Advertisement

మద్దతు ధర రైతుల హక్కు

Oct 15 2020 @ 00:24AM

రైతులను ఆదుకోవడానికి కేంద్రం మద్దతు ధర ప్రకటించిన అన్ని పంటలను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకోవాలి. రాజ్యాంగం తనకు కల్పించిన అధికారంతో రైతుల నుంచి అన్ని పంటలను మద్దతు ధరలకే కొనేలా వ్యాపారులను ఆదేశిస్తూ ప్రభుత్వం వెంటనే చట్టం చేయాలి. వ్యాపారుల నుంచి సరైన ధరలు అందక రైతులు నష్టపోయిన సందర్భంలో, అలా నష్టపోయిన మొత్తాన్ని, రైతులకు నేరుగా నగదు రూపంలో ఇచ్చి భర్తీ చేయాలి. 


రాష్ట్రప్రభుత్వం ఈ సంవత్సరం పంటల బీమా పథకాలు అమలు చేయలేదని వర్షానికి తెలిసినట్లుంది, నిరంతరంగా కురుస్తున్న వానలు అన్ని రకాల పంటలకు నష్టం చేస్తున్నాయి. అనుకున్న సగటు దిగుబడులలో సగం కూడా వచ్చేటట్లు లేవు. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పంటల ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి అధిక వర్షాల నుండి పంటలను కాపాడుకోవడానికి మరిన్ని ఎక్కువ రసాయనాలు వాడుతున్నారు. పత్తిలో యూరియా వినియోగం భారీగా పెరిగిపోతూ, మొక్కలు బలంగా ఎదుగుతున్నాయి కానీ,  పూత, కాత తక్కువగానే ఉన్నది. పెసర, సోయాబీన్, వేరుశనగ, కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. డ్రైనేజీ సౌకర్యం సరిగా లేని పొలాలలో వరి పంట కూడా దెబ్బతిన్నది. 


తెలంగాణలో వానాకాలం పంటలు మార్కెట్‌కు వస్తున్నాయి. పత్తి పంట కొనుగోలు వ్యవహారాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలలో కమిటీలను ఏర్పరుస్తూ సెప్టెంబర్ మొదటి వారంలోనే జీవోలు వెలువడినా, ఇంత వరకూ ‘సి‌సి‌ఐ’ పత్తి సేకరణ కేంద్రం ఒక్కటి కూడా ఏర్పటు కాలేదు. జాతీయ స్థాయి రైతు సహకార సంఘాల సమాఖ్య ‘నాఫెడ్’ తరపున పంటల మద్దతు ధర పథకం కింద పెసర, సోయాబీన్ కొనుగోలు చేయడానికి మార్క్‌ఫెడ్‌ను ఏజెన్సీగా నియమిస్తూ సెప్టెంబర్‌లోనే జీవోలు వెలువడినా ఇంతవరకూ మార్క్‌ఫెడ్ వాటి కొనుగోళ్ళు ప్రారంభించలేదు. పైగా కేంద్రం తెచ్చిన మూడు చట్టాల నేపథ్యంలో రైతులకు మద్దతు ధరలు అందించాలనే లక్ష్యాన్ని ప్రకటిసతూ, ఈ జీవోల ద్వారా పంటల అమ్మకాలపై మార్కెట్ పన్నును కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్ధు చేసింది. 


రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు పంటల సేకరణకు పూనుకోకపోవడంతో, వ్యాపారులు గ్రామాలలో, మార్కెట్‌యార్డులలో కూడా అతి తక్కువ ధరలకే పంటలను కొంటున్నారు. సెప్టెంబర్ 15- అక్టోబర్ 12 మధ్య రైతులు 68,914 క్వింటాళ్ళ పత్తిని మార్కెట్‌కు తెచ్చారు. పత్తికి కనీస మద్దతు ధర 5,825 కాగా రైతులకు అందుతున్న మోడల్ ధర కేవలం 4415 రూపాయలు మాత్రమే. ఇదే కాలంలో మొక్క జొన్న 63,288 క్వింటళ్ళు మార్కెట్‌కు వచ్చింది. మొక్కజొన్న మద్దతు ధర 1850 రూపాయలు కాగా రైతులకు అందుతున్న మోడల్ ధర కేవలం 1294 రూపాయలు మాత్రమే. కొన్ని గ్రామాలలో రైతులు మొక్కజొన్నను1000 రూపాయల లోపే అమ్ముకుంటున్నారు. పంటల ప్రణాళికలో మొక్క జొన్న లేదనే పేరుతో రాష్ట్రప్రభుత్వం మౌనంగా చూస్తున్నది. ఈ కాలంలోనే సోయాబీన్ 10,966 క్వింటాళ్ళుమార్కెట్‌కు వచ్చింది. కనీస మద్దతు ధర రూ.3880లు కాగా, రైతులకు అందుతున్నది కేవలం 3320 మాత్రమే. పెసర 25,461 క్వింటాళ్ళు మార్కెట్‌కు వచ్చింది. దాని కనీస మద్దతు ధర 7196 కాగా, రైతులకు అందుతున్న మోడల్ ధర 4022 రూపాయలు మాత్రమే. కొన్ని జిల్లాలలో కేవలం 2500 రూపాయలకు పెసర అమ్ముకున్న రైతులు కూడా ఉన్నారు. వరి ధాన్యం 73,680 క్వింటాళ్ళు వచ్చింది. కనీస మద్దతు ధర 1888 కాగా రైతులకు అందుతున్న మోడల్ ధర 1684 రూపాయలు మాత్రమే. అంటే ప్రతి క్వింటాలు పై రైతులు వేల రూపాయలు నష్టపోతున్నారు. 


కేంద్రం చెప్పినట్లుగా 3 చట్టాల వల్ల వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ,రైతులకు లాభదాయకమైన ధరలేమీ అందడం లేదు. ప్రభుత్వ సేకరణ వ్యవస్థలు మార్కెట్‌లో లేకపోవడం వల్ల, మరింతగా ధరలు పడిపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వం చెప్పినట్లుగా రైతులు పంటలు వేసినా, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోకుండా, చోద్యం చూస్తోంది. గోరుచుట్టు పై రోకలి పోటులా, కేంద్రం ఈ సమయంలోనే దిగుమతి సుంకాలు తగ్గించి మొక్కజొన్న, లక్షల టన్నుల పప్పుధాన్యాల దిగుమతులకు అనుమతి ఇచ్చేసింది. 


వరిధాన్యం కొనుగోలుకు 6000 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్రప్రభుత్వం చెప్పినా ఈ కేంద్రాలు ఎప్పుడు ప్రారంభంమవుతాయో తెలియదు. రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించడానికి నిరాకరించి, వారి పేర్లను పంట సాగుదారులుగా నమోదు చేయని ప్రభుత్వం ఈ జీవో ద్వారా, కౌలు, పోడు, ప్రభుత్వ భూములలో సాగు చేసుకునే వారి పంటలను కూడా కొంటామని, అయితే వారిని గ్రామ రైతుబంధు కమిటీ అధ్యక్షుడు సిఫారసు చేస్తే, ఆ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి సంతకం చేసి లేఖ ఇస్తేనే కొంటామని మెలిక పెట్టింది. లక్షలాదిమంది కౌలు రైతులను, అధికార పార్టీ నేతలతో నింపిన రైతు బంధు కమిటీల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ తిప్పేలా చేయడం అన్యాయం. సీజన్ ప్రారంభంలోనే వారిని, మిగిలిన రైతులతో పాటు నమోదు చేసిఉంటే వారికి ఈ తిప్పలు తప్పి ఉండేవి. పైగా కౌలు రైతులు 50 క్వింటాళ్ళ కంటే ఎక్కువ ధాన్యం తెస్తే మండల స్థాయిలో ఉండే వ్యవసాయ అధికారి సంతకం కూడా తెచ్చుకోవాలని చెప్పడం మరీ అన్యాయం. దీనిని వాడుకుని ‘రైతుబంధు’లు, అధికారులు కౌలురైతుల నుంచి ఎంతగా లంచాలు గుంజుతారో చెప్పలేం. 


మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణలో అన్ని పంటల ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ. పైగా సన్న ధాన్యం పండించమని ప్రభుత్వం చెప్పింది. ఈ సన్న ధాన్యంకు తెగుళ్లు ఎక్కువ. పురుగు మందుల వాడకం ఎక్కువ. పైగా దొడ్డు రకాలతో పోల్చినప్పుడు దిగుబడి తక్కువ. రాష్ట్ర ప్రభుత్వ ఉత్పత్తి ఖర్చు అంచనాలకూ, కేంద్ర CACP సంస్థ అంచనాలకూ మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం వరి ధాన్యం ఉత్పత్తికి క్వింటాలుకు సమగ్ర ఉత్పత్తి ఖర్చు 2529 కాగా, CACP అంచనా ఖర్చు 1591 రూపాయలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం పత్తి సమగ్ర ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకు 9,469 కాగా, cacp అంచనా 5,270 రూపాయలు. మొక్కజొన్న సమగ్ర ఉత్పత్తి ఖర్చు 2172 కాగా, cacp అంచనా 1333 రూపాయలు. కంది సమగ్ర ఉత్పత్తి ఖర్చు 8084 కాగా, cacp అంచనా ఖర్చు 7544 మాత్రమే. 


రాష్ట్రంలో పండే ఈ నాలుగు ప్రధాన పంటల సగటు దిగుబడుల ఆధారంగా ఈ ఉత్పత్తి ఖర్చులను లెక్క వేశారు. కేంద్రం పంటల ధరలను ఉత్పత్తి ఖర్చుల జాతీయ సగటు ఆధారంగా ప్రకటిస్తుంది. తెలంగాణలో పంటల ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉన్న దశలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చులను తగ్గించడానికి ప్రత్యేక ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. 


రైతుబంధు సహాయం కూడా కేవలం భూమి ఉన్న రైతులకే అందుతోంది. వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు, పోడు, మహిళా రైతులకు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలపై వడ్డీ రాయితీని కూడా బ్యాంకులకు చెల్లించకపోవడంతో, రైతులే వడ్డీ భారాన్ని మోయవలసి వస్తున్నది. పైగా రెండు సంవత్సరాలుగా పంటల బీమా ప్రీమియం సబ్సిడీ సొమ్మును బీమా కంపెనీలకు చెల్లించకపోవడం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం అందలేదు.ఈ సంవత్సరం బీమా పథకాలు అమలు చేయకపోవడంతో వారు భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. అయినా వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అన్ని సమస్యలకు ఎకరానికి 5000 రైతుబంధు సహాయం పరిష్కారం చూపిస్తుందని అనుకోవడం సరైంది కాదు. 


రైతులను ఆదుకోవడానికి కేంద్రం మద్దతు ధర ప్రకటించిన అన్ని పంటలను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకోవాలి. రాజ్యాంగం తనకు కల్పించిన ఉపయోగించుకుని రైతుల నుంచి అన్ని పంటలను మద్దతు ధరలకే కొనేలా వ్యాపారులను ఆదేశిస్తూ ప్రభుత్వం వెంటనే చట్టం చేయాలి. వ్యాపారుల నుంచి సరైన ధరలు అందక రైతులు నష్టపోయిన సందర్భంలో, అలా నష్టపోయిన మొత్తాన్ని, రైతులకు నేరుగా నగదు రూపంలో ఇచ్చి భర్తీ చేయాలి. 


కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఇతర పంటలకు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, మాంసం లాంటి అనుబంధ గ్రామీణ ఉత్పత్తులకు కూడా రాష్ట్ర స్థాయిలో ఉత్పత్తి ఖర్చులను లెక్కవేసి మద్దతు ధరలను ప్రకటించాలి. అది రైతులకు దక్కేలా చర్యలు చేపట్టాలి. వడ్డీ రాయితీ సొమ్మును బ్యాంకులకు, ప్రీమియం సబ్సిడీ సొమ్మును బీమా కంపెనీలకు వెంటనే చెల్లించాలి. కౌలు, పోడు, మహిళా రైతులతో సహా వాస్తవ సాగు దారులను గుర్తించి వారికి సహాయం, మద్దతు ధరలు లభించడానికి అనువైన చర్యలు తీసుకోవాలి. గ్రామస్థాయిలో రైతు సహకార సంఘాలను బలోపేతం చేసి, కనీస మౌలిక వస్తులను వాటి ఆధ్వర్యంలో నిర్వహించాలి. అప్పుడు మాత్రమే రాష్ట్ర రైతులు కంపెనీల కబంధ హస్తాల నుంచి బయటపడతారు.కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.