సీఎం మాట నమ్మి సాగు చేసినందుకు ఇప్పుడు...

ABN , First Publish Date - 2020-10-22T06:00:47+05:30 IST

తెలంగాణ సోనాకు మంచి డిమాండ్‌ ఉందని, సాగు చేస్తే లాభాలు వస్తాయని ముఖ్యమంత్రి మాటలు నమ్మి సాగు చేసిన రైతులు ఇప్పుడు నట్టేట మునిగే పరిస్థితి ఏర్పడింది

సీఎం మాట నమ్మి సాగు చేసినందుకు ఇప్పుడు...

గింజ రాక రైతన్నల ఇబ్బందులు

జిల్లాలో 15,225 ఎకరాల్లో సాగు

ఆందోళనలో అన్నదాతలు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: తెలంగాణ సోనాకు మంచి డిమాండ్‌ ఉందని, సాగు చేస్తే లాభాలు వస్తాయని ముఖ్యమంత్రి మాటలు నమ్మి సాగు చేసిన రైతులు ఇప్పుడు నట్టేట మునిగే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ సోనా సాగుతో గిట్టుబాటు అవుతుందనుకుంటే అన్నదాతల కొంప ముంచింది. ఇతర రకాలు సాగు చేసిన తోటి రైతులు కోతలకు సిద్ధమవుతుంటే తెలంగాణ సోనా సాగు చేసిన రైతులు గింజలు రాక ఆందోళన చెందుతున్నారు. పైకి పంట చేలు బాగానే కనిపిస్తున్నా.. తాలు, తప్ప పోయిందని, దీంతో పెట్టిన పెట్టుబడి రాలేని పరిస్థితి ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.


తాలు, తప్పతో రైతన్న ఆవేదన

తెలంగాణ ప్రభుత్వం ఈ సారి నియంత్రిత సాగు ప్రవేశపెట్టగా, దానికి అనుగుణంగా జగిత్యాల జిల్లా రైతులు సన్నరకం వరిధాన్యం సాగుకు మొగ్గు చూపారు. తెలంగాణ సోనాకు మంచి డిమాండ్‌ ఉందని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడంతో పాటు వ్యవసాయ అధికారులు కూడా పదే పదే చెప్పడంతో ఆ పంట సాగువైపు మొగ్గు చూపారు. జగిత్యాల, సారంగాపూర్‌, బీర్‌పూర్‌, రాయికల్‌, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో తెలంగాణ సోనా ఎక్కువగా సాగు చేశారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సోనా వరి విత్తనాలను విక్రయించగా, ప్రైవేట్‌ వ్యాపారులు కూడా పెద్ద ఎత్తునే విక్రయించారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 15,225 ఎకరాల్లో తెలంగాణ సోనా పంట సాగైంది. అధికారుల అంచనాల ప్రకారం 3 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే సారంగాపూర్‌, బీర్‌పూర్‌, జగిత్యాల మండలాల్లోని కొన్ని చోట్ల తెలంగాణ సోనా పంట పూర్తిగా దెబ్బతింది.


పైకి పంట బాగానే కనిపిస్తున్నా గొలకలు చూస్తే లోపల గింజలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సన్నరకం పంట సాగు చేస్తే లాభం ఉంటుందనుకుంటే పెట్టిన పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సారంగాపూర్‌ మండలంలో సహకార సంఘం ఆధ్వర్యంలో 250 బస్తాల తెలంగాణ సోనా విత్తనాలను విక్రయించారు. దాదాపు 250 ఎకరాల్లో ఆ మండలంలోనే సాగు కాగా, పూర్తిగా పంట దెబ్బతిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోతకు రావాల్సి ఉండగా, గింజలు లేక తాలు, తప్ప పోయిందని రైతులు పేర్కొంటున్నారు.


పట్టించుకోని అధికారులు

తెలంగాణ సోనా సాగు చేసిన రైతులు పంట దెబ్బతిన్నదని ఫిర్యాదు చేసినా వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సారంగాపూర్‌ మండలంలోని రైతులు ఇప్పటికే మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశారు. రేపో, మాపో వ్యవసాయ శాస్త్రవేత్తలను రప్పించి పంట క్షేత్రాలను పరిశీలిస్తామని పేర్కొంటున్నా ఇప్పటివరకు రాలేదని రైతులు ఆవేదన చెందుతు న్నారు. అయితే సహకార సంఘం ఆధ్వర్యంలో విత్తనాలు విక్రయించగా, కంపెనీకి డబ్బులు చెల్లించవద్దని మండల వ్యవసాయాధికారి పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై జిల్లా వ్యవసాయాధికారి సురేష్‌ కుమార్‌ను వివరణ కోరగా ఈ సమస్య తమ దృష్టికి రాలేదని, పంట క్షేత్రాలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


పంట మొత్తం దెబ్బతిన్నది..జాజాల రాజేశం, పోతారం

తెలంగాణ సోనా నాలుగు ఎకరాల్లో సాగు చేసినా. అందరి పంట చేళ్లు కోతకు వస్తుంటే మా పంట కోద్దామని పరిశీలిస్తే పైకి బాగానే ఉన్నా లోపల గింజ లేదు. మొత్తం తాలు, తప్ప పోయింది. తెలంగాణ సోనా రకం సాగు చేసిన ఈ ప్రాంతంలో రైతులందరి పరిస్థితి ఇలాగే ఉంది.

Updated Date - 2020-10-22T06:00:47+05:30 IST