అమెరికా స్కూలులో తెలుగు నోటిఫికేషన్

ABN , First Publish Date - 2021-11-24T14:06:29+05:30 IST

ప్రకటనలు, ఉత్తరప్రత్యుత్తరాలూ అన్నీ తెలుగులోనే జరగాలని ఇక్కడ మన తెలుగు అధికార భాషా సంఘాలు మొత్తుకుంటుంటాయి. చెవిటివాడి ముందు శంఖం వూదినట్టు అవేమీ అమలు కావు.

అమెరికా స్కూలులో తెలుగు నోటిఫికేషన్

న్యూజెర్సీ: ప్రకటనలు, ఉత్తరప్రత్యుత్తరాలూ అన్నీ తెలుగులోనే జరగాలని ఇక్కడ మన తెలుగు అధికార భాషా సంఘాలు మొత్తుకుంటుంటాయి. చెవిటివాడి ముందు శంఖం వూదినట్టు అవేమీ అమలు కావు. కానీ, ఎక్కడో అమెరికాలో న్యూజెర్సీలోని ఒకానొక కౌంటీలోని లారెన్స్ టౌన్షిప్ బడిలో తెలుగు ప్రకటన కనిపించడం విశేషం. అక్కడ లారెన్స్ హైస్కూల్లో ఇద్దరు విద్యార్థులకి, లారెన్స్ ఇంటర్మీడియెట్ స్కూల్లో ముగ్గురికి, స్లాక్ వుడ్ ఎలిమెంటరీ స్కూల్లో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ అని తేలడం వల్ల తల్లిదండ్రులని అప్రమత్తం చేస్తూ స్కూలు యాజమాన్యం ఆ ప్రకటన జారీ చేసింది. బడిలో ఉండే నర్సులు, లారెన్స్ టౌన్షిప్ వైద్యాధికారి, ఇంకా కొందరు సహాయకులతో కలిసి తగిన వైద్యసేవలు అందిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. క్వారంటైన్, వాక్సినేషన్ వంటి పదాలకి కూడా ఆ నోటీసులో తెలుగు పదాలు ఉపయోగించారు. 


లారెన్స్ టౌన్షిప్‌లో ప్రీ కిండర్ గార్డెన్, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూలు స్థాయి పబ్లిక్ స్కూళ్లు మొత్తం ఏడు ఉన్నాయి. ఆ స్కూళ్లలో మైనారిటీ విద్యార్థులు 57 శాతం మంది ఉన్నారు. అది న్యూజెర్సీ పబ్లిక్ స్కూలులో మైనారిటీ విద్యార్థుల శాతం కంటే ఎక్కువ. మైనారిటీల్లో ఎక్కువగా ఆసియన్, స్పానిష్ పిల్లలు ఉన్నారు. ఆసియా మూలాలున్న పిల్లల్లో భారతీయ సంతతికి చెందిన వారు, అందునా మన తెలుగు వారి పిల్లలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. వారి కోసం పాఠశాల యాజమాన్యం తెలుగులో కోవిడ్ నోటిఫికేషన్ వెలువరించింది. ఇక అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలలో తెలుగు జనాభా గణనీయంగానే ఉంటుందనే విషయం తెలిసిందే.

Updated Date - 2021-11-24T14:06:29+05:30 IST