వాటా ఇవ్వం.. దిక్కున్నచోట చెప్పుకో

ABN , First Publish Date - 2022-07-07T07:58:30+05:30 IST

వాటా ఇవ్వం.. దిక్కున్నచోట చెప్పుకో

వాటా ఇవ్వం..  దిక్కున్నచోట చెప్పుకో

కాపు రామచంద్రారెడ్డిపై కాంట్రాక్టర్ల తిరుగుబాటు

హెచ్‌ఎల్సీ, ఎల్లెల్సీ పనుల తనిఖీకి వెళ్లిన విప్‌ కాపు

పర్సెంటేజీ అడగటంతో ఎదురు తిరిగిన కాంట్రాక్టర్లు

పనులు చేయిస్తున్నవారిలో ఎక్కువగా వైసీపీ నేతలు

కొందరు ఎమ్మెల్యేలు, మంత్రి కూడా కాపునకు వార్నింగ్‌?

చేసేది లేక తిరుగుముఖం పట్టిన ప్రభుత్వ విప్‌


అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విప్‌, వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, రాయదుర్గం ఎమ్మెల్యే  కాపు రామచంద్రారెడ్డిపై కాంట్రాక్టర్లు బుధవారం తిరగబడ్డారు. కర్ణాటక రాష్ట్రంలోనూ, కర్నూలు జిల్లా పరిధిలోనూ జరుగుతున్న తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల(హెచ్‌ఎల్సీ, ఎల్లెల్సీ) ఆధునికీకరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచిఆయనకు చేదు అనుభవం ఎదురైంది. పర్సెంటేజీల కోసం కాంట్రాక్టర్లపై ఆయన ఒత్తిడి చేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ‘కర్ణాటక, కర్నూలు జిల్లా పరిధిలో జరుగుతున్న పనులపై నీ పెత్తనం ఏమిటి..? ఇక్కడి పనులతో నీకేమి సంబంధం..?’ అని కొందరు కాంట్రాక్టర్లు రీచ్‌ వద్ద కాపుని నిలదీసినట్లు తెలిసింది. తుంగభద్ర బోర్డు పరిధి లో జరిగే పనుల విషయంలో ఆది నుంచి కాపు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై ఆయనకు అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఒక మంత్రి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారని తెలిసింది. అసలేం జరిగిందంటే..కాపు రామచంద్రారెడ్డి తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆధునికీకరణ పనులను పరిశీలించేందుకు బుధవారం వెళ్లారు. తుంగభద్ర ఎగువ కాలువలో(13 ప్యాకేజీలు) రూ.430 కోట్లు, ఎగువ కాలువలో రూ.500 కోట్లతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఎగువ కాలువ పనుల పరిశీలన అనంతరం దిగువ కాలువ పనులను చూసేందుకు కాపు వెళ్లారు. దిగువ కాలు వ పనులన్నీ కర్ణాటక, కర్నూలు జిల్లా పరిధిలో జరుగుతున్నాయి. అక్కడికి వెళ్లి, పర్సెంటేజీలు అడగటంతో కాంట్రాక్టర్లు ఎదురు తిరిగినట్లు తెలిసింది. ‘ఒక ప్రజాప్రతినిధిగా పనులు పరిశీలించవచ్చు. కానీ ఆయన వేరే ఉద్దేశంతో వస్తున్నారు. తనకు పనుల్లో పర్సెంటేజీ ఇవ్వాలని ఆది నుంచి డిమాండ్‌ చేస్తున్నారు’ అని కొందరు కాంట్రాక్టర్లు మండిపడ్డారు. ఆధునికీకరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది వైసీపీవారే. దీంతో తాము చేసే పనులపై పెత్తనం ఏమిటని రామచంద్రారెడ్డికి ఎదురు తిరుగుతున్నారు. ఈ వివాదం బుధవారం పతాక స్థాయికి చేరింది. కొందరు కాంట్రాక్టర్లు కాపుపై తిరుగుబాటు చేసి నిలదీశారు. ‘నీ ఇష్టం వచ్చింది చేసుకో. మాదీ వైసీపీనే. నీకు దిక్కున్న చోట చెప్పుకో..’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరికొందరు అక్కడి నుంచే నేరుగా ప్రభుత్వ సలహాదారుకు(సజ్జల రామకృష్ణారెడ్డి) ఫోన్‌ చేసి విషయం చెప్పినట్లు సమాచారం. రామచంద్రారెడ్డి వేధింపుల గురించి అమరావతిలో ఉండే పాత్రికేయులకు కొందరు కాంట్రాక్టర్లు వీడియో కాల్‌ చేసి వివరించారు. కాపు తీరుతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని తుంగభద్ర బోర్డు లో ఉండే కొందరు ఇంజనీర్లు వాపోయారు. ఒక ఎమ్మెల్యే కూడా కాపు రామచంద్రారెడ్డికి బుధవారం గట్టిగా వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇక చేసేది లేక బుధవారం మధ్యాహ్నం కాపు తిరుగుముఖం పట్టినట్లు తెలిసింది.

Updated Date - 2022-07-07T07:58:30+05:30 IST