విపత్తు నిర్వహణ చట్టంతో ప్రజలను రక్షించండి!

ABN , First Publish Date - 2020-10-16T05:41:00+05:30 IST

పార్లమెంట్ ఆమోదించిన ఓ చక్కని చట్టం గత 15 సంవత్సరాలుగా అమలుకు నోచుకోకపోవడం వలన వరదలు, విపత్తులకు తెలంగాణ ప్రజలు తల్లడిల్లుతున్నారు. విపరీత ప్రాణనష్టం, ఆస్తి నష్టం....

విపత్తు నిర్వహణ చట్టంతో ప్రజలను రక్షించండి!

పార్లమెంట్ ఆమోదించిన ఓ చక్కని చట్టం గత 15 సంవత్సరాలుగా అమలుకు నోచుకోకపోవడం వలన వరదలు, విపత్తులకు తెలంగాణ ప్రజలు తల్లడిల్లుతున్నారు. విపరీత ప్రాణనష్టం, ఆస్తి నష్టం, ఆరోగ్య నష్టం అనుభవిస్తున్నారు. 


విపత్తుల నిర్వహణ చట్టాన్ని అమలు చేసి ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడాలంటే, లాటిచార్జ్ చేయిస్తారా? హైదరాబాదును విశ్వనగరంగా, వరంగల్‌ను ఇస్తాంబుల్‌గా, కరీంనగర్‌ను డల్లాస్ గా మార్చుతామని గత కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలకు హామీ ఇచ్చి, అధికారం దక్కించుకుంది టీఆర్‌ఎస్‌. తరువాత ఆ నగరాలు అభివృద్ధికి నోచుకోకపోవడం అటుంచి, మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి. ఈ నగరాలలోనూ, చుట్టు పక్కలా ఉన్న చెరువులు, కుంటలు, వాగులను ప్రజాప్రతినిధులు, ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ మద్దతుతో ఆక్రమించుకుని లేఔట్లు చేస్తున్నారని, ఫలితంగా వర్షకాలంలో ఆ చెరువులలో, కుంటలలో నిండాల్సిన నీరు నగరాలను ముంచెత్తుతున్నదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.


స్వాతంత్ర్యం వచ్చిన 58 సంవత్సరాల తర్వాత, 2005 లో యూపీఏ ప్రభుత్వం ‘విపత్తుల నివారణ, నిర్వహణ చట్టం –2005’ ను పార్లమెంటులో ఆమోదింపచేసింది. ప్రజలను విపత్తుల నుండి రక్షించేందుకు దేశం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక (National Disaster Management Plan), రాష్ట్ర ప్రణాళిక (State Disaster Management Plan), జిల్లా ప్రణాళిక (District Disaster Management Plan)లను తయారు చేసి, వాటిద్వారా ప్రజల ప్రాణాలను పరిరక్షించడమే కాక, విపత్తు బారిన పడిన ప్రజలకు నాణ్యమైన ఆహారం, మంచినీరు, వైద్య సదుపాయం కల్పించేందుకు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఈ చట్టంలో అతిముఖ్యమైన కనీస కార్యక్రమాలున్నాయి. విపత్తుల బారిన పడిన ప్రజలు జీవనభృతి కోల్పోయినా, పంటనష్టం, ప్రాణ నష్టం వంటివి సంభవించినా నష్ట పరిహారం అందించడం రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల బాధ్యతగా ఈ చట్టం రూపొందింది. రాజ్యాంగంలోని జీవించే హక్కును కాపాడేందుకు ఈ చట్టంలోని అంశాలు కట్టుబడ్డాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం అందుకు పూనుకోలేదు. ఈ ప్రభుత్వాల దగ్గర కనీస ప్రణాళికలు లేవు. రాష్ట్ర, జిల్లా ప్రణాళికలను తయారు చేసి తనకు సమర్పించాల్సిందిగా అజయ్ కుమార్ బంస్వాల్ కేసులో ఏప్రిల్ 4, 2016న దేశ సర్వోన్నత న్యాయస్థానం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కూడా ఆదేశించింది.


2017 మే 8 నాటికి కూడా రెండు తెలుగు రాష్ట్రాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రణాళిక సమర్పించలేదు. ఈ విషయాన్నే ఎత్తిపడుతూ వెంటనే ఈ రెండు రాష్ట్రాలు రాష్ట్ర ప్రణాళికలు తయారు చేసి సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అదే విధంగా, కరోనా కట్టడిలో ప్రజల జీవించే హక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్న నేపథ్యంలో వారి హక్కులను కాపాడాల్సిందిగా అభ్యర్థిస్తూ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నివారణ, నిర్వహణ ప్రణాళికను, జిల్లా ప్రణాళికలను సమర్పించాల్సిందిగా హైకోర్టు గత సెప్టెంబర్ 4, 2020న ఆదేశించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని సమర్పించలేదు. ఇప్పుడు తయారు చేసే పనిలో ఉన్నదని తెలుస్తున్నది. ఇదీ ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత.


సాక్షాత్తు పార్లమెంట్ తయారు చేసిన ఓ చట్టం గత 15 సంవత్సరాలుగా అమలుకు నోచుకోకపోవడం వలన వరదలు, విపత్తులకు ప్రజలు తల్లడిల్లుతున్నారు. విపరీత ప్రాణనష్టం, ఆస్తి నష్టం, ఆరోగ్య నష్టం అనుభవిస్తున్నారు. తెలంగాణలో గత మూడు సంవత్సరాలుగా పడుతున్న, ముఖ్యంగా గత ఆగస్టులో పడిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ నగరంలో వేలాది క్యూసెక్కుల నీరు మూడువందల కాలనీలను ముంచివేసింది. ఫలితంగా దాదాపు 8 లక్షల ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 3 రోజులు ప్రజలంతా వానకు తడిసి, చలికి వణికి ఆ వరదలోనే ఆహారం, మంచినీరు, వైద్యం అందక తల్లడిల్లారు. ఇక గోదావరి-ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో ఆదిలాబాద్ నుండి భద్రాద్రి-కొత్తగూడెం వరకు దాదాపు 30 లక్షల ఆదివాసి, ఆదివాసీయేతర ప్రజలు వరదల వలన నిరాశ్రయులవడంతోపాటు లక్షలాది ఎకరాల పంట నీట మునిగి జీవనాదాయం కోల్పోయారు. నాడు వరంగల్ నగర నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్ళిన మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీశారు.


స్థానిక ప్రజాప్రతినిధుల భూ ఆక్రమణలు, అవినీతి, ప్రభుత్వ యంత్రాంగం అసమర్థత, నిర్లక్ష్యాలను ప్రశ్నించినందుకు ప్రజల మీద పాలకులు లాఠీచార్జి చేయించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైద్రాబాద్ నగరంలోని కోటిమందితోపాటు, రాష్ట్రంలో అత్యధికశాతం ప్రజలు కనీస అవసరాలైన ఆహారం, మంచినీరు, వైద్యం, అందకపోవడం వలన తల్లడిల్లారు. ఒక్కరోజు కుంభవృష్టికి హైద్రాబాద్ నగరం మొత్తం మునిగిపోయింది. దాదాపు వేయి కాలనీలు వరద తాకిడికి బలయ్యాయి. విపత్తుల నిర్వహణ చట్టాన్ని అమలుకు తెచ్చి, ప్రజల జీవించే హక్కును సమర్థవంతంగా కాపాడాల్సిన ప్రభుత్వం వారి ప్రాణాలను గాలికొదిలేసింది. కష్టకాలంలో వారిని ఆదుకోకపోగా ప్రభుత్వ దుర్మార్గాన్ని ఇదేమిటని ప్రశ్నించిన వారిని పోలీసులతో చావ బాదించారు. ఈ వైఖరి సరియైనది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే చరిత్ర నిర్మాతలు. విపత్తు నిర్వహణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రజలను ఈ విపత్తుల నుండి కాపాడాలి.  


చిక్కుడు ప్రభాకర్

కన్వీనర్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక

Updated Date - 2020-10-16T05:41:00+05:30 IST