oscar: ‘గుజరాతీ’ చిత్రం ఛల్లో షో ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ అసంతృప్తి

ABN , First Publish Date - 2022-09-22T04:38:20+05:30 IST

‘గుజరాతీ’ చిత్రం "ఛల్లో షో" ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఛల్లో షో" వంటి చిత్రాలు దక్షిణాదిలో..

oscar: ‘గుజరాతీ’ చిత్రం ఛల్లో షో ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ అసంతృప్తి

హైదరాబాద్: ‘గుజరాతీ’ చిత్రం "ఛల్లో షో" ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఛల్లో షో" వంటి చిత్రాలు దక్షిణాదిలో చాలా వచ్చాయని ఆయన చెప్పారు. "ఛల్లో షో"ని ఏ కోణంలో నామినేట్ చేశారో తెలియడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. "ట్రిపుల్ ఆర్" చిత్రాన్ని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యం కలిగించిందని, "ట్రిపుల్ ఆర్"లో దేశభక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలున్నాయని శంకర్ వివరించారు. భారతీయ సినిమా ప్రతిష్టను చాటడానికి "ట్రిపుల్ ఆర్" చిత్ర బృందం ఎంతో కృషి చేసిందని ఎన్.శంకర్ చెప్పుకొచ్చారు.


నెల రోజులుగా సోషల్‌ మీడియాలో ఒకటే చర్చ జరిగింది. ఆస్కార్‌ అవార్డ్‌ ఈ సారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి వస్తుందా, లేకపోతే ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాకు వస్తుందా అని. ఈ రెండు సినిమాల్లో ఒకదానికే అవకాశం ఉండడంతో ‘మా చిత్రాన్నే పంపాలి’ అంటూ రెండు చిత్రాల అభిమానులు సోషల్‌ మీడియాలో పోటాపోటీగా పోస్టులు పెట్టారు. ఈ రెండు చిత్రాల్లో ఒకటి మన తెలుగు సినిమా, మరొకటి తెలుగు నిర్మాత తీసిన సినిమా కనుక రెండింటిలో దేనికి వచ్చినా మనకి గర్వకారణమే అనుకున్నారు చాలామంది. అయితే అందరి ఆశలను ఆవిరి చేస్తూ గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ (ఇంగ్లిషులో ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో)ను 95వ అకాడెమీ అవార్డులకు అఫీషియల్‌ ఎంట్రీగా నిర్ణయించి, మంగళవారం ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ జనరల్‌ సుప్రన్‌ సేన్‌ ప్రకటించారు.



సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌, పన్‌ నళిన్‌ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇంకా మనదేశంలో విడుదల కాలేదు. వచ్చే నెల 14న రిలీజ్‌ అవుతుంది.. అయితే గత ఏడాది త్రిబికా పిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమై ప్రశంసలతో పాటు అవార్డులూ అందుకొంది. సౌరాష్ట్రలోని ఓ మారు మూల పల్లెటూరిలో చిన్నతనం నుంచే సినిమా అంటే వ్యామోహం పెంచుకున్న ఓ తొమ్మిదేళ్ల కుర్రాడి కథ ఇది. ఆ కుర్రాడు మరెవరో కాదు దర్శకుడు పన్‌ నళినే! సినిమా చూడడానికి డబ్బులు లేక ఆపరేటర్‌కు లంచం ఇచ్చి ప్రొజెక్టర్‌ రూమ్‌లో కూర్చుని అక్కడి నుంచే సినిమాలన్నీ చూసిన తన చిన్ననాటి సంఘటనలకు దృశ్య రూపం కల్పించారు నళిన్‌. మనసుని తడి చేసే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి కాబట్టే ఆస్కార్‌కు ఎంట్రీగా ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ పేర్కొంది. 2023 మార్చి 12న ఆస్కార్‌ వేడుక జరుగుతుంది.

Updated Date - 2022-09-22T04:38:20+05:30 IST