారు. విద్యార్థులు అవసరమైతే కొంత కాలం ఇతర ఉద్యోగాలు చేసుకుని తర్వాత వచ్చి కోర్సును పూర్తి చేయవచ్చు. ఏడాది విద్యను పూర్తి చేస్తే...సర్టిఫికెట్‌ను ఇవ్వనున్నారు. రెండేళ్లు పూర్తిచేస్తే డిప్లమో, మూడేళ్లు పూర్తి చేస్తే అడ్వాన్స్‌ డిప్లమో, నాలుగేళ్లు పూర్తి చేస్తే డిగ్రీ సర్టిఫికెట్‌ను జారీ చేయనున్నారు. ఈవిధానాన్ని అమల్లోకి తేవాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. 


డిగ్రీ ఏదైనా పీజీలను చేయవచ్చు

రాష్ట్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) కోర్సుల్లోనూ మార్పులను తీసుకువస్తున్నారు. డిగ్రీని ఏ సబ్జెక్టు చదివినా పీజీలో ఏ కోర్సులోనైనా చేరవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేస్తారు. ప్రస్తుతం ఇస్లామిక్‌ స్టడీస్‌, జర్నలిజం, లైబ్రరీ సైన్స్‌, తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం వంటి కోర్సుల్లో ఏ డిగ్రీ చేసినా చేరడానికి అవకాశం ఉంది. ఇక నుంచి రాజనీతి శాస్త్రం, చరిత్ర, పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌, కామర్స్‌, ఇంగ్లీషు, తెలుగు వంటి పీజీ కోర్సుల్లో ఏ డిగ్రీ చదివినా పోటీ పడొచ్చు. ఇంజనీరింగ్‌ చేసిన విద్యార్థులు కూడా అన్ని పీజీ కోర్సుల్లో చేరడానికి అర్హులవుతారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని  6 వర్సిటీల్లో అమలు పరచనున్నారు.


ఇంటిగ్రేషన్‌ కోటా 20 శాతానికి పెంపు!

రాష్ట్రంలోని పీజీ, యుజీ కోర్సుల్లో ఇతర దేశాలు, రాష్ట్రాల వారికి 20 శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటిగ్రేషన్‌ కోటా కింద ఇప్పటి వరకు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల వారికి 5 శాతం సీట్లను కేటాయిస్తున్నారు. దీనిని ఇక నుంచి 20 శాతానికి పెంచనున్నారు. జాతీయ విద్యా విధానంలో ఇంటిగ్రేషన్‌ కోటాను పెంచాలని సూచించారు. ఈ కోటా కోసం కొత్తగా 15 శాతం సీట్లు పెంచనున్నారు. సోమవారం సమావేశమైన ఉస్మానియా వర్సిటీ పాలక మండలి ఈ ప్రతిపాదనను ఆమోదించినట్టు సమాచారం. డిగ్రీ కోర్సుల్లో మరిన్నీ విదేశీ భాషలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫ్రెంచి, జర్మనీ, అరబిక్‌, జపాన్‌, స్పానిష్‌, చైనీస్‌ వంటి వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. 


ఒకే సమయంలో రెండు డిగ్రీలు

ఒకే సమయంలో రెండు కోర్సులను చదువుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించారు. దీనిపై జేఎన్‌టీయూతోసహా ఉస్మానియా వంటి వర్సిటీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఈ ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఒక కోర్సును రెగ్యులర్‌గా, మరో కోర్సును దూరవిద్య ద్వారా చేపట్టవచ్చు. అలాగే, సాంకేతిక కోర్సులో 70 శాతం ప్రత్యక్ష బోధన, మిగిలిన 30 శాతం ఆన్‌లైన్‌ బోధన వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టారు. ఇంటర్నల్‌ మార్కులను 25 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని చర్చిస్తున్నారు. అంటే, వార్షిక పరీక్షలను 60 శాతం మార్కులకు నిర్వహిస్తారు. 2022-23 నుంచే అమలు పరిచే విషయాన్ని పరిశీలిస్తున్నారు.


మాతృభాషపై కదలిక ఏదీ?

మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని జాతీయ విద్యావిధానం గట్టిగా సూచించింది. అయితే, ఆ దిశగా కేంద్రం స్థాయిలో గానీ, రాష్ట్రం స్థాయిలో గానీ ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. పైగా తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యను మరింతగా ఆంగ్లం దిశగా తీసుకెళ్తున్నారు. ఇంజనీరింగ్‌, ఇతర సాంకేతిక విద్యలను మాతృభాషలో అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అదే జరిగితే పాఠశాల విద్య విషయంలో ఆంగ్లం డిమాండ్‌ తగ్గే అవకాశం ఉంది. 


5+3+3+4 విషయంలో అస్పష్టత?

జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం సూచించిన మార్పులను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలను తీసుకోలేదు. ఎన్‌ఈపిలో సూచించిన 5+3+3+4 పద్దతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.  5+3+3+4 విధానం అంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటి, రెండో తరగతులను ఒకే విధానంలో బోధిస్తారు. నేషనల్‌ ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌(ఈసిసిఈ) విధానంగా పరిగణించే దీనిని బాల్య విద్య, నర్సరీ విద్య అని కూడా భావిస్తున్నారు. పుట్టినప్పటికీ నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు పిల్లలకు బోధించే అంశాలను ఇందులో చేరుస్తారు. 3,4,5తరగతులను ఒక కేటగిరిగా, 6,7,8వ తరగతులను మరో కేటరిగిగా, 9,10,11,12వ తరగతులు ఇంకో కేటగిరిగా విభజించారు. దీన్ని అమలు విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీనిపై స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సిఈఆర్‌టి) అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించారు. పలు అంశాలపై నిపుణులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, వాటి సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదికను ఇచ్చారు. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రాథమిక విద్య స్థాయిలో అనేక మార్పులు వస్తాయి. ఇంటర్మీడియట్‌ విద్య పాఠశాల విద్యలో కలిసిపోతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ విద్యలో ఉద్యోగ సంఘాలు బలంగా ఉండడంతో దానిని స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో కలపడానికి ప్రభుత్వం సంకోచిస్తోందనే అభిప్రాయం ఉంది.

Updated Date - 2022-05-24T08:29:45+05:30 IST