
వచ్చే 28న అమెరికాలో 40 నగరాల్లో తేదేపా వేడుకలు
(న్యూయార్క్ నుండి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి): కోవిడ్ మూలంగా గత మూడు సంవత్సరాల నుండి అమెరికాలో నిలిచిపోయిన తెలుగు సంఘాల కార్యకలాపాలు తిరిగి పునరుత్తేజంతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని తెలుగు సంఘాలు రెట్టించిన ఉత్సాహంతో ఉత్సవాలు, మహాసభలు, ఉగాది వేడుకలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రవాస తెలుగు వారు పెద్ద సంఖ్యలో హాజరవుతుండడం విశేషం. అమెరికాలో పెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) వచ్చే జులై 1, 2, 3 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో 17వ మహా సభలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఆటా అధ్యక్షుడు భువనేష్ భుజాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాల నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులను సమీకరించారు.
'తానా'లో రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు
అమెరికాలో పెద్ద తెలుగు సంఘంగా పేరొందిన ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(తానా) సభ్యత్వ నమోదులో రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. తానా ఏర్పడి 45ఏళ్లు గడుస్తున్నా.. కొన్ని నెలల క్రితం వరకు ఆ సంస్థలో కేవలం 36వేల మంది సభ్యులు మాత్రమే ఉండేవారు. ఇటీవల తానాలో నూతనంగా సభ్యులను చేర్చుకునే కార్యక్రమం నిర్వహించారు. దాంతో కొద్ది నెలల వ్యవధిలోనే అమెరికా నలు మూలల నుండి మరో 35వే మంది కొత్తగా సభ్యత్వం తీసుకున్నారు. ప్రస్తుతం తానా సభ్యుల సంఖ్య రికార్డు స్థాయిలో 70వేలు దాటిపోయింది.
అమెరికా అంతటా తేదేపా ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే 28వ తేదీన అమెరికాలోని ఎన్నారై టీడీపీ విభాగం ఆధ్వర్యంలో 40 నగరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే వచ్చే మే నెల చివరి వారంలో అమెరికాలో పెద్ద ఎత్తున మహానాడు వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
వివిధ తెలుగు సంఘాల వార్షిక వేడుకలకు సన్నాహాలు
అమెరికాలో ఉన్న పలు ప్రముఖ తెలుగు సంఘాలు వార్షిక మహా సభల కోసం సన్నద్ధమవుతున్నాయి. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో వచ్చే 26తేదీ డల్లాస్ నగరంలో మహా సభలు నిర్వహిస్తున్నారు. తెలంగాణా తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో మే 27వ తేదీ నుండి మూడు రోజుల పాటు న్యూజెర్సీలో మహా సభలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరో తెలుగు సంస్థ నాటా(ఎన్ఏటీఏ) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నూతన భవన నిర్మాణం కోసం నిధులు సేకరిస్తున్నారు.
ఉగాది వేడుకలకు భారీ ఏర్పాట్లు
వచ్చే ఏప్రిల్ 2వ తేదీన ఉగాది వేడుకలను నిర్వహించడానికి దాదాపు అన్ని తెలుగు సంఘాలు పెద్ద ఎత్తున సన్నాహాలు చేసుకొంటున్నాయి. సిలికానాంధ్రా ఆధ్వర్యంలో ఉగాది వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించిన హిందూ దేవాలయాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఇప్పటి నుండి ఏర్పాట్లు చేసుకొంటున్నారు. అమెరికాలో ఉన్న లక్షలాది మంది ప్రవాస తెలుగు వారు నూతన ఉత్సాహంతో తెలుగు సంఘాల వేడుకలకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. -కిలారు ముద్దుకృష్ణ

ఇవి కూడా చదవండి