ఆపత్కాలం

ABN , First Publish Date - 2020-10-15T05:51:32+05:30 IST

ఇదిమరొక విపత్తు. అసలే కరోనా కోరల్లో విలవిలలాడుతుండగా, ఇది గోరుచుట్టుపై రోకటిపోటు. రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు అత్యధికం తడిసిముద్దవుతున్నాయి...

ఆపత్కాలం

ఇదిమరొక విపత్తు. అసలే కరోనా కోరల్లో విలవిలలాడుతుండగా, ఇది గోరుచుట్టుపై రోకటిపోటు. రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు అత్యధికం తడిసిముద్దవుతున్నాయి. మింటికీ మంటికీ ఏకధారగా వాన కురుస్తూనే ఉన్నది. ఇది ఆహ్లాదపు వానో, రుతుపవనపు వానో కాదు. ఉపద్రవపు వాన. సముద్రంలో గూడు కట్టుకుని వచ్చిన వాయుగుండం, కాకినాడ దగ్గర తీరం దాటింది. దాటక మునుపు, దాటుతున్నప్పుడు, దాటాకా కూడా బీభత్సమే. ధ్వంసం అయిన రహదారులు, నాశనం అయిన పంటలు, కూలిన చెట్లు, పొంగిన నదులు, వాగులు, కొట్టుకుపోయిన వాహనాలు, ఇళ్లలోకి నీళ్లు– వెరసి జనం కళ్లలో కన్నీరు. 


దీని కంటె ముందు కూడా వారం పదిరోజుల నుంచి తెలంగాణలో కాసేపు వాన, కాసేపు తెరిపి అన్న చందంగా ఉండింది. మొత్తంగా వర్షాకాలం అంతా కూడా ఈ సారి వరుణదేవుడు ఆశించిన దాని కంటె అదనంగా కరుణించాడని, చెరువులన్నీ నిండునీటితో కళకళలాడుతున్నాయని, జలపాతాలు ఉధృతంగా ఉన్నాయని, వాతావరణం చల్లగా ఉన్నదని అందరూ సంతోషించారు. కానీ, క్రమంగా వర్షం చిరాకు కలిగించే స్థాయికి చేరుకుంది. చినికి చినికి కుంభవృష్టి అయింది. నిలకడగా కురిసి కురిసి రోడ్లను కాల్వలు చేసింది, కాల్వలను ఉప్పొంగించింది, లోతట్టు ప్రజలను పరుగులు తీయించింది. ఇల్లంతా నీరై, కరెంటు లేక చీకటై, బయటకు వెళ్లలేని స్థితిలో బడుగుల, పేదల బతుకులు మరింతగా ఇబ్బందుల పాలయ్యాయి. తెలంగాణలో 3 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టమట. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా వాయుగుండం ప్రభావం కృష్ణాజిల్లా నుంచి ఎగువన విశాఖపట్నం దాకా కనిపించింది. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. తీరం దాటిన సమయంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు, నాలుగైదు మీటర్ల ఎత్తున ఎగిసిన అలలు భయాందోళనలు కలిగించాయి. ప్రవాహాలన్నీ పొంగి, ఏది పంటపొలమో, ఏది రహదారో, ఏది జలాశయమో తెలియని స్థితిలో ఎందరో జలదిగ్బంధం అయ్యారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో లక్షా పాతికవేల ఎకరాల్లో పంట నష్టమైందని అంటున్నారు.


హైదరాబాద్‌ది అయితే విషాదగాథ. పెద్ద వర్షంవచ్చినప్పుడల్లా రోడ్లు ప్రవాహమయమై పోయి, ట్రాఫిక్‌ గంటల తరబడి స్తంభించిపోవడం నగరవాసులకు అలవాటయిపోయింది. నగరప్రణాళికా రచనలో ఒక సమగ్ర దృష్టి, సమన్వయం లేకపోవడం వల్ల, వర్షపునీరు ప్రవహించడానికి ఏ మార్గమూ లేక ఇళ్లూ వాకిళ్లూ మునిగిపోవలసి వస్తున్నది. మంగళవారం నాడు కురిసిన వర్షాన్ని పెద్ద వర్షం అంటే సరిపోదు. 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షం వివిధ ప్రాంతాల్లో నమోదయింది. విరామం లేకుండా, కుండపోతగా కురిసిన వర్షం. నగరపు డ్రైనేజి మార్గాలు, నాలాలు, నదీమార్గం కూడా వరదనీటి ఉధృతికి సరిపోలేదు. ఇంత పెద్ద వానకు, ఇంత సేపు కురిసే వానకు ఎల్లప్పుడు సన్నద్ధంగా ఉండలేము కాబట్టి, ప్రభుత్వ యంత్రాంగం స్పందనను తప్పు పట్టలేము, ఎప్పుడైనా విధానరచనలో లోపం ఉండవచ్చును కానీ, విపత్తును క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే ఉద్యోగులలో నిబద్ధతారాహిత్యం ఉండదు. మంగళవారం–బుధవారం రాత్రి అంతా, అంతటి వర్షంలో, దారులు మూసుకుపోయిన సమయంలో కూడా, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడానికి సిబ్బంది చేసిన కృషి అభినందనీయం. అట్లాగే, రోడ్ల మీద నిలిచిన నీటిని, డ్రైనేజీదార్లలో ఏర్పడ్డ అవరోధాలను తొలగించడానికి నగరపాలక సంస్థ ఉద్యోగులు పడ్డ కష్టం కూడా సామాన్యమైనది కాదు. ఇంత పెద్ద వర్షం అనంతరం కూడా ప్రాణనష్టం తక్కువగానే ఉన్నదని, ఇతర ఇబ్బందులు కూడా పరిమితమేనని ప్రభుత్వం భావించవచ్చు. బీభత్సపు రాత్రి మాత్రమే పది మందికి పైగా మరణించారు. మరి కొంత మంది గల్లంతయ్యారు. మారుమూల నివాస ప్రాంతాల సమాచారం ఇంకా అందవలసి ఉన్నది. మరణాల సంఖ్య ఎంతైనా, మొత్తంగా నగరవాసులకు ఎదురైన దురవస్థ పెద్దది. పదేపదే ఇదే దుస్థితి ఎదురుకాకుండా ప్రభుత్వం ఒక శాశ్వత పరిష్కారం చూడాలి. త్వరలో జిహెచ్‌ఎంసికి ఎన్నికలు రాబోతున్నందున, దాన్నొక ఎన్నికల అంశంగా తీసుకోవలసిన బాధ్యత పాలక, ప్రతిపక్షాలది.


అటు ఆంధ్రలో బ్రిటిష్‌వారు నిర్మించిన బ్యారేజీలు, ఇటు తెలంగాణలో నైజాం హయాంలో కట్టిన జలాశయాలు– వరదల బీభత్సాన్ని నివారించే ఉద్దేశ్యంతో సంకల్పించినవి. వాటి ప్రకటిత లక్ష్యాలను అవి నెరవేర్చాయి. కానీ, స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు చేసిన నిర్మాణాలు బీభత్సాన్ని ఎదుర్కొనలేకపోతున్నాయి, కొన్ని సందర్భాలలో ఉపద్రవాలకు కారణమవుతున్నాయి. నగరాల చుట్టూ నిర్మిస్తున్న రింగురోడ్లు, సుదూర ప్రాంతాలకు వేస్తున్న ఎక్స్‌ప్రెస్‌ ఎలివేటెడ్‌ మార్గాలు నీటి సహజప్రవాహ మార్గాలను అడ్డుకుని కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. సముద్రతీర ప్రాంతాలలో అడపాదడపా తుఫాన్లు తప్పకపోవచ్చు. ఎంతో కొంత నష్టమూ అనివార్యం కావచ్చు. నష్టాన్ని కనిష్ఠం చేయడానికి మార్గాలు వెదకాలి. ప్రమాదహెచ్చరికలను సకాలంలో, ప్రభావశీలంగా ప్రసారం చేయడం, ప్రభుత్వయంత్రాంగం స్పందనవేగాన్ని మరింతగా పెంచడం, విపత్తుల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం వంటి మార్గాలను అనుసరించాలి. అత్యవసరమైతే తప్ప, బయట సంచరించవద్దని హైదరాబాద్‌లో అధికారులు ముందస్తు హెచ్చరిక జారీచేశారు కానీ, దాన్ని నగరవాసులు పూర్తి అర్థంలో స్వీకరించలేదు. అన్ని ప్రసార, సమాచార వేదికలపై, తగినంత ఊనికతో ఈ సందేశాలను అందించవలసి ఉన్నది. అందుబాటులో ఉన్న సాంకేతికతకు, ఆచరణలో అనుసరిస్తున్న పద్ధతులకు సమన్వయం లోపిస్తున్నది.


వర్షం శాంతించి, సాధ్యమైనంత వేగంగా తిరిగి సాధారణ జీవనం నెలకొనాలని, గండం గడచిన గడచిన వెంటనే మరచిపోకుండా, ప్రభుత్వాలు, విధానరచయితలు తప్పొప్పులను సమీక్షించుకుంటారని ఆశిద్దాం.

Updated Date - 2020-10-15T05:51:32+05:30 IST