అంతర్జాతీయ అంతర్జాల పద్యాల పోటీలో మెరిసిన చిన్నారి- అద్దంకి వనీజ

ABN , First Publish Date - 2021-05-23T18:27:48+05:30 IST

మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ.. అంటూ గుక్కతిప్పుకోకుండా ఒక చిన్నారి 5 నిముషాలపాటు చదివిన పోతన భాగవతం-గజేంద్రమోక్షంలోని పద్యమొకటి ఇటీవల సామాజిక మాధ్యమాలన్నింటిలోనూ

అంతర్జాతీయ అంతర్జాల పద్యాల పోటీలో మెరిసిన చిన్నారి- అద్దంకి వనీజ

మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ.. అంటూ గుక్కతిప్పుకోకుండా ఒక చిన్నారి 5 నిముషాలపాటు చదివిన పోతన భాగవతం-గజేంద్రమోక్షంలోని పద్యమొకటి ఇటీవల సామాజిక మాధ్యమాలన్నింటిలోనూ అత్యంత ఆదరణ పొందింది. వాట్సాప్‌లో అనేకసార్లు షేర్ చేసిన వీడియోగానూ గుర్తింపు పొందింది. ఆ పద్యం చదివిన చిన్నారి ఎవరో కాదు. అద్దంకి వనీజ. తను ఇప్పుడు అంతర్జాతీయ అంతర్జాల పద్యపఠనపు పోటీలలో ప్రథమ బహుమతిని పొందింది. 29 దేశాలనుంచి దాదాపు 1400 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలలో రావూరి విభాగం నుంచి వనీజ ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది.  


‘తేజో మయం - తెలుగు పద్యం’ అనే శీర్షికతో తెలుగు పద్యాల ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో  3 ఏళ్ల నుంచి 90 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా పాల్గొన్నారు. వీరిని 3 భాగాలుగా విభజించి, ఒక్కో విభాగానికి ఒక్కో మహాకవి పేరు పెట్టారు. రావూరి భరద్వాజ, సినారె, విశ్వనాథ  అనే విభాగాలుగా నామకరణం చేసి పద్యాల పోటీని నిర్వహించారు. కేవలం పద్యాలు చెప్పడమే కాకుండా భావం, సందర్భమూ కూడా చెప్పడం ఇందులోని విశేషం.  


ఈ పోటీలను బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ స్థాపించిన ప్రణవపీఠం అలాగే వెంపరాల శ్రీనివాసమూర్తి (న్యూఢిల్లీ)  స్థాపించిన వాగ్దేవి కళాపీఠం సంయుక్తంగా నిర్వహించాయి. రెండు ఆవృత్తాలుగా జరిగిన ఈ పోటీలు గత నెల ఏప్రిల్ 24 న ప్రారంభమై మే 3వ తేదీ వరకూ జరిగాయి. ఆ పోటీలకు సంబంధించిన ఫలితాలను శనివారం అంతర్జాలంలో జరిగిన సమాపనోత్సవంలో ప్రకటించారు. పెద్దలు మండలి బుద్ధప్రసాద్, జయప్రకాష్ నారాయణ, డా. రమణాచారి,   తెలుగు వన్ . కామ్ అధినేత కంఠమనేని రవిశంకర్ తదితరులు అతిథులుగా విచ్చేసి ఫలితాలను ప్రకటించారు. 




ఘట్టిబాలచైతన్యం అధినేత ఘట్టి కృష్ణమూర్తి, మరింగంటి కులశేఖరాళ్వార్లు,  డాక్టర్ గన్నమరాజు గిరిజామనోహర్ బాబు, చిమ్మపూడి శ్రీరామమూర్తి మొదలైన సాహిత్యవేత్తలు పాల్గొన్నారు. గత సంవత్సరంలోనూ వాగ్దేవి కళాపీఠం నిర్వహించిన పద్యానికి పట్టాభిషేకం అనే పద్య పఠనపు పోటీలలో ప్రథమబహుమతిని పొందిన అద్దంకి వనీజ అంబర్ పేటలోని సత్యశాయి విద్యావిహార్‌లో 4వ తరగతి చదువుతోంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు, చలనచిత్ర నేపథ్యగాయకుడు అయిన నేమాని పార్థసారథి శిష్యురాలు. వారివద్ద శాస్త్రీయసంగీతం, పోతన భాగవతం పద్యాలు నేర్చుకుంటోంది. కొమాండూరి రామాచారి వద్ద లలితసంగీతం నేర్చుకుంటోంది. ఘట్టి బాలచైతన్యంలో తెలుగు సాహిత్యంలోని పద్యాలను నేర్చుకుంటున్న వనీజను గురువులందరూ ఆశీర్వదించారు.

Updated Date - 2021-05-23T18:27:48+05:30 IST