సైరన్‌ మోగితే.. వణుకు పుట్టేది.. ఇక్కడకు వచ్చాక ధైర్యం వచ్చింది..!

ABN , First Publish Date - 2022-03-03T13:09:42+05:30 IST

వారంతా విద్యార్థులు. ఉన్నత విద్య కోసం దేశంగాని దేశం వెళ్లారు. కరోనా కొంత ఇబ్బంది పెట్టినా.. తమ చదువును కొనసాగిస్తున్నారు.

సైరన్‌ మోగితే.. వణుకు పుట్టేది.. ఇక్కడకు వచ్చాక ధైర్యం వచ్చింది..!

ఆ అనుభవం.. భయానకం!

‘ఆంధ్రజ్యోతి’తో ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన తెలంగాణ విద్యార్థులు

బయ్యారం/మహబూబాబాద్‌ టౌన్‌/అశ్వారావుపేట/ చుంచుపల్లి/తాండూరు, మార్చి 2: వారంతా విద్యార్థులు. ఉన్నత విద్య కోసం దేశంగాని దేశం వెళ్లారు. కరోనా కొంత ఇబ్బంది పెట్టినా.. తమ చదువును కొనసాగిస్తున్నారు. కానీ, ఇప్పుడు రష్యా యుద్ధోన్మాదం.. మహమ్మారిని మించి భయపెడుతోంది. బాంబుల మోతతో దద్ధరిల్లుతున్న ఉక్రెయిన్‌ను.. వీడి వెళ్లాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. స్వదేశానికి రావాలన్నా.. అగచాట్లు పడాల్సిన పరిస్థితి. రవాణా సౌకర్యాలు లేక.. స్థానికంగా సహకారం అందక.. తీవ్ర ఇక్కట్ల మధ్య స్వదేశం చేరుకుంటున్నారు. అలా వచ్చిన  వారిలో కొందరు.. తమ అనుభవాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.


సైరన్‌ మోగితే.. వణుకు పుట్టేది

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం ఇసుకమేది గ్రామానికి చెందిన విద్యార్థిని అమూల్య.. మెడిసిన్‌ చదివేందుకు మూడు నెలల క్రితం ఉక్రెయిన్‌ వెళ్లారు. ఇండియన్‌ ఎంబసీ చొరవతో బుధవారం క్షేమంగా ఇంటికి చేరుకున్న ఆమె.. తన అనుభవాలను చెబుతూ.. ‘‘సైరన్‌ మోగినప్పుడల్లా వణుకు పుట్టేది. ఎప్పుడు ఎక్కడ బాంబు పడుతుందోనని భయంగా ఉండేది. నాతో సహా 18 మంది తెలంగాణ విద్యార్థులం మూడు రోజుల క్రితం వినిష్టా నగరాన్ని వీడాం. బస్సులో చాప్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుని.. ఒకరోజు మొత్తం అక్కడే ఉన్నాం. చివరకు రైలులో జొహాని చేరుకున్నాం. అక్కడ ఎంబసీ వారు ఏర్పాటు చేసిన బస్సులో బుడాపెస్ట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాం. అక్కడి నుంచి మంగళవారం రాత్రి 7 గంటలకు విమానంలో బయలుదేరి.. బుధవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాం. అప్పటికి గానీ మాకు ధైర్యం రాలేదు’’ అని వివరించారు. అలాగే.. మహబూబాబాద్‌కు చెందిన అలుగువెల్లి గోపీకిరణ్‌.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఉద్యోగం రావడంతో.. 3 నెలల క్రితం వెళ్లారు.  ఎట్టకేలకు బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే.. తాండూరు పట్టణానికి చెందిన మదీహాఆసమ్‌.. ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. 50 మందితో ఓ బస్సులో 24 గంటల పాటు నానా అగచాట్లు పడి ప్రయాణం చేసి స్లోవేకియా సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ భారత అధికారులు ఏర్పాటు చేసిన హోటల్‌లో మరో 16 మంది తెలుగు విద్యార్థులతో కలిసి బస చేసింది. వారిని తరలించేందుకు  ప్రత్యేక విమానం.. బుధవారం రాత్రి బయలుదేరనున్నట్లు సమాచారం. 


54 గంటలు రైల్లోనే! 

ఉక్రెయిన్‌కు ఉత్తర సరిహద్దులోని జపరోషియాలోని యూనివర్సిటీలో.. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన రజియా చదువుతోంది. తనతో పాటు అక్కడే చదువుకుంటున్న 14 మంది తెలంగాణ వాసులతో కలిసి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రైల్లో హంగరీ సరిహద్దుకు బయలుదేరారు. బుధవారం రాత్రి 9 గంటల తర్వాత హంగరీలోకి ప్రవేశించారు. అంటే.. మొత్తం 54 గంటల పాటు రైల్లోనే గడిపారు. ఈ క్రమంలో తాము పడ్డ కష్టాలను రజియా.. తన తల్లిదండ్రులకు వివరించారు. ‘‘మాకు రైల్లో ఆహారం అందలేదు. చిరుతిండితో కొంత వరకు కడుపు నింపుకున్నాం. హంగరీ చేరే వరకు భయం భయంగానే గడిపాం’’ అని తెలిపారు. 


నేలపై పడేసి లాగుతూ.. కాలితో తన్నుతూ 

భారీ సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్నా కూడా ఉక్రెయిన్‌ ప్రజలు తమకు సహకరించారని.. అయితే ఆ దేశం నుంచి బయటపడేందుకు సరిహద్దుల్లోకి చేరుకున్న తమ పట్ల ఉక్రెయిన్‌ సైనికులు అమానవీయంగా వ్యహరించారని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అన్షిక అనే ఎంబీబీఎస్‌ థర్డ్‌ ఇయర్‌ అమ్మాయి వాపోయింది. ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా వర్సిటీలో ఆమె చదువుతున్నారు. రొమేనియా బార్డర్‌కు చేరుకుంటున్న విద్యార్థులను ఉక్రెయిన్‌ సైనికులు కాలితో తన్నారని.. నేలపై పడేసి లాగారని ఆమె చెప్పారు.

Updated Date - 2022-03-03T13:09:42+05:30 IST