మన నిఖత్‌.. బంగారం

ABN , First Publish Date - 2022-08-08T06:34:05+05:30 IST

తెలుగు బాక్సర్‌, ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ అదరగొట్టింది. తన పంచ్‌ పవర్‌ చూపిస్తూ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం కొల్లగొట్టింది. మహిళల 50 కిలోల విభాగం ఫైనల్లో ఐర్లాండ్‌ బాక్సర్‌ కార్లీ మెక్‌నాల్‌ను చిత్తుచేసి విజేతగా నిలిచింది. బాక్సింగ్‌లో నిఖత్‌తో పాటు నీతు,

మన నిఖత్‌.. బంగారం

గోల్డ్‌ రష్‌!

కామన్వెల్త్‌ క్రీడలు

జరీన్‌ సహా ముగ్గురు బాక్సర్లకు స్వర్ణాలు..

ట్రిపుల్‌ జంప్‌లో ఎల్డోస్‌, పారా టీటీలో భవినాకు పసిడి

బ్యాడ్మింటన్‌లో కిడాంబి శ్రీకాంత్‌కు కాంస్యం..

సింగిల్స్‌ ఫైనల్లో సింధు, లక్ష్యసేన్‌


తెలుగు బాక్సర్‌, ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ అదరగొట్టింది. తన పంచ్‌ పవర్‌ చూపిస్తూ కామన్వెల్త్‌ క్రీడల్లో  స్వర్ణం కొల్లగొట్టింది. మహిళల 50 కిలోల విభాగం ఫైనల్లో ఐర్లాండ్‌ బాక్సర్‌ కార్లీ మెక్‌నాల్‌ను చిత్తుచేసి విజేతగా నిలిచింది. బాక్సింగ్‌లో నిఖత్‌తో పాటు నీతు, అమిత్‌ పసిడి పతకాలు సాధించగా.. ట్రిపుల్‌ జంప్‌లో ఎల్డోస్‌ పాల్‌, పారా టేబుల్‌ టెన్నిస్‌లో భవినా పటేల్‌ స్వర్ణాలతో మెరిశారు. సింగిల్స్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్‌, డబుల్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌ జోడీ ఫైనల్స్‌కు దూసుకెళ్లగా.. కిడాంబి శ్రీకాంత్‌ కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఇలా.. పోటీలకు పదోరోజైన ఆదివారం మన ఆటగాళ్లు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలతో పతకాభిషేకం చేశారు. ప్రస్తుతం భారత్‌ 17 స్వర్ణ, 13 రజత, 21 కాంస్యాలతో మొత్తం 51 పతకాలు సాధించి ఐదోస్థానంలో నిలిచింది.


కామన్వెల్త్‌ క్రీడల పదోరోజు పతకాల జడివాన కురిసింది. బాక్సర్ల పంచ్‌లకు స్వర్ణాలు వెల్లువెత్తాయి. తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ బంగారంతో సత్తా చాటింది. అమిత్‌, యువ బాక్సర్‌ నీతూ స్వర్ణాలతో భళా అనిపించారు. ఎల్డోస్‌ పాల్‌, అబ్దుల్లా ట్రిపుల్‌ జంప్‌లో తొలి రెండు స్థానాలతో చరిత్ర సృష్టించారు. పారా టీటీ స్టార్‌ భవినా  పసిడి పతకం పట్టేయగా.. టీటీ పురుషుల డబుల్స్‌లో శరత్‌ కమల్‌ జోడీ రజతం నెగ్గింది. స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపికా పళ్లికల్‌/సౌరవ్‌ జంట.. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌  కాంస్యాలు దక్కించుకున్నారు.


బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో ముందురోజు పోటీలలో సాధించిన పతకాల స్ఫూర్తిగా ఆదివారం నాడు భారత అథ్లెట్లు మరింత విజృంభించారు. ఫలితంగా మరో 13 పతకాలు మన ఖాతాలో చేరాయి. పదోరోజు అయితే పసిడి తుఫాన్‌ వచ్చింది. ఏకంగా ఐదు స్వర్ణాలు లభించాయి. 


ఎదురులేని నిఖత్‌

ప్రపంచ చాంపియన్‌, తెలుగు బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన పంచ్‌ పవర్‌ చూపింది. ఆదివారం జరిగిన మహిళల 50 కిలోల ఫైనల్లో జరీన్‌ ధాటికి ప్రత్యర్థి బెంబేలెత్తింది. గత ఏడాది జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప నుంచి తిరుగులేని ఫామ్‌లో ఉన్న జరీన్‌ టైటిల్‌ ఫైట్‌లో 5-0తో కార్లీ మెక్‌నాల్‌ (నార్తర్న్‌ఐలాండ్‌)ను మట్టికరిపించింది. దాంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో బరిలో దిగిన తొలిసారే పసిడి పతకంతో నిఖత్‌ తన హవా చాటింది. కామన్వెల్త్‌ కోసం 52 నుంచి 50  కేజీల విభాగానికి మారిన నిఖత్‌.. పదునైన పంచ్‌లతో విరుచుకుపడి మెక్‌నాల్‌ను వణికించింది. 26 ఏళ్ల తెలంగాణ బాక్సర్‌ ఏస్థాయిలో చెలరేగిందంటే.. తొమ్మిది నిమిషాల బౌట్‌ ముగిసే సరికి విజేత ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోయింది. 


ట్రిపుల్‌ జంప్‌లో పాల్‌కు స్వర్ణం.. అబ్దుల్లాకు రజతం: పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో ఎల్డోస్‌ పాల్‌, అబ్దుల్లా అబూబాకర్‌ చరిత్ర సృష్టించారు. పాల్‌ స్వర్ణం, అబూబాకర్‌ రజత పతకంతో అరుదైన ఘనత సాధించారు. మూడో ప్రయత్నంలో 17.03 మీ. లంఘించిన పాల్‌ అగ్రస్థానంలో నిలిచాడు. పాల్‌ కేరళ సహచరుడు అబూబాకర్‌ తన ఐదో యత్నంలో 17.02 మీ. దూకి రెండోస్థానం కైవసం చేసుకున్నాడు. పెరించీఫ్‌ (బెర్ముడా) 16.92 మీ. దూరంతో కాంస్య పతకం గెలిచాడు. కామన్వెల్త్‌ క్రీడల ట్రిపుల్‌ జంప్‌లో ఇంతకుముందు భారత్‌ నాలుగు పతకాలు నెగ్గింది. కానీ మనోళ్లు ఇద్దరు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక..మొహిందర్‌ సింగ్‌ గిల్‌  కాంస్య (1970), రజతా(1974)లు, రెంజిత్‌ మహేశ్వరి (2010) అర్పిందర్‌ సింంగ్‌ (2014) కాంస్యాలు చేజిక్కించుకున్నారు. 


స్వర్ణ భవినా..: భారత స్టార్‌ పారా టీటీ క్రీడాకారిణి భవినా బెన్‌ పటేల్‌ కామన్వెల్త్‌లోనూ స్వర్ణంతో సత్తా నిరూపించుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్‌ 3-5 విభాగం ఫైనల్లో 35 ఏళ్ల భవినా 12-10, 11-2, 11-9తో క్రిస్టియానా ఇక్పోయి (నైజీరియా)ను ఓడించింది. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన భవినా..థాయ్‌లాండ్‌, ఏషియన్‌ పారా టీటీ టోర్నీలలోనూ రజత పతకాలతో అదరగొట్టింది. మహిళల సింగిల్స్‌ 3-5 కేటగిరీ కాంస్య పోరులో 34 ఏళ్ల సొనాల్‌బెన్‌ మనూభాయ్‌ పటేల్‌ 11-5, 11-2, 11-3తో స్యూ బయిలీ (ఇంగ్లండ్‌)పై నెగ్గి పతకం అందుకుంది. ఇక పురుషుల సింగిల్స్‌ 3-5 విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో రాజ్‌ అరవిందన్‌ 0-3తో ఇసావు (నైజీరియా)పై ఓడాడు. 



నీతు, పంగల్‌ ధనాధన్‌..: తమ జోరు కొనసాగిస్తూ బాక్సర్లు అమిత్‌ పంగల్‌, నీతూ ఘంగాస్‌ పసిడి పంచ్‌లతో మెరిశారు. పురుషుల 51కి. విభాగం ఫైనల్లో అమిత్‌ 5-0తో స్థానిక ఫేవరెట్‌ కియరన్‌ మక్‌డొనాల్డ్‌ (ఇంగ్లండ్‌)ను చిత్తు చేసి టైటిల్‌ దక్కించుకున్నాడు. గత గోల్డ్‌కోస్ట్‌ క్రీడల అంతిమ సమరంలో మక్‌డొనాల్డ్‌ చేతిలో పరాజయానికి పంగల్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు. మహిళల 48 కిలోల కేటగిరీలో 2019 ప్రపంచ చాంపియన్‌షి్‌ప కాంస్య పతక విజేత డెమీ జేడ్‌ రెస్టాన్‌ (ఇంగ్లండ్‌)కు నీతూ షాకిచ్చింది. తొలిసారి కామన్వెల్త్‌ బరిలో దిగిన 21 ఏళ్ల నీతూ ఫైనల్లో 5-0తో జేడ్‌పై ఘన విజయం సాధించి పసిడి పతకం సొంతం చేసుకుంది. 

Updated Date - 2022-08-08T06:34:05+05:30 IST