Trs Ministers: సొంత సర్వేల్లో షాకింగ్ రిపోర్టులు ..!

ABN , First Publish Date - 2022-07-30T23:35:05+05:30 IST

ఈ మధ్యకాలంలో సర్వేలకు సంబంధించిన చర్చలే వినిపిస్తున్నాయి. వాళ్ల సంగతేంటి..? వీళ్ల సంగతేంటి? అంటూ తెగ హడావిడి కొనసాగుతోంది...

Trs Ministers: సొంత సర్వేల్లో షాకింగ్ రిపోర్టులు ..!

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో సర్వేలకు సంబంధించిన చర్చలే వినిపిస్తున్నాయి. వాళ్ల సంగతేంటి..? వీళ్ల సంగతేంటి? అంటూ తెగ హడావిడి కొనసాగుతోంది. సరిగ్గా 8 నెలల కిందట హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణలోకి పీకే టీమ్‌ సర్వేల విషయంలో స్పీడ్ పెంచింది. అంతకంటే ముందే గ్రౌండ్ లెవెల్లో సర్కార్ పని తీరుపై నివేదికలు సిద్ధం చేసినా.. హుజురాబాద్ బై ఎలక్షన్‌తో ప్రజల్లోకి వెళ్ళింది. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ (Trs) ఇచ్చిన హామీలు, పాలసీలు, నిర్ణయాలపై ఫీడ్ బ్యాక్ తెప్పించారు. అయితే.. టీఆర్‌ఎస్‌.. ఐ పాక్‌ (I Pac)తో ఒప్పందం చేసుకోవడంతో ఇప్పుడు తెలంగాణలో సరికొత్త రాజకీయాలు తెరపైకి వచ్చాయి. కొన్ని సర్వే రిపోర్టులు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.  ప్రస్తుత ఎమ్మెల్యేల్లో చాలామంది.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని సర్వేల్లో తేలడంతో గులాబీ పార్టీలో ఆందోళన నెలకొంది. 


ఇక పీకే టీం ఇచ్చే సర్వే రిపోర్ట్స్‌తో సంబంధం లేకుండా మంత్రులే స్వయంగా సర్వేలు చేయించుకుంటున్నారు. వాళ్ల జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ఇబ్బందులు, ఎమ్మెల్యేల పని తీరుపై సొంత ఏజెన్సీల ద్వారా ఆరా తీస్తున్నారట. అదే సమయంలో బీజేపీ (Bjp), కాంగ్రెస్‌ (Congress)లోకి వెళ్తున్న కింది స్థాయి క్యాడర్‌పైనా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారట. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోని 12 నియోజకవర్గాలపై మంత్రి ఎర్రవెల్లి దయాకర్ (Minister Errabelli Dayakar) స్వయం సర్వేలు చేయించారట. ఆయన సొంత నియోజకవర్గం పాలకుర్తిలో మండలాలు, గ్రామాల వారీగా సర్వే చేయించారట. అయితే.. స్టేషన్‌ఘనపూర్, పరకాల, మహబూబాబాద్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలిందట.


మరోవైపు... ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోనూ మంత్రి జగదీష్‌రెడ్డి (Minister Jagadishreddy) సర్వే చేయించారట. ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు రిపోర్టులు తేల్చాయట. ఇక ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కూడా రీసెంట్‌గా సర్వే చేయించారట. ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు, ఇల్లందు, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో వెల్లడి అయిందట. ఖమ్మంలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఆరు చోట్ల వ్యతిరేకత ఉన్నట్లు తేలడంతో గులాబీ నేతల గుండెల్లో గుబులు రేగుతుంట. ఇటు.. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం సర్వే చేయించారట. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కుత్భూల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో సానుకూలత లేదని తేలిందట. 


ఇదిలావుంటే.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంటుందట. వనపర్తి, నారాయణపేట్‌, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రెండోసారి గెలిచిన పరిస్థితి లేదట. కాబట్టి.. ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయట. అదేవిధంగా.. కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ కరువు అయిందట. అటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనూ పలు చోట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నాయట. మంత్రి ప్రశాంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం బాల్కొండలో అయితే.. పరిస్థితి మరింత దారుణంగా ఉందట. బాల్కొండతో పాటు కామారెడ్డి, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయట. 


మొత్తంగా.. తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు చేయించుకుంటున్న సొంత సర్వేలు.. టీఆర్ఎస్‌ నేతలకు దిమ్మతిరిగే షాకిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా సెగ్మెంట్లలో ఎదురుగాలి వీస్తుండడంతోపాటు ఎమ్మెల్యేలపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఉండటంతో చెమటలు పడుతున్నాయట. అయితే.. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. చాలా చోట్ల టీఆర్‌ఎస్ పార్టీపై సదాభిప్రాయం ఉందట. కానీ.. అభ్యర్థుల పట్ల పాజిటివ్‌ రెస్పాన్స్‌ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.


Updated Date - 2022-07-30T23:35:05+05:30 IST