TDPలో తారస్థాయిలో వర్గపోరు.. నువ్వయినా చెప్పు చంద్రబాబూ..!?

ABN , First Publish Date - 2022-05-20T06:32:10+05:30 IST

అనంతపురం అర్బన మొదలుకొని మడకశిర నియోజకవర్గం వరకూ ఒకటి రెండు మినహా.. మెజార్టీ నియోజకవర్గాల్లో ముఖ్యనాయకులను అనుసరించి.. పార్టీ శ్రేణులు వర్గాలుగా విడిపోయాయి.

TDPలో తారస్థాయిలో వర్గపోరు.. నువ్వయినా చెప్పు చంద్రబాబూ..!?

  • నేడు పార్టీ జిల్లా  విస్తృతస్థాయి సమావేశం

 

అనంతపురం, మే19 (ఆంధ్రజ్యోతి) : అనంతపురం అర్బన్ మొదలుకొని మడకశిర నియోజకవర్గం వరకూ ఒకటి రెండు మినహా.. మెజార్టీ నియోజకవర్గాల్లో ముఖ్యనాయకులను అనుసరించి.. పార్టీ శ్రేణులు వర్గాలుగా విడిపోయాయి. రాష్ట్ర స్థాయి నుంచి పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను సైతం వేర్వేరుగానే నిర్వహిస్తున్నారు.


- ధర్మవరం నియోజకవర్గంలో ఇదివరకూ ఆ పార్టీలో పనిచేసిన నాయకులు కొంతమంది స్తబ్దుగా ఉన్నారు. ఇక్కడ గ్రూపు విభేదాలు లేకపోయినా, కొందరు ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య సఖ్యత కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో... కొందరు ముఖ్యులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.


- పెనుకొండ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు మూడు గ్రూపులుగా విడిపోయాయి.   పార్టీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కురబ కార్పొరేషన మాజీ చైర్‌పర్సన సవిత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గాలుగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో సఖ్యతగా కనిపించినా, లోలోన వర్గాలుగానే పనిచేస్తున్నాయి.


- మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న కారణంగా, టీడీపీ సామాజికవర్గానికి చెందిన ఓ వర్గం వేరుకుంపటి పెట్టుకుంది. దీనికి తోడు పల్లెకు వ్యతిరేకంగా జేసీ వర్గం పనిచేస్తోంది. ఇలా పుట్టపర్తి నియోజకవర్గంలోనూ పార్టీ శ్రేణులు రెండుగా విడిపోయాయి. మరికొంత మంది ద్వితీయస్థాయి నాయకులు స్తబ్దుగా ఉన్నారు.


- హిందూపురం నియోజకవర్గంలో పైకి అందరూ ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, లోలోన మూడు గ్రూపులుగా పార్టీ శ్రేణులు విడిపోయాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చిన సందర్భంలో మాత్రమే ఆ గ్రూపులన్నీ కలిసికట్టుగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నాయి. బాలకృష్ణ అలా వెళ్లగానే ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్‌ చైర్మన రావిళ్ల లక్ష్మీనాగరాజు వేర్వేరు వర్గాలుగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఆ నియోజకవర్గం కంచుకోట. ఈ నేపథ్యంలో, ఏ వర్గంవైపు వెళ్లాలో పార్టీ శ్రేణులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 


- మడకశిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ... మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న మధ్య వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. పార్టీ శ్రేణుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.


- అనంతపురం అర్బన్‌లో నాయకులు, కార్యకర్తలు జేసీ వర్గీయులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వర్గీయులుగా విడిపోయారు. ఒకే పార్టీలో ఉన్నా.. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరూ తగ్గడం లేదు. దీంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది.


- కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారు. పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. 


- గుంతకల్లు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ వర్గాలుగా శ్రేణులు విడిపోయాయి. ఆదినుంచి వేరుకుంపటి పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సమన్వయం చేసేందుకు ముఖ్య నాయకులు చొరవ చూపకపోవడమే విభేదాలకు ప్రధాన కారణం. 


- శింగనమల నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నియోజకవర్గ ఇనచార్జ్‌  బండారు శ్రావణిశ్రీ, టూమెన కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు వర్గాలుగా పార్టీ శ్రేణులు విడిపోయాయి. మరే నియోజకవర్గంలో లేని విధంగా పార్టీ శ్రేణులు నాలుగు వర్గాలుగా విడిపోయాయి. 


- కదిరి నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ నేతృత్వంలోనే పార్టీ కార్యక్రమాలు ఇప్పటివరకూ నిర్వహించారు. తాజాగా, వైసీపీలో నుంచి టీడీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా వైరి వర్గంగా వ్యవహరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


- తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఈ సమస్య తలెత్తుతోంది. తాజాగా పుట్టపర్తిలో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఆ పరిణామాలు జేసీ వర్సెస్‌ పల్లె అన్న స్థాయికి చేరాయి. ఇక్కడే ఇద్దరు నాయకులు వ్యక్తిగత విమర్శలు, సవాళ్లకు దిగారు. ‘దొమ్మటక్కోడివి నువ్వేంది.. నన్నడ్డగించేది?’ అని ఒకరంటే.. ‘సపోర్టు లేకుండా 50 మీటర్లు నడవలేని నువ్వా నాకు నీతులు చెప్పేది?’ అని ఇంకొకరు విమర్శలు చేసుకున్నారు. ఆ పరిణామాలు పార్టీలో రెండు వర్గాల్లో మధ్య మరింత చిచ్చును రాజేశాయి. 


- అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనూ ఈ తరహా పరిస్థితులే కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయినా, పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నా, ఒకరిపై ఒకరు విమర్శలకు దిగినా.. ఆ పార్టీ ముఖ్య సారథులెవరూ జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉమ్మడి జిల్లాలో ఉంది. 


 అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో పార్టీలో నాయకుల మధ్య వర్గవిభేదాలకు స్వస్తి పలికే విధంగా చొరవ చూపాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అంటున్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆ దిశగా హితబోధ చేస్తారని ఆ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు.

Updated Date - 2022-05-20T06:32:10+05:30 IST