పల్లెకు పట్నం చికిత్స

Published: Sun, 27 Mar 2022 23:27:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పల్లెకు పట్నం చికిత్స

 • పీహెచ్‌సీల్లో టెలీమెడిసిన్‌
 • దృశ్య శ్రవణం ద్వారా వైద్య నిపుణుల సలహాలు, చికిత్సలు
 • మేడ్చల్‌ జిల్లాలోని 110 కేంద్రాల్లో నిర్వహణ
 • ఏడాదిగా రోగులకు అందుతున్న వైద్య సేవలు
 • ఇప్పటి వరకు 13వేల మందికి అందిన చికిత్స

కార్పొరేట్‌ ఆస్పత్రులు, ప్రైవేట్‌ మెడికల్‌ యాప్‌ల ద్వారా ప్రాచూర్యం పొందిన టెలీ మెడిసిన్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా హైదరాబాద్‌లోని గాంధీ, నిమ్స్‌, ఉస్మానియా, మల్కాజిగిరి ఏరియా తదితర పెద్దాస్పత్రుల వైద్య నిపుణులు రోగులతో టెలీ కాన్ఫరెన్స్‌లో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని అవసరమైన మందులు, టెస్ట్‌లు సూచిస్తున్నారు. మేడ్చల్‌ జిల్లాలో 110 ఆరోగ్య కేంద్రాల్లో టెలీ మెడిసిన్‌ను నిర్వహిస్తున్నారు. వాటిల్లో ఇప్పటి వరకు 13వేల మంది రోగులకు చికిత్సలు అందజేశారు. ఈ విధానం బాగుందని రోగులు పేర్కొంటున్నారు.


మేడ్చల్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కార్పొరేట్‌ వైద్యం పేదలకు అందని ద్రాక్ష. నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ తదితర పెద్ద ప్రభుత్వ ఆస్పత్రులకు గ్రామీణులు వెళ్లాలంటే వారికి ఆర్థిక, దూర భారం. ఊర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళితే.. నర్సులు, అటెండర్లు ఇచ్చే మందులు తప్ప.. అంతకు మించి వైద్యం అందదు. షుగర్‌, బీపీ, థైరాయిడ్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులకు పీహెచ్‌సీల్లో చికిత్సలు చేసే వైద్య నిపుణులు ఉండరు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం టెలీ మెడిసిన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రుల వైద్యులు నిర్ణీత సమయంలో అందుబాటులో ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులతో దృశ్య శ్రవణం ద్వారా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని, చికిత్సలు, మందులు సూచించడమే ఈ టెలీమెడిసిన్‌ విధానం. కార్పొరేట్‌ వైద్య సంస్థలు రెండేళ్లుగా టెలీ మెడిసిన్‌ విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఎక్కువగా పట్టణ, నగరాల్లో టెలీ మెడిసిన్‌ ప్రాచూర్యం పొందింది. గ్రామీణులకు సైతం వైద్య నిపుణుల సేవలను అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మేడ్చల్‌ జిల్లాలో 110 వైద్య కేంద్రాల ద్వారా రోగులకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌, మల్కాజ్‌గిరి ఏరియా ఆస్పత్రుల వైద్య నిపుణులతో వైద్యం అందిస్తోంది. ఈ విధానంలో ఇప్పటి వరకు 13,614 మంది రోగులకు వైద్య సేవలందించారు.


 • టెలీ మెడిసిన్‌ సేవలందించే విధానం ఇదీ ...

ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె, బస్తీ దవాఖానాలకు వెళ్లే రోగులకు అక్కడి ఎంబీబీఎస్‌ వైద్యుడు తమ స్థాయిలో చికిత్స చేస్తారు. దీర్ఘకాలిక చర్మవ్యాధులు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ, లివర్‌, గొంతు సంబంధ తదితర వ్యాధులుంటే గుర్తిస్తారు. అలాంటి జబ్బులకు ఇప్పటి వరకు పెద్ద ఆస్పత్రుల్లో ఉండే వైద్య నిపుణుల వద్దకు రిఫర్‌ చేసేవారు. కానీ మెడిసిన్‌ విధానంలో పెద్దాస్పత్రులకు పంపకుండానే వైద్య నిపుణులతో సేవలందించే ఏర్పాటు చేస్తున్నారు. సదరు నిపుణుడు తమ ఆస్పత్రికి అందుబాటులో ఉండే రోజును చూసి రోగులను అప్పుడు రమ్మని చెప్తారు. వైద్య నిపుణుడి అపాయింట్‌మెంట్‌ తీసుకొని స్లాట్‌ బుక్‌చేస్తారు. స్లాట్‌లో సూచించిన సమయానికి రోగిని రమ్మంటారు. రోగి రాగానే వీడియో కాల్‌ ద్వారా పరిశీలించి స్పెషలిస్టు డాక్టర్‌ మాట్లాడుతారు. దీని కోసం సాంకేతిక వ్యవస్థనంతా పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉం చారు. దీని ఎల్‌యీడీ స్ర్కీన్‌ల ద్వారా రోగి, వైద్యుడు నేరుగా మాట్లాడుకుంటారు. రోగి సమస్యలను వైద్యులు వింటారు. అనంతరం అవసరమైన మందులు, టెస్టులు రాస్తారు. వైద్య పరంగా ఏమన్నా మిగతా వి వరాలు చెప్పాలనుకుంటే పీహెచ్‌సీ వైద్యులకు సైతం స్పెషలిస్టు డాక్టరు వివరిస్తారు.


 • 110 కేంద్రాల ద్వారా సేవలు..

మేడ్చల్‌ జిల్లాలో టెలీ మెడిసిన్‌ విధానాన్ని 2021 ఆగస్టు-19 నుంచి అందుబాటులోకి తెచ్చారు. మేడ్చల్‌ జిల్లాలో 135 ప్రభుత్వ ఆస్పత్రులుండగా వాటిలో 33 పీహెచ్‌సీలు, 3 ఏరియా ఆస్పత్రులున్నాయి. 35 పల్లెదవాఖాలు, 64 బస్తీ దవాఖాలున్నాయి. వీటిల్లో 110 కేంద్రాల్లో టెలీ మెడిసిన్‌ విధానం కొనసాగుతోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు  టెలీమెడిసిన్‌ ద్వారా చికిత్సలు పొందుతున్నారు. వీటికి అదనంగా 25 ఆస్పత్రుల్లో నూ టెలీ మెడిసిన్‌ సేవలందించేందుకు  అధికారులు చర్యలు చేపట్టారు. 


 • అందుబాటులో ఉండని అన్ని రకాల మందులు

టెలీ మెడిసిన్‌లో వైద్య నిపుణులతో పరీక్షలు చేయించడం, మందులు ఇప్పించడం బాగానే ఉంది. కానీ వారు రాసే మందులు మాత్రం ప్రాథమిక ఆస్పత్రుల్లో లభించడం లేదు. సూచించిన టెస్టులు, మందులు రోగులు ప్రైవేట్‌గా చేయించుకోవాల్సి వస్తోంది. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేద రోగులు పూర్తిస్థాయి వైద్యం పొందలేకపోతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి రూ.వేలల్లో ఫీజులు చెల్లించుకోలేని పేదలు పెద్ద డాక్టర్‌ చూడడమే ఉపశమనం పొందుతున్నారు. సదరు డాక్టర్‌ రాసిచ్చిన మందులను బయట కొనలేకపోతున్నారు. టెస్టులకు సైతం ఖర్చులు భారీగా వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు.


 • టెలీ మెడిసిన్‌లో స్పెషలిస్ట్‌ వైద్య సేవల వివరాలు

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌, మల్కాజ్‌గిరి సీహెచ్‌సీ తదితర పెద్దాస్పత్రుల వైద్యులు వారంలో ఏ రోజు.. ఏ ఆస్పత్రిలో అందుబాటులో ఉంటారో జాబ్‌ చార్టును పీహెచ్‌సీల్లో ఉంచారు. నెఫ్రాలజీ, డెర్మటాలజీ, ఆంకాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్‌ మెడిసిన్‌, న్యూరాలజీ, పీడియాట్రిషియన్‌, జనరల్‌ సర్జరీ, ఫిజియోథెరపీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్‌, కార్డియాలజీ తదితర విభాగాల వైద్య నిపుణులు టెలీ మెడిసిన్‌ అందజేస్తున్నారు. ఈ స్పెషలిస్ట్‌ సేవలను మరింత మంది రోగులకు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్కో రోజు కనీసం 25మంది రోగులనైనా చూస్తే ఎక్కువ మందికి అవకాశం కలుగుతుందని పేర్కొంటున్నారు. టెలీ మెడిసిన్‌లో రోగులను మధ్యాహ్నం 12నుంచి 2గంటల వరకు పరీక్షిస్తారు. 


 • పెద్ద డాక్టర్‌ రాసిచ్చిన మందులతో నయమైంది :  నాగలక్ష్మి, కీసర

చాల సార్లు అక్కడ, ఇక్కడ చూపించుకున్నా. ఎంతకూ జబ్బు నయం కాలేదు. కీసర ఆస్పత్రిలో ఉస్మానియా వైద్యులు టెలీ మెడిసిన్‌లో పరీక్షించారు. మందులు రాసి ఇచ్చారు. కొన్ని డాక్టర్లు ఇచ్చారు. కొన్ని బయట కొన్నా. కానీ రోగం నయం అయింది. వేలల్లో ఖర్చు చేసి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లలేని వారికి టెలీ మెడిసిన్‌ విధానం బాగుంది. ఇది ఇట్లనే కొనసాగాలె. 


 • తగ్గింది కానీ.. మందుల ఇయ్యలేదు :  ఎండీ.మజహర్‌, కీసర

నాకు చర్మవ్యాధి ఉండేది. నాతో పాటు నా పిల్లలకు కూడా వచ్చింది. కీసర ఆస్పత్రిలో స్లాట్‌బుక్‌ చేసి పెద్ద డాక్టర్‌తో మాట్లాడించారు. నా సమస్యను వీడియో కాన్ఫరెన్స్‌లో డాక్టర్‌కు వివరించారు. నాకు, నా ముగ్గురు పిల్లలకూ వ్యాధి నయం అయింది. ఒక్కొక్కరికి రూ.3వేల మందులు ప్రైవేట్‌గా కొన్నాం. ప్రభుత్వం మందులు కూడా ఇస్తే బాగుంటుంది.                          


 • మా ప్రయత్నం మేం చేస్తున్నాం..  : మల్లికార్జున్‌రావు, వైద్యారోగ్య శాఖ అధికారి, మేడ్చల్‌ జిల్లా

టెలీ మెడిసిన్‌లో ఉన్న గైడ్‌లైన్స్‌ మేరకు గాంధీ ఉస్మానియా, నిమ్స్‌లోని వైద్య నిపుణులతో రోగులకు పరీక్షలు చేయిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 13వేలకుపైగా రోగులకు టెలీ మెడిసిన్‌ చికిత్సలు అందించాం. వైద్య నిపుణులు రాసిన మందుల్లో మా వద్ద ఉన్నవి అందుబాటులో ఇస్తున్నాం. లేనివి బయట కొనుక్కోమని చెబుతున్నాం.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.