తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త ఎత్తు.. హాట్ టాపిక్‎గా మారిన రాజకీయాలు..అసలేం జరుగుతోంది..?

ABN , First Publish Date - 2022-06-04T18:07:51+05:30 IST

ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ముందస్తు సంకేతాలతో రాజకీయపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఏపీలో 2019 ఎన్నికల వేళ పార్టీలన్నీ...

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త ఎత్తు.. హాట్ టాపిక్‎గా మారిన రాజకీయాలు..అసలేం జరుగుతోంది..?

హస్తినలో జరిగిన ఆ కీలక నేతల భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఏపీ , తెలంగాణా రాజకీయాలకు మధ్య ఉన్న లింకు పై ఈ నేతల భేటీలో సాగిన చర్చ... ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనుందా? ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాల్సిందేనని.. ఆ నేతల సమావేశంలో ప్రాథమిక నిర్ణయానికి వచ్చారా?  తెలంగాణా బీజేపీ కీలక నేల నుంచి కూడా హైకమాండ్‌కు వెళ్లిన నివేదికలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారా? అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..


హీటెక్కిన ఏపీ రాజకీయాలు..

ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ముందస్తు సంకేతాలతో రాజకీయపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఏపీలో 2019 ఎన్నికల వేళ పార్టీలన్నీ ఒంటరిగానే పోటీ చేశాయి. తరువాత కొంతకాలం అసలు పొత్తుల కథే తెరపైకి రాలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన మధ్య అనధికార పొత్తులు నడిచాయి.  ప్రస్తుతం జనసేన, బీజేపీ పొత్తు కొనసాగుతోంది. ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు పొత్తుపొడుపులకు కేంద్రబిందువుగా మారాయి. ఇక అప్పటి నుంచి తెలుగుదేశం,జనసేన కలుస్తాయని, పవన్‌ చంద్రబాబు దత్తపుత్రుడని అధికార వైసీపీ ఊదరగొడుతోంది. 


వాడీవేడీ పెంచిన టీడీపీ, జనసేన విమర్శలు

మరోపక్క ఏపీలో వైసీపీ సహా టీడీపీ, జనసేన పొలిటికల్‌గా యాక్టివ్‌ అయిపోయాయి. అధికారపక్షంపై టీడీపీ, జనసేన విమర్శల వాడీవేడీ పెంచాయి.  ఇక బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పొత్తు జనసేనతోనేనని తేల్చి చెప్పారు. కానీ ఆ పార్టీ రాజ్యసభసభ్యుడు సీఎం రమేష్‌మాత్రం పొత్తులు నిర్ణయించాల్సింది హైకమాండ్‌ అని వివరణ ఇచ్చారు. ఏపీలో పొలిటికల్‌ సినారియో ఇలా ఉండగా దేశరాజధాని ఢిల్లీలో కమలనాథుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక నేత...... పార్టీ సంస్థాగత ఇన్‌చార్జ్‌ .... భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారుట. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోనూ ఈ బృందం భేటీ అయిందని సమాచారం. తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడానికి, ఏపీలో పొత్తులకు లంకె ఉందని ఈ భేటీలో ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. 


టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయాలని బీజేపీ చేస్తారని టాక్

ఏపీలో తెలుగుదేశం, జనసేనతో కలిసి పోటీ చేయాలని బీజేపీ అగ్రనేతలు భావించారుట.  తెలంగాణలో పాగా వేయాలంటే ఏపీ రాజకీయాల్లో వ్యూహాత్మాకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ సమావేశం నొక్కి చెప్పిందిట.  పొత్తులవలన ఏపీలో బీజేపీకి నాలుగైదు సీట్లు వచ్చినప్పటికీ, దీని ప్రభావం తెలంగాణపై గట్టిగా ఉంటుందని అంచనాకు వచ్చారుట. ఏపీలో తెలుగుదేశంతో పొత్తు వలన  హైదరాబాద్, సికింద్రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని  ఆంధ్రా సెటిలర్స్‌ బీజేపీ వైపు మొగ్గుచూపచ్చనే విశ్లేషణ చేశారుట.  అలాగే జనసేనతో పొత్తు  కారణంగా తెలంగాణాలోని  పవన్‌ అభిమానులు కూడా బీజేపీ వెంట నడుస్తారనే విశ్లేషణ చేశారు. 


టీడీపీతో పొత్తు పై హస్తినలోని కమలనాధులు  పునరాలోచన

దీని వలన తెలంగాణ  త్రిముఖ పోటీలో బీజేపీకి  మూడు నుంచి ఐదు శాతం ఓటింగ్‌  షేర్‌  పెరుగుతుందనే అంచనా వేశారుట. తెలంగాణాలో ఇటీవల బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న అమిత్‌ షా పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారని చెబుతున్నారు. బండి సంజయ్‌ కూడా ఈ ప్రతిపాదనను బలపరిచారుట.  ఈ నేపథ్యంలోనే ఏపీలో రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పై హస్తినలోని కమలనాధులు  పునరాలోచనలో పడ్డారుట.  ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక నేతలు టీడీపీతో పొత్తుకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పినట్టు తెలిసింది. 


టీడీపీతో పొత్తుకు రాష్ట్ర బీజేపీ నేతల విముఖత

త్వరలోనే ఏపీలో పర్యటించబోతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ మేరకు రాష్ట్ర నేతలకు సంకేతాలు ఇస్తారని సమాచారం అందింది. బీజేపీలోని నలుగురైదుగురు రాష్ట్ర నేతలు టీడీపీతో పొత్తుకు విముఖత ప్రదర్శిస్తున్నఅంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చిందిట. అయితే  ఈ  అంశాన్ని లైట్‌ తీసుకోవాలని నిర్ణయించారుట..  టీడీపీతో పొత్తు లేకపోతే  పవన్‌ బీజేపీని వీడే ప్రమాదముందని భావిస్తున్నారుట.  అందుకే ఎట్టిపరిస్థితులలోనూ ఏపీలో తెలుగుదేశం, జనసేనలతో  కలిసి నడవాలని బీజేపీ డిసైడయినట్టు సమాచారం. 

Updated Date - 2022-06-04T18:07:51+05:30 IST