సింగపూర్‌లో తెలుగుబడి స్నాతకోత్సవం

ABN , First Publish Date - 2022-07-24T18:03:47+05:30 IST

సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్‌లో నివసించే తెలుగు బాలబాలికలకు గత 12 సంవత్సరాలుగా లాభాపేక్షలేకుండా, సేవా ధృక్పథంతో, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన గురువుల సహకారంతో నిర్విరామంగా తరగతులు నిర్వహిస్తుంది.

సింగపూర్‌లో తెలుగుబడి స్నాతకోత్సవం

సింగపూర్ సిటీ: సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్‌లో నివసించే తెలుగు బాలబాలికలకు గత 12 సంవత్సరాలుగా లాభాపేక్షలేకుండా, సేవా ధృక్పథంతో, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన గురువుల సహకారంతో నిర్విరామంగా తరగతులు నిర్వహిస్తుంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం పాఠ్యప్రణాళికతో సాగే ఈ తరగతులు కోవిడ్-19 సమయంలో సైతం జూమ్ మాధ్యమంలో నిర్వహించబడ్డాయి. 2021-2022 విద్యాసంవత్సరానికి మే నెలలో పరీక్షలు నిర్వహించగా జూలై 17న స్నాతకోత్సవం జరిపి ఉత్తీర్ణులైన బాలబాలికలందరికీ ప్రశంసా పత్రాలనందించారు. సుమారు 50 మంది బాలబాలికలతో పాటు, వారి తల్లితండ్రులు పాల్గొన్న ఈకార్యక్రమానికి స్వాతి కురిచేటి వాఖ్యాతగా వ్యవహరించగా,  వివిధ సాంసృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.


ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలు పదికాలాలు నిలవాలంటే భాషే ప్రధానమని, తద్వారా అవి పరిరక్షించబడి భావితరాలకు అందుతాయన్నారు. మాతృదేశానికి మనం దూరంగా ఉండటంతో పాటు ఆంగ్లమే ప్రధాన మాధ్యమంగా ఉన్న ఈరోజుల్లో మన తెలుగుబడి పిల్లలు వారి తెలుగు మాత్రమే తెలిసిన వారి నానమ్మ, అమ్మమ్మ, తాతలతో మనస్పూర్తిగా తెలుగులో మాట్లాడుతూ వారిని ఆనందింపచేస్తున్నారని పిల్లల తల్లితండ్రులు మాకు చెబుతున్నప్పుడు మాకు మరింత ఆనందం వేస్తుందన్నారు. జరగనున్న విద్యాసంవత్సర ప్రణాళికను తెలుగుబడి కార్యనిర్వహణాధికారి, తెలుగు సమాజం కోశాధికారి మల్లిఖార్జునరావు పాలెపు తల్లితండ్రులకు వివరించారు. తెలుగుబడి విజయవంతంగా నిర్వహించబడుతుందంటే గానికి కారణం ఉత్సాహం చూపించిన విద్యార్ధులు, చేర్పించి ఎల్లవేళలా తోట్పాటు ఇచ్చిన తల్లితండ్రులు, మరీ ముఖ్యంగా తమ విలువైన సమయాన్ని అంకితమిచ్చిన గురువులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుబడి టీచర్లు కాయల రాఘవేంద్ర, కొనిజేటి శ్రీలక్ష్మి, దొంతు కిరణ్, ఆలపాటి రాఘవ, కనగాల సౌందర్య, వల్లభజోస్యుల రంగనాధ్, ముల్పూరి ప్రతిమలను సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేసింది.









Updated Date - 2022-07-24T18:03:47+05:30 IST