ఇటలీ గ్యాలరీలో మనమ్మాయి పెయింటింగ్స్‌!

ABN , First Publish Date - 2021-04-22T05:30:00+05:30 IST

అమెరికాలో ఉంటున్న నల్గొండ వాసి, మాధురి శ్రీకాంత్‌ పెయింటింగ్స్‌ ఇటలీ, మిలాన్‌లోని ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శనకు ఎంపికైన సందర్భంగా నవ్య ఆమెను పలుకరించింది! ఆ విశేషాలు...

ఇటలీ గ్యాలరీలో మనమ్మాయి పెయింటింగ్స్‌!

ఆసక్తితో నేర్చుకున్న కళ అంతర్జాతీయ వేదికలకు ఎక్కడం ఓ అద్భుతం! ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రఖ్యాత ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ దృష్టిలో పడడం ఓ అదృష్టం! ఆ అదృష్టాన్ని దక్కించుకున్న ప్రవాస భారతీయురాలు మాధురి శ్రీకాంత్‌! అమెరికాలో ఉంటున్న నల్గొండ వాసి, మాధురి శ్రీకాంత్‌ పెయింటింగ్స్‌ ఇటలీ, మిలాన్‌లోని ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శనకు ఎంపికైన సందర్భంగా నవ్య ఆమెను పలుకరించింది! ఆ విశేషాలు....


ఇన్‌స్టాగ్రామ్‌లో పెయింటింగ్స్‌ పోస్ట్‌ చేస్తూ ఉండడమే తప్ప, ప్రత్యేకించి యాప్‌లో ఎక్కువ సమయం గడపను. ఓ రోజు ఇన్‌స్టాలో ఓ మెసేజ్‌ కనిపించింది. అది మూడు రోజుల క్రితమే వచ్చిన మెసేజ్‌. ఇటలీలోని, మిలాన్‌కు చెందిన మాడ్స్‌ గ్యాలరీలో నా పెయింటింగ్స్‌ ప్రదర్శించవలసిందిగా ఆహ్వానిస్తూ ఆర్ట్‌ క్యురేటర్‌ పంపిన మెసేజ్‌ అది. ఆ ఆర్ట్‌ గ్యాలరీ ఎంచుకున్న ‘రొమాంటికా’ థీమ్‌కు నా పెయింటింగ్స్‌ సూటవుతాయని, కాబట్టి వాటిని ప్రదర్శనకు పంపమనీ మెసేజ్‌ చేశారు. అయితే ఆ సందేశాన్ని ఎలా నమ్మను? సామాజిక మాధ్యమాల్లో నకిలీ అకౌంట్లు బోలెడు. కాబట్టి ఆ గ్యాలరీ గురించి ఇంటర్నెట్‌లో వెతికాను. నాకు మెసేజ్‌ పంపిన వ్యక్తి వివరాలు, ఫొటోతో సహా ఆ గ్యాలరీలో కనిపించాయి. దాన్ని బట్టి అది నకిలీ అకౌంట్‌ నుంచి వచ్చినది కాదని నిర్థారించుకున్నాను. చాలా సంతోషపడ్డాను. ఇలాంటి అవకాశం వెతుక్కుంటూ రావడం ఆశ్చర్యం కూడా కలిగించింది. ఆ తర్వాత వాళ్లు ఎంపిక చేసిన నా మూడు పెయింటింగ్స్‌ను డిజిటల్‌ ఫార్మాట్‌కు మార్చి పంపించాను. అవి ఏప్రిల్‌ 23 నుంచి మే 3 వరకూ ఆ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శింపబడతాయి. 


ఆ మూడు పెయింటింగ్స్‌!

గ్యాలరీలో ప్రదర్శనకు ఎంపికైన నా మూడు పెయింటింగ్స్‌లో ఒకటి బుద్ధుడిది. మిగతా రెండూ తంజావూర్‌ పెయింటింగ్స్‌. బుద్ధుడి పెయింటింగ్‌ కోసం పాళి భాష గురించి పరిశోధించి, ఆ భాషలోని మంత్రాలను కూడా పెయింట్‌ చేశాను. తంజావూర్‌ పెయింటింగ్స్‌ ఎంతో కష్టపడి నేర్చుకున్నాను. ఇవి రెండూ భారతీయత ఉట్టిపడేలా ఉంటాయి. బుద్ధుడి పెయింటింగ్‌ క్లే బోర్డు మీద ఆక్రిలిక్స్‌తో వేశాను. గోల్డెన్‌ గీషా, షాడో స్వే అనేవి తంజావూర్‌ పెయింటింగ్స్‌. వీటిలో ఒకటి 22 క్యారట్ల బంగారంతో, సెమి ప్రెషియస్‌ స్టోన్స్‌తో పోస్టర్‌ కలర్స్‌ ఉపయోగించి తయారు చేశాను. రెండో దాన్లో స్వరోస్కీ క్రిస్టల్స్‌ కూడా వాడాను. 




నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడమంటే ఇష్టం. ఇంటి ముందు అమ్మ, అక్కలు వేసే రంగురంగుల ముగ్గులు గమనించే క్రమంలోనే బొమ్మలు గీయాలనే ఆసక్తి నాలో పెరిగిందనిపిస్తుంది. చిన్నతనంలో స్కూల్లో పెయింటింగ్‌లో నేనే ఫస్ట్‌. పోటీల్లో బహుమతులు కూడా గెలుచుకునేదాన్ని. చదువులోనూ ముందంజలో ఉండేదాన్ని. అలా చదువు, చిత్రలేఖనం సమాంతరంగా సాగాయి. నల్గొండలో పుట్టి, పెరిగాను. స్కూలు చదువంతా అక్కడే సాగింది. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత పెళ్లైంది. ఆయనకు అమెరికాలో ఉద్యోగం. అలా 2005లో అమెరికాలోని, నార్త్‌ కారొలినాకు వచ్చి, బ్యాంకింగ్‌ రంగంలో స్థిరపడ్డాను. తీరిక వేళల్లో కాదు, బొమ్మలు గీయడం కోసం తీరిక చేసుకుంటాను. ఎన్ని పనులున్నా చిత్రలేఖనం మానుకోను.


పెయింటింగ్‌ కొనసాగిస్తాను!

ఇప్పటివరకూ సుమారు 120 పెయింటింగ్స్‌ వేశాను. తంజావూర్‌, మధుబని, మ్యూరల్స్‌, వర్లి, టెక్స్‌చర్‌ పెయింటింగ్స్‌, ఆయిల్‌ పెయింటింగ్స్‌... ఇలా వేర్వేరు మాధ్యమాలను వాడుతూ ఉంటాను. అన్నింట్లో నాకు తంజావూర్‌ పెయింటింగ్స్‌ వేయడం ఇష్టం. ఏ కొంత ఖాళీ సమయం దొరికినా బొమ్మలు గీయడానికి కేటాయిస్తూ ఉంటాను. ఈ విషయంలో నా కుటుంబం తోడ్పాటు ఉంది. బొమ్మలు గీసే సమయంలో మా వారు శ్రీకాంత్‌, ఇద్దరు పిల్లలు నన్ను ఏమాత్రం డిస్టర్బ్‌ చేయరు. హైదరాబాద్‌లో ఉంటున్న అమ్మానాన్నల తోడ్పాటు, ప్రోత్సాహం కూడా నాకెప్పటికీ ఉంటుంది. 





- గోగుమళ్ల కవిత

Updated Date - 2021-04-22T05:30:00+05:30 IST