మీ ఫోన్‌లో Telegram ఉందా.. అయితే అర్జెంట్‌గా ఈ విషయం తెలుసుకోండి..!

ABN , First Publish Date - 2021-07-22T18:29:24+05:30 IST

అలర్ట్... మీ ఫోన్‌లో Telegram ఉందా.. అయితే అర్జెంట్‌గా ఈ విషయం తెలుసుకోండి..!

మీ ఫోన్‌లో Telegram ఉందా.. అయితే అర్జెంట్‌గా ఈ విషయం తెలుసుకోండి..!

హైదరాబాద్‌ సిటీ : పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా సైబర్‌ నేరగాళ్లు తమ పంథా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు భౌతికంగా జరిగే నేరాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. సోషల్‌ మీడియా సైబర్‌ నేరగాళ్లకు వరంగా మారింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌తో పాటు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డు, ఓటీపీలతో నిండా ముంచుతున్న సైబర్‌ కేటుగాళ్లు టెలిగ్రామ్‌ యాప్‌ను (Telegram app) కూడా అందుకు వేదికగా చేసుకున్నారు. ఈ యాప్‌ గ్రూప్‌లో అనుమతి లేకుండా చేరే సైబర్‌ నేరగాళ్లు లింకులు పంపి నట్టేట ముంచేస్తున్నారు.


అమాయకులను దోచేస్తున్నారు..

ఇతర యాప్‌ల మాదిరిగానే టెలిగ్రామ్‌ ద్వారా సైబర్‌ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు చెందిన సైబర్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రియల్‌టైమ్‌ మెసేజ్‌ చేరేందుకు వీలుగా గుర్తించిన యాప్‌లలో వాట్సా్‌పకు 2 బిలియన్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌కు 1.3 బిలియన్‌, వి చాట్‌కు 1.12 బిలియన్‌ యూజర్లు ఉన్నారు. ఆయా యాప్‌ల ద్వారా సుమారు 7 బిలియన్‌ చర్చలు.. సందేశాలు.. ఫైల్‌ ట్రాన్స్‌ఫర్స్‌ జరుగుతాయని గణాంకాలు చెబుతున్నాయి. వ్యక్తిగత, ప్రభుత్వ, వ్యాపార, వ్యవహారాలకు సంబంధించి ఎన్నో సందేశాలకు ఈ సోషల్‌ మీడియాలు వేదికగా మారాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు  రెచ్చిపోతున్నారు. అమాయకులను దోచేస్తున్నారు.


గ్రూపుల్లోనే క్రిమినల్స్‌.. 

సైబర్‌ నేరగాళ్లు ఎక్కడి నుంచే పుట్టుకురారని పోలీసులు చెబుతున్నారు. ఆయా గ్రూప్‌లలో ఉండే వారిలో కొంతమంది క్రిమినల్స్‌ ఉండే అవకాశం ఉందని, వారు చేసే ఫిషింగ్‌లకు ఇరుక్కునే అమాయకులు భారీగా నష్టపోతుంటారని పేర్కొంటున్నారు. ఏదో ఓ గ్రూప్‌లో సాధారణ మెంబర్‌గానే ఎంట్రీ అయి అమాయకులను బోల్తా కొట్టిస్తుంటారు. గ్రూప్‌ మెంబర్‌ కదా అని చాలా మంది వారు పంపించే లింకులను క్లిక్‌ చేసి తమ ఫోన్‌ను.. అందులోని డేటాను వారికి సమర్పించుకుంటారు. మోసపోయిన తర్వాత చేసిన తప్పు అర్థమైనప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. 


తెరపైకి రాని బాధితులు..

ఓ గ్రూప్‌లో వేల సంఖ్యలో ఉండే మెంబర్లు, ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా సాగే చర్చలు, దేశ విదేశాలకు చెందిన సభ్యు లు ఉండటంతో టెలిగ్రామ్‌ యాప్‌ను సైబర్‌ మోసగాళ్లు తెలివిగా వినియోగించుకుంటున్నారు. వ్యక్తిగత వివరాలు, ఫోన్‌ నెంబర్‌ ప్రదర్శించకుండానే టెలిగ్రామ్‌లో ఇతర సభ్యులతో మాట్లాడే అవకాశం ఉండటం సైబర్‌ నేరస్థులకు వరంగా మారింది. రెండు లక్షల మంది సభ్యులతో గ్రూప్‌ క్రియేట్‌ చేసే అవకాశం ఉంది. ఆ గ్రూప్‌లో చేరేందుకు ఇతరులకూ అవకాశం ఉంటుంది. సైబర్‌ క్రిమినల్స్‌ టెలిగ్రామ్‌ వినియోగించి, అందులో ప్రకటనలు చేస్తున్నారు. సభ్యులతో కనెక్ట్‌ అయి.. లింకులు పంపి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతానికి టెలిగ్రామ్‌ ద్వారా బాధితులు ఉన్నప్పటికీ ఇంకా తెరపైకి రావడం లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రామ్‌ను వినియోగించి మోసగించే వారి సంఖ్య పెరిగిందని, అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2021-07-22T18:29:24+05:30 IST