తెలుగా, సంస్కృతమా...?

ABN , First Publish Date - 2022-06-22T10:33:24+05:30 IST

ప్రజలకు, ప్రభుత్వానికి భాషా దృక్పథం ఉండాలి. లేకపోతే పాలన ప్రజల భాషలో కాకుండా ఇతర భాషల్లో సాగి క్రమంగా ప్రభుత్వాలు ప్రజా హృదయాలకు దూరం జరుగుతాయి....

తెలుగా, సంస్కృతమా...?

ప్రజలకు, ప్రభుత్వానికి భాషా దృక్పథం ఉండాలి. లేకపోతే పాలన ప్రజల భాషలో కాకుండా ఇతర భాషల్లో సాగి క్రమంగా ప్రభుత్వాలు ప్రజా హృదయాలకు దూరం జరుగుతాయి. తెలంగాణలో ఈ గందరగోళం మొదటి నుంచీ ఉంది. కొన్ని శతాబ్దాలపాటు ఉర్దూ అధికార భాషగా ఉండేది. దాని తరువాత పేరుకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డా, పాలనంతా ఆంగ్లంలోనే సాగుతుంది. మధ్యలో కొన్నేండ్లు తెలుగును అధికార భాషగా నిలబెట్టాలని నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తెలుగు టైప్‌ రైటర్లు ఇచ్చి, ఉద్యోగులకు నిఘంటువులిచ్చి, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి తెలుగులో తర్ఫీదు ఇచ్చారు. ఇది కొన్నాళ్ళే సాగి తరువాత మళ్లీ ఆంగ్లంలోనే రాతకోతలన్నీ సాగటం మొదలైంది. దీని వలన ఎంతో భాషా నష్టం జరుగుతూ వస్తోంది.


తెలుగు భాషా దీపం ఆరిపోకుండా ఉండాలంటే కనీసం ప్రాథమికోన్నత స్థాయి వరకైనా తెలుగు మాధ్యమంలోనే చదవాలనే నిబంధన రావాలి. అంతేగాక ఇంటర్మీడియెట్‌, డిగ్రీ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ఎంచుకునే అవకాశాన్ని రద్దు చేయాలి. విద్యార్థులందరూ విధిగా తెలుగునే చదివి తీరాలనే నిబంధన పెట్టాలి. ఇది సంస్కృతాన్ని కాని ద్వితీయ భాషగా అభ్యసిస్తున్న ఇతర భాషలనుగాని అవమానించడం ఎంత మాత్రం కాదు. ఆ భాషలను ఇష్టపడే విద్యార్థులు ఆ భాషల మాధ్యమ పాఠశాలల్లోనే చేరుతారు. సంస్కృతాన్ని నేర్చుకోవాలనుకునే వారు ప్రత్యేక సంస్కృత పాఠశాలల్లో చేరుతారు. వేద పాఠశాలల్లో చేరి ఈ భాషలో లోతైన పరిజ్ఞానాన్ని సంపాదిస్తారు. సంస్కృతాన్ని తెలుగు, హిందీ, ఆంగ్ల లిపుల్లో రాయడాన్ని కూడా రద్దు చేయాలి. ఇలాంటి వెసులుబాటు కల్పిస్తున్నామంటే సంస్కృతం గౌరవాన్ని, స్థాయిని అవమానించడమే. నిజంగా సంస్కృతం మీద అభిమానం, ఆసక్తి ఉన్న విద్యార్థులు సంస్కృతాన్ని దేవనాగరి లిపిలోనే చదవాలి, రాయాలి. ఇంటర్మీడియెట్‌లో రెండేళ్లు, డిగ్రీలో మూడేళ్లు మొత్తం అయిదేళ్లపాటు సంస్కృతాన్ని అధ్యయనం చేసిన విద్యార్థి ఆ భాషలో తప్పు లేకుండా ఒక వాక్యం రాయగలడా? వ్యాకరణ దోషాలు లేకుండా అయిదు నిమిషాలు మాట్లాడగలడా? నూటికి 95శాతం విద్యార్థులు ఈ విధమైన రచన, భాషణ సామర్థ్యం లేనివారే. మార్కుల కోసం తప్ప మరెందుకు ఆ భాషను ప్రోత్సహించడం?


సంస్కృత భాష అభ్యసన స్థాయి ఈ విధంగా ఉంటే కొత్తగా 2022–2023 విద్యా సంవత్సరం నుంచి 150 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో తెలుగు స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెడుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే పరోక్షంగా ఆ కళాశాలల్లో తెలుగు భాషకు తిలోదకాలు ఇచ్చినట్లే. ఏ రాష్ట్రంలో మనుగడలో లేని భాషను మనమెందుకు బలవంతంగా విద్యార్థుల మీద రుద్దడం? రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత అధ్యాపకుల సంఖ్య అయిదు వందలకు మించదు. ఈ అయిదు వందల మంది నిరుద్యోగులవుతారనే చిన్న కారణంతో సంస్కృతాన్ని భరించడం ఎంత వరకు సబబు? నిజంగానే సంస్కృతాన్ని బోధించే అధ్యాపకులు తల్చుకుంటే తెలుగును బోధించలేరా? ఆలోచించాలి. మన పట్టుదల కోసం లేదా ప్రైవేటు కళాశాలల మార్కుల యావకు పోయి విద్యార్థులను ఇటు తెలుగు అటు సంస్కృతం రాని గందరగోళంలోకి నెట్టివేస్తున్నామా? ఇలాంటి సందిగ్ధ పరిస్థితి వల్లనే ‘రుధిరం’ వర్షానికి పర్యాయ పదంగా మారింది. ‘భానుడు ప్రతాపం చూపించడంతో హైదరాబాద్‌ రోడ్ల మీద ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది’ లాంటి పారడాక్సులు దొర్లిపోతున్నాయి.


మనం ఇప్పుడు సంస్కృతమా? తెలుగా? తేల్చుకోవాల్సిన సందర్భంలో ఉన్నాం. ‘గ్రాంథికమా? వ్యావహరికమా?’ అని ఆనాడు గిడుగు రామమూర్తి పంతులు ఉద్యమించినట్లుగా ‘తెలుగా? సంస్కృతమా?’ అని ఇప్పుడు మళ్ళీ ఉద్యమించాల్సిన దీన స్థితిలో ఉన్నాం. తెలుగును నిర్బంధంగా చదివేటట్లు ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం తీసుకోకపొతే భాషావారసులు తయారుకారు. అప్పుడు యునెస్కో చెప్పినట్లు 2050 నాటికి తెలుగు భాష కనుమరుగు కావడం ఖాయం.


తెలుగును ‘ద్వితీయ భాష’ అని పిలవడమే ఎంతో అసహ్యంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ద్వితీయ భాష కావడం ఏమిటి? ఎక్కడి నుంచో వచ్చిన ఆంగ్లం ప్రథమ భాష కావడం ఏమిటి? ఇది మనల్ని మనం అవమానించుకోవడం కాదా? ఈ తీరు మారాలి. జాతి జనులలో తెలుగు భాషా పునాదులు గట్టిగా పడాలంటే ప్రాథమిక పాఠశాలల్లోనే తెలుగు భాష ఉపాధ్యాయులను నియమించాలి. అలాగే భాషాభివృద్ధికి కృషి చేయడానికి తెలుగు భాషకు ఒక మంత్రిత్వశాఖను కేటాయించాలి. అధికార భాషా సంఘానికి కూడా హైకోర్టుకున్న అధికారాలను ఇవ్వాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగును అమలుపర్చకపొతే జరిమానాలు విధించే అధికారం, శిక్షలు వేసే అధికారం, ఉద్యోగులను సస్పెండ్‌ చేసే అధికారం అధికార భాషా సంఘానికి ఉండాలి. అప్పుడు కాని తెలుగు భాష అమలు సవ్యంగా సాగదు.


తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగానే ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు రెండేళ్లు, ఇంజనీరింగ్‌, ఎంబీబీఎస్‌, బిజినెస్ మేనేజ్‌మెంటు, కంప్యూటర్‌ సైన్సు ఇలా ఏ బ్రాంచిలో డిగ్రీ చేసే విద్యార్థులైనా మూడేళ్లు తెలుగును ఒక విషయంగా చదివి తీరాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తేగాని తెలుగు భాష బతికి బట్టకట్టలేదు. తద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు భాషా వికాసం కూడా కలుగుతుంది. అంతే కాదు ఏ రంగంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారైనా విద్యాభ్యాసం అనంతరం ప్రభుత్వాధికారులుగా, వివిధ వృత్తులను చేపట్టే వారిగా పని చేయాల్సింది ప్రజా క్షేత్రంలోనే. కాబట్టి ప్రజలు మాట్లాడే భాషపైన కొంతైనా అవగాహన ఉండి తీరాలి.


తెలుగు బాష ప్రమాదకర స్థితిలో ఉన్నదని ఇప్పటికే చాలా సంకేతాలు వస్తున్నాయి. దీనికి మంచి ఉదాహరణ ఇటీవల చాలా దిన, వార, పక్ష, మాస, ఆన్‌లైన్‌ తెలుగు పత్రికలెన్నో మూతపడటం. తెలుగు భాష రాని తరాలు మన కళ్లముందే కనిపించడం. చాలా ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో తెలుగుకు వివరణ ఆంగ్లంలో ఇస్తుండడం. తెలుగు భాష పట్ల నిర్లక్ష్య వైఖరి ఇలాగే కొనసాగితే రాబోయే దశాబ్దంలో తెలుగు పత్రికలు మొత్తానికే కనుమరుగవుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికైనా ఉన్నత విద్యామండలి, ప్రభుత్వం కలిసి ఇంటర్మీడియెట్ నుంచి డిగ్రీ దాకా (ఏ బ్రాంచి వారైనా) ప్రతి విద్యార్థి తప్పని సరిగా తెలుగును అభ్యసించేలా చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఇంటర్‌ మీడియెట్‌, డిగ్రీ చదువుతున్నట్లయితే వారు కూడా కచ్చితంగా తెలుగును చదవాల్సిందే అనే నిబంధన తీసుకురావాలి. సంస్కృతం, హిందీ, ఫ్రెంచ్‌ ఇంకా ఏ భాషైనా కాని వాటిని ఆప్షనల్‌ కింద అభ్యసించే వీలు కల్పించాలి. అంతేకాని తెలుగు స్థానంలో అభ్యసించడాన్ని రద్దు చేయాలి. తెలుగు నిలవాలి, తెలుగు వెలగాలి. 

డా. వెల్దండి శ్రీధర్‌

తెలుగు అధ్యాపకులు, 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజ్వేల్‌

Updated Date - 2022-06-22T10:33:24+05:30 IST