ఇంకా వద్దనే స్వేచ్ఛ లేదు!

ABN , First Publish Date - 2021-04-25T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ తర్వాత విడుదలై వసూళ్ల విజయం సాధించిన సినిమాల్లో జాంబిరెడ్డి ఒకటి. ఈ సినిమా హీరో తేజ సజ్జా బాలనటుడిగా సినీ కెరీర్‌ ప్రారంభించాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... హీరోగా ఎదిగిన తేజను నవ్య పలకరించింది...

ఇంకా వద్దనే స్వేచ్ఛ లేదు!

లాక్‌డౌన్‌ తర్వాత విడుదలై వసూళ్ల విజయం సాధించిన సినిమాల్లో జాంబిరెడ్డి ఒకటి. ఈ సినిమా హీరో తేజ సజ్జా బాలనటుడిగా సినీ కెరీర్‌ ప్రారంభించాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... హీరోగా ఎదిగిన తేజను నవ్య పలకరించింది...



కొవిడ్‌ ఎలాంటి అనుభవాలను మిగిల్చింది? 

నిజంగా చెప్పాలంటే నాపై కొవిడ్‌ ప్రభావం లేదు. మానసికంగా.. శారీరకంగా.. ఆర్థికంగా బానే ఉన్నా. అయితే నా చుట్టూ ఉన్న గందరగోళాన్ని గమనిస్తున్నా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలయిన సినిమాలన్నింటికీ మంచి కలెక్షన్లు వచ్చాయి. క్రాక్‌, ఉప్పెన, 30 రోజుల్లో ప్రేమించటం ఎలా, జాంబిరెడ్డి, వకీల్‌ సాబ్‌- ఇలా అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు. ఇలా అనచ్చో లేదో తెలియదు కానీ.. ప్రేక్షకులు మమల్ని క్షమించి.. సినిమాలు చూస్తున్నారనిపిస్తోంది. గత ఏడాది కొవిడ్‌ వల్ల జాంబిరెడ్డి వాయిదా పడింది. మళ్లీ ఈ సారి ఇష్క్‌ వాయిదా పడింది..


ఇష్క్‌ ప్రమోషన్‌ అయిన తర్వాత ఆగిపోయింది కదా. అప్పుడు ఎలా అనిపించింది..?

థియేటర్లు ఇంత త్వరగా మూసేస్తారని అనుకోలేదు.  సినిమా రీలీజ్‌ డేట్‌ ప్రకటించి.. పబ్లిసిటీ మొదలెట్టే సమయానికి కేసులు పెరిగాయి. దీంతో పాటు థియేటర్లకు వచ్చే ఆడియన్స్‌ సంఖ్య కూడా తగ్గిపోయింది. మా సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయనే నమ్మకం మాకుంది. కానీ విడుదల చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.. అందుకే వాయిదా వేద్దామని నిర్ణయానికి వచ్చాం. ఆ తర్వాత కొన్ని తప్ప మిగిలిన థియేటర్లన్నీంటినీ మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి సినిమా వాయిదా వేయటమనేది చాలా కఠినమైన నిర్ణయమే! ఎందుకంటే కొవిడ్‌ తగ్గిన తర్వాత నారప్ప, ఆచార్య, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ పార్ట్‌2 వంటి పెద్ద సినిమాలతో ఇష్క్‌ పోటీ పడాల్సి ఉంటుంది. 


హీరోగా మీరు నటించిన జాంబిరెడ్డి కమర్షియల్‌ హిట్‌.. ఆ తర్వాత మీలో ఏదైనా మార్పు వచ్చిందా?

ముందు ఎలా ఉన్నానో.. ఇప్పుడూ అలాగే ఉన్నా. ఇంకా జాగ్రత్తగా ఉన్నా. గతంతో పోలిస్తే దర్శకులు, నిర్మాతల నుంచి స్పందన బావుంది. అయితే ఇప్పటికీ ఎవరైనా పెద్ద నిర్మాత అడిగితే.. నాకు కథ నచ్చకపోతే.. వద్దు అనే స్వేచ్ఛ ఇంకా లేదు. ఒక వేళ అలా చెబితే బాడ్‌ బుక్స్‌లో పడే అవకాశం కూడా ఉంది. జాంబి తర్వాత పదో, పదిహేనో కథలు వినుంటా. చాలా జాగ్రత్తగా సినిమాను ఎంపిక చేసుకోవాలనేది నా ఉద్దేశం. మంచి సినిమా దొరకకపోతే ఖాళీగా ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటా. వెంటవెంటనే సినిమాలు చేయాలనే తొందర లేదు. ఏడాదికి ఒక సినిమా చేసినా ఫుల్‌ ఎనర్జీ దాని మీదే పెట్టాలనుకుంటన్నా!


మీ దృష్టిలో మంచి సినిమా అంటే ఏమిటి?

ప్రేక్షకులకు నచ్చేది మంచి సినిమా! ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాలాంటి కొత్తహీరోలకు ఎక్కువ అవకాశాలు రావు. అందువల్ల ఆతృతతో నచ్చినా, నచ్చకపోయినా వచ్చిన సినిమాలను చేస్తే దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అందువల్ల సినిమా ఎంపికలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా!


ఓటీటీలు వచ్చిన తర్వాత కథలు, వాటిని చెప్పే తీరుతెన్నులు మారిపోతున్నాయి కదా..

కంటెంట్‌పరంగా కొన్ని సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ఈ మధ్య మలయాళం సినిమాలు- జోజి, ఇష్క్‌లాంటివి చూశా. చాలా బావున్నాయి. అయితే అలాంటి సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి డబ్బులు పెట్టి చూస్తారా? అని అడిగితే వెళ్తారని చెప్పలేం. థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులు చూసే సినిమాలు వేరుగా ఉంటాయి. ఈ మధ్య వచ్చిన వాటిలో జాతిరత్నాలు బావుంది. థియేటర్‌లో ఆడినంత వరకూ ఈ సినిమా మీద విమర్శలు లేవు. ఓటీటీలో వచ్చిన తర్వాత కొన్ని విమర్శలు మొదలయ్యాయి. నా ఉద్దేశంలో ఓటీటీలో కంటెంట్‌ను ప్రేక్షకులు చూస్తున్నారు. ఎంజాయ్‌ చేస్తున్నారు. అలాంటి కంటెంట్‌ను మన దగ్గర రిపీట్‌ చేసే ఫెయిల్‌ అవుతాం. ఇప్పటికీ ప్రేక్షకులకు రెండు పాటలు, మూడు ఫైట్స్‌ అవసరం. మొన్న వకీల్‌ సాబ్‌ మొదటి రోజు సంధ్య థియేటర్‌లో చూశా! కోర్టులో పవన్‌ కల్యాణ్‌గారిని చూస్తుంటే ఫ్యాన్స్‌ వెర్రెక్కి పోయారు. థియేటర్‌కు వెళ్లి చూసే ప్రేక్షకులకు ఇంకా అలాంటి హీరోయిజం కావాలి. అలాంటి సినిమాల్లో నటిస్తేనే ఎక్కువ కాలం కెరీర్‌ ఉంటుంది. 


మీరు బాలనటుడిగా ప్రవేశించారు. ఇప్పుడు హీరో అయ్యారు.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఇండస్ట్రీలో ఏదైనా మార్పు వచ్చిందా?

నాకు రెండున్నరేళ్లు ఉన్నప్పుడు మొదటి సినిమాలో నటించా. ఆ తర్వాత 50 సినిమాల్లో నటించా. నా చిన్నతనంలో ప్రేక్షకులకు ఎక్స్‌పోజర్‌ తక్కువుండేది. ఎక్కువగా స్పందించేవారు. ఇప్పుడు రిసీవింగ్‌ చాలా తక్కువ ఉంటోంది. ప్రతి సీన్‌లోను ఏదో ఒక కొత్తదనం చూపించాలి. ఎంటర్‌టైన్‌ చేయాలి. కేవలం కొత్త కథలు చేయడం ద్వారానే ఎక్కువ కాలం హీరోలుగా ఉండలేరు. ఆన్‌స్ర్కీన్‌, ఆఫ్‌స్ర్కీన్‌లో ప్రవర్తన బావుంటేనే హీరోలుగా ఉండగలుగుతారు. టాలెంట్‌తో పాటు యాటిట్యూడ్‌ కూడా సరిగ్గా ఉండాలి. అప్పుడు.. ఇప్పుడు ఇదే సూత్రం వర్తిస్తుంది. 






బాలనటులకు హీరోలవ్వాలని ఉంటుందా? వారిపై ఎలాంటి ఒత్తిడి ఉంటుంది?

బాలనటులకు ఒక సమస్య ఉంటుంది. మాకు హీరో అవ్వాలని ఉన్నా.. లేకపోయినా.. అందరూ ‘నువ్వు హీరో ఎప్పుడు అవుతావు’ అంటుంటారు. డైరక్టర్లు సరదాగా పిలిచి అడ్వాన్స్‌లు ఇస్తూ ఉంటారు. నా జీవితంలో కూడా అలాంటివెన్నో జరిగాయి. ఇలాంటి సంఘటనల వల్ల హీరో కావాలనే కోరిక పెరుగుతుంది. అదే సమయంలో తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంటుంది. అందరూ మనవాళ్లే అనిపిస్తుంది. అసలు నిజం తెలిసిన తర్వాత మబ్బులన్నీ వీడిపోతాయి!


మీకు అలాగే జరిగిందా?

అశ్వనీదత్‌గారు, రాఘవేంద్రరావుగారు, వినాయక్‌గారు, అరవింద్‌గారు... వీళ్లందరి సినిమాల్లో చేశా. అందరూ బాగా ముద్దు చూసేవారు. ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సంరలో చదువు మానేసి వైజాగ్‌లో సత్యానంద్‌గారి దగ్గరకు వెళ్లా. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి డిగ్రీలో చేరి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టా. చాలా మంది నమ్మరు.. కానీ ఆరేళ్ల పాటు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా. 2013 నుంచి 17 వరకూ ఎంత మంది ప్రామి్‌సలు చేశారో.. అడ్వాన్స్‌లు ఇచ్చారో.. ఇచ్చిన చెక్కులు ఎన్ని బౌన్స్‌ అయ్యాయో నాకు మాత్రమే తెలుసు. నాలుగు రోజుల్లో సినిమాలు ప్రారంభం అవుతుందనగా.. ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ నాకు మంచి గుణపాఠాలు నేర్పాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా చిరాకు పడిపోకూడదనే విషయాన్ని తెలియచెప్పాయి..


ఇలాంటి పరిస్థితుల్లో మీకు తోడుగా నిలిచినవారెవరైనా ఉన్నారా? మీ కుటుంబసభ్యుల రియాక్షన్‌ ఏమిటి?

నాన్న ఫార్మా రంగంలో ఉన్నారు. సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు.. ‘‘నువ్వు వ్యాపారం చేస్తానను.. డబ్బులు ఇస్తా.. సినిమాల్లోకి వెళ్తానంటే మాత్రం సపోర్టు చేయను’’ అన్నారు. అమ్మకి నేను ఏం చేసినా బావుంటుంది. ‘‘నువ్వు సూపర్‌’’ అంటుంది. ఇక మా అన్నయ్య కూడా ఫ్యామిలీ బిజినె్‌సలోనే ఉన్నాడు. నేను తప్ప మొత్తం మా కజిన్స్‌ అంతా బిజినె్‌సలోనే ఉన్నారు.. అందరూ ‘వీడు సినిమాల్లోకి వెళ్లాడు..’ అన్నట్లు చూస్తుంటారు.. ఇక సపోర్టు విషయానికి వస్తే- నేను ఎమోషనల్‌గా ఎవరిపైనా ఆధారపడను. దర్శకులు సుజిత్‌, శశి, అనుదీప్‌, ప్రశాంత్‌వర్మ- వీళ్లందరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌. మేమందరం ఒకే సారి జర్నీ మొదలుపెట్టాం. ఈ మధ్య అయితే దర్శకురాలు నందినీరెడ్డితో మంచి, చెడు పంచుకుంటున్నా! 


నాన్న ఫుల్‌ హ్యాపీ..

నాన్నకు నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. ‘ఓ బేబీ’ సినిమా మాతృక చూసి- ‘దీనిలో నీకు క్యారెక్టర్‌ ఏముందిరా? ఐదేళ్లు హీరో కావాలని వెయిట్‌ చేసి సైడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నావా?’ అన్నారు. కానీ ఆ సినిమాలో నా క్యారెక్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా పూర్తయిన తర్వాత నాన్న చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నందిని గారికి ఫోన్‌ చేసి- మా అబ్బాయికి మంచి ఫ్లాట్‌ఫాం’ ఇచ్చారు అని కాంప్లిమెంట్స్‌ చెప్పారు. ఆ తర్వాత కూడా కొంత అనుమానం ఉండేది అనుకుంటా. ‘జాంబిరెడ్డి’ చూసిన - తర్వాత నాతో ‘’నువ్వు చేసేయగలుగుతావు’’ అన్నారు. నాన్న హ్యాపీ అయితే నేనూ హ్యాపీ!

Updated Date - 2021-04-25T05:30:00+05:30 IST