తెలుగురాష్ట్రాలు కోర్టుకెక్కాలి..!

ABN , First Publish Date - 2021-07-20T08:39:07+05:30 IST

కృష్ణాజలాల జగడం అంతిమంగా ఎక్కడకు దారితీయనున్నది? ఆ నదీజలాల పంపకంపై ఉభయ తెలుగురాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదాలను పరిష్కరించే ప్రయత్నంలో...

తెలుగురాష్ట్రాలు కోర్టుకెక్కాలి..!

కృష్ణాజలాల జగడం అంతిమంగా ఎక్కడకు దారితీయనున్నది? ఆ నదీజలాల పంపకంపై ఉభయ తెలుగురాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదాలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఈ నెల 16న జారీ చేసిన నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు పెద్ద సమ్మెట పోటులా పరిణమించింది. ఇరువురూ రుసరుసలాడుతున్నారు. అయితే తాము కృష్ణా, గోదావరి బేసిన్‌లు రెండిటినీ కేంద్రప్రభుత్వానికి కోల్పోయామన్న సత్యాన్ని వారు గ్రహించే ఉంటారు. కేంద్రం ప్రత్యక్ష పర్యవేక్షణలో కృష్ణా, గోదావరి బోర్డులే ఆ రెండు బేసిన్‌ల సకల వ్యవహారాలను నిర్వహిస్తాయి. ఈ మేరకు కేంద్ర జల మంత్రిత్వశాఖ గత గురువారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్ 2021 అక్టోబర్ 14 నుంచి అమలులోకి రానున్నది. 


కొవిడ్ లాక్‌డౌన్ చికాకుల నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రులు ఇరువురూ ప్రజలను అలరించే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలని ఆరాటపడ్డారు. అందుకే కృష్ణాజలాలపై వారు తమ దృష్టిని కేంద్రీకరించారు. వాటిని మరింత ఎక్కువగా వినియోగించుకోవాలని ఎవరికివారు నిశ్చయించుకున్నారు. అసలు నదిలో పుష్కలంగా నీరు ఉంటే గదా ఎక్కువో, మరీ ఎక్కువో ఉపయోగించుకోవడానికి?! సరిపడా నీరు లేకపోవడమే సమస్య. ఇది సంఘర్షణకు దారితీసింది. నిజానికి నదీజలాలపై తగాదా పడిన తొలి రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానేకావు. అయితే ఈ పోరులో ఉభయ భ్రష్టత్వం పాలయింది నిశ్చితంగా ఉభయ తెలుగు రాష్ట్రాలే. 


పరీవాహప్రాంత రాష్ట్రాలకు నదీజలాల పంపకాలు చేసే వ్యవస్థలు నీటి కేటాయింపులకు కాలం చెల్లిన, అశాస్త్రీయ భావనలను అనుసరించడం వల్లే ఘర్షణలు తలెత్తుతున్నాయి. వాతావరణ పరివర్తనశీలతను పరిగణనలోకి తీసుకోకపోవడం దీనికి మరొక కారణం. నదిలో నీటి పరిమాణం ప్రతి సంవత్సరమూ ఒకే విధంగా ఉండదు. ఆ మాటకొస్తే ఒకే సంవత్సరంలో వివిధ ఋతువులలో విభిన్న పరిమాణాలలో ఉంటుంది. ఈ మార్పులను పరిగణనలోకి తీసుకోకుండా కేటాయింపులు జరపడం వల్ల, వర్షపాతం తక్కువగా ఉన్న సంవత్సరంలో వివాదాలు అనివార్యమవుతున్నాయి. కేటాయింపులను అమలుపరిచే యంత్రాంగమేదీ లేకపోవడం మరో ముఖ్య కారణం. అలాగే ఒక రాష్ట్రం పరిధిలో ఒక నదీ జలాలను అదే రాష్ట్రంలోని మరో నదీ పరీవాహక ప్రాంతానికి బదిలీ చేసే విషయంలో మార్గదర్శక సూత్రాలు లేకపోవడం కూడా వివాదాలకు దారితీస్తోంది. నదీ జలాలను పొదుపుగా, గరిష్ఠస్థాయిలో ప్రయోజనకరంగా ఉపయోగించుకునేందుకు ప్రోత్సాహకాలు లేకపోవడం కూడా ఒక కారణమే. అందుబాటులో ఉన్న నదీజలాలను పంచడం కాకుండా, వాటివల్ల సమకూరే ప్రయోజనాలను పంచేందుకు ఉద్దేశించిన వ్యవస్థలు ఏవీ లేవు. కృష్ణానదీజలాల విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ప్రస్తుత వివాదానికి ఈ అంశాలన్నీ దోహదం చేస్తున్నాయి. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ‘కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ -2 (కెడబ్ల్యుడిటి-2) అవిభక్త రాష్ట్రానికి 1005 టిఎంసీల నీటిని కేటాయించింది. ఈ కేటాయింపును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు పంచుకోవాలి. కృష్ణా పరీవాహ ప్రాంతంలో 62 శాతం తెలంగాణలో, 32 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఈ మేరకు, ఉమ్మడి కేటాయింపును తెలంగాణ, ఆంధ్రలకు పంచే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే వివిధ చారిత్రక, సంక్లిష్ట కారణాల వల్ల పంపకాలపై ఏకాభిప్రాయం కొరవడింది. ప్రస్తుత వివాదానికి ఇదే మూలం. విడివిడి రాష్ట్రాలుగా ఆవిర్భవించిన ఏడు సంవత్సరాల తరువాత కూడా కృష్ణానదీజలాల్లో తమ వాటా ఎంత అనే విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు స్పష్టత లేదు!


కృష్ణాజలాల వివాదాన్ని కేంద్రప్రభుత్వ నోటిఫికేషన్ పరిష్కరించగలదా? అంటే పరిష్కరించగలదు, పరిష్కరించలేదు అనేదే సమాధానం. ఆ నోటిఫికేషన్ లోని అంశాలను నిశితంగా పరిశీలిస్తే కృష్ణా, గోదావరి ఆయకట్టులు, ఆ నదులపై నిర్మించిన, నిర్మిస్తున్న, నిర్మించబోయే ప్రాజెక్టులు అన్నీ కేంద్రప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలోకి వెళతాయి! ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన ఒక్క వ్యక్తికి కూడా విధాన నిర్ణయాలలో భాగస్వామ్యం ఉండబోదు. కృష్ణాజలాలపై మరింత నియంత్రణకు ఘర్షణ పడ్డ ముఖ్యమంత్రులిరువురూ కృష్ణా బేసిన్ పైనే కాకుండా గోదావరి బేసిన్‌పై కూడా నియంత్రణను కోల్పోయారు. ఈ పరిణామం ఎవరికి మేలు? ఎవరికి హాని? ఎవరి గురించి అడుగుతున్నామనే దానిపై ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంది. రైతులకు మేలూ జరగదు, హానీ జరగకపోవచ్చు. అయితే జలాశయాల నుంచి నీటి విడుదల విషయంలో రైతులకు తప్పక ఒక భరోసా ఏర్పడుతుంది. 


ఏమైనా ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి ఉభయ తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలదే బాధ్యత. ఇంత జరిగాక ఉభయ ముఖ్యమంత్రులు చేయగలిగిందేమీ లేదు, ఫిర్యాదు చేయడం మినహా. ఇరువురూ విశాలదృష్టితో కాకుండా సంకుచిత వైఖరితో వ్యవహరించడం వల్లే ఈ నష్టం వాటిల్లింది. నదీజలాలను రాష్ట్రాల జాబితా నుంచి తొలగించి తన జాబితాలో చేర్చే విషయంలో కేంద్ర  ప్రభుత్వానికి ఒక పెద్ద ఎజెండా ఉంది. రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలోని 17వ అంశమైన నీరు (మంచినీటి సరఫరా, పంట కాలువలు, మురుగునీటి పారుదల, నీటిని నిల్వ చేయుట, జల విద్యుత్ ప్రాజెక్టులు)ను కేంద్ర జాబితాలో చేర్చడమే ఆ ఎజెండా. కృష్ణాజలాల వివాదం ఆ ఎజెండాను ముందుకు తీసుకువెళ్ళేందుకు ఒక అవకాశాన్ని కల్పించింది. విద్యుత్ పంపిణీ, ధర నిర్ణయం మొదలైన అంశాలపై విద్యుదుత్పత్తి కంపెనీలకు పూర్తినియంత్రణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ఒక కొత్త విద్యుత్ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఆమోదించే అవకాశముంది. అదే జరిగితే రాబోయే సంవత్సరాలలో విద్యుత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి పాత్ర ఉండబోదు. కేంద్రం నోటిఫికేషన్ పర్యవసానాలు బహుముఖంగా ఉండవచ్చు. ఇవి కేవలం ఉభయ తెలుగురాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉండడం ఖాయం. 


ఇప్పుడు తెలుగు రాష్ట్రాల కర్తవ్యమేమిటి? విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా వ్యవహరించాలి. వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలో, సాగునీటి ప్రాజెక్టులను ఎలా నిర్వహించుకోవాలో నిర్ణయించుకోవాలి. దీనిపై పరస్పరం ఒక అంగీకారానికి రావాలి. ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొని దాన్ని సంయుక్తంగా సుప్రీంకోర్టుకు నివేదించాలి. తద్వారా మాత్రమే ప్రస్తుత సంక్లిష్ట , శోచనీయ పరిస్థితి నుంచి బయటపడడం సాధ్యమవుతుంది. మరి ఉభయరాష్ట్రాలూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అక్టోబర్ 14లోగా సవాలు చేయగలవా? ఇదే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజాలు అడగవలసిన ప్రశ్న. అవి అడగవనేది స్పష్టం. కనుక నదీజలాల విషయంలో కొత్త వాస్తవికతకు ప్రభుత్వాలు, పౌర సమాజాలు అన్నివిధాల సిద్ధమై ఉండడం మేలు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని మన పెద్దలు ఊరికే అన్నారా? 

బిక్షం గుజ్జా (జలవిధాన నిపుణుడు)

కె. శివకుమార్ (భారత అణుశక్తి విభాగ మాజీ ఉద్యోగి)

Updated Date - 2021-07-20T08:39:07+05:30 IST