Hussain Sagar లో జోరుగా బోటు షికారు.. ఊపందున్న పర్యాటకం!

ABN , First Publish Date - 2021-11-15T17:27:46+05:30 IST

కరోనాతో ఏడాదిన్నరగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన నగర పర్యాటకం...

Hussain Sagar లో జోరుగా బోటు షికారు.. ఊపందున్న పర్యాటకం!

  • సాగర్‌లో అత్యధికంగా 3,17,800 మంది..


హైదరాబాద్‌ సిటీ : కరోనాతో ఏడాదిన్నరగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన నగర పర్యాటకం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. నగరంలోని చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. సెలవు రోజులతో పాటు సాధారణ రోజుల్లో సైతం వేలాది మంది వస్తుండడంతో ఆయా ప్రదేశాలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. శని, ఆదివారాల్లో రద్దీ కనిపిస్తోంది.


తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 27 ప్రాంతాల వద్ద బోటింగ్‌ నిర్వహిస్తున్నారు. జూలై నుంచి సెప్టెంబర్‌ 30 వరకు వివిధ ప్రాంతాల్లో దాదాపు 5.40 లక్షల మంది పడవ ప్రయాణం చేసినట్లు సమాచారం. అత్యధికంగా హుస్సేన్‌సాగర్‌లో సుమారు 3,17,800 మంది సందర్శించినట్లు పర్యాటకశాఖ వర్గాలు చెబుతున్నాయి. లక్నవరంలో 39,480 మంది, దుర్గం చెరువులో 28,692 మంది, కోమటిచెరువులో 68,993 మంది బోటు షికారు చేసినట్లు తెలిపారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని నాగార్జునసాగర్‌, శ్రీశైలం, సోమశిల, లక్నవరం, ఎల్‌ఎండీ కరీంనగర్‌, కోమటిచెరువుల్లో కూడా బోటింగ్‌ తగ్గిపోయింది. ఆయా ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే బోటింగ్‌ చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. నగరంలోని దుర్గం చెరువు సుందీకరణ జరగడంతో ఇక్కడ కూడా బోటింగ్‌ ఊపందుకుంది.


టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం.. 

తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంతోపాటు దేశ, విదేశాలకు చెందిన ప్రజలు ఎక్కువ సంఖ్యలో సందర్శించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. హరిత హోటళ్లను మెరుగు పరిచి, పర్యాటకులకు తెలంగాణ రుచులను అందిస్తున్నాం. బోటింగ్‌పై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఉప్పల శ్రీనివా‌స్‌గుప్తా, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌.

Updated Date - 2021-11-15T17:27:46+05:30 IST