బిక్కుబిక్కు.. బంకర్లే దిక్కు!

ABN , First Publish Date - 2022-02-25T08:45:43+05:30 IST

‘‘బాంబుల మోతతో తెల్లవారుజామునే నిద్రలేచాం. కరెంట్‌ లేదు. ఆకాశంలో పేలుళ్ల వెలుగులు తప్ప బయటంతా చీకటి. ఈ లోపు.. బయట యుద్ధం జరుగుతోంది. ఎవ్వరూ బయటికి రావొద్దంటూ ఆరుబయట ప్రచారం మొదలైంది. హాస్టల్‌ల్లోకి నీళ్లు రావడం లేదు.

బిక్కుబిక్కు.. బంకర్లే దిక్కు!

  • ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు
  • ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన.. కన్నీళ్లు 
  • కరెంట్‌ లేక  చీకట్లు.. పనిచేయని కార్డులు, నెట్‌
  • పిల్లల కోసం ఇక్కడ తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
  • ‘ఆంధ్రజ్యోతి’తో బాధలు పంచుకున్న విద్యార్థులు
  • క్షేమంగా వెనక్కి తెచ్చే చర్యలు తీసుకోండి: కేటీఆర్‌ 
  • విద్యార్థులకు అవసరమైన సాయం: కిషన్‌ రెడ్డి
  • ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు..
  • బాంబు మోతలతో ఎప్పుడేం జరుగుతోందన్న ఆందోళన


‘‘బాంబుల మోతతో తెల్లవారుజామునే నిద్రలేచాం. కరెంట్‌ లేదు. ఆకాశంలో పేలుళ్ల వెలుగులు తప్ప బయటంతా చీకటి. ఈ లోపు.. బయట యుద్ధం జరుగుతోంది. ఎవ్వరూ బయటికి రావొద్దంటూ ఆరుబయట ప్రచారం మొదలైంది. హాస్టల్‌ల్లోకి నీళ్లు రావడం లేదు. ఇంటర్నెట్‌ పనిచేయడం లేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు అమ్మాయిలం భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. స్థానికులను మాత్రమే బంకర్లలోకి అనుమతిస్తున్నారని చెబుతున్నారు. ఇక్కణ్నుంచి సురక్షితంగా బయటపడతామా?’’ ఉక్రెయిన్‌లోని కార్కివ్‌లో ఎంబీబీఎస్‌ సెకండియర్‌ చదువుతున్న ఖమ్మానికి చెందిన విద్యార్థిని పూజా తపస్వి ‘ఆంధ్రజ్యోతి’తో రోదిస్తూ చెప్పిన మాటలివి! 


రష్యా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో గల స్నేహితుల వద్దకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన గజ్వేల్‌ వాసి, కార్కివ్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న నాంపల్లి దుర్గాప్రసాద్‌దీ ఇదే ఆందోళన!  నిత్యావసర సరుకుల కోసం సూపర్‌ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయని..బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు జనాలతో నిండిపోయాయని వెల్లడించారు. ఇలా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు దేశంకాని దేశంలో ఆదుకునేవారెవరూ లేక.. నిస్సహాయ స్థితిలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆయోమయస్థితిలో భయంగా గడుపుతున్నారు. నెట్‌, వైఫై పనిచేయక.. డెబిట్‌, క్రెడిట్‌కార్డులు పని చేయక.. స్టోర్లలో సరుకులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్‌లో తమవాళ్లు ఎలా ఉన్నారో అంటూ ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’ వారితో, ఇక్కడున్న వారి తల్లిదండ్రులతో మాట్లాడి తెలుసుకుంది. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న బుద్వేల్‌కు చెందిన భావన, పరిస్థితులను ముందే ఊహించి నిత్యావసర సరుకులు ముందే కొని పెట్టుకొని అపార్ట్‌మెంట్‌కే పరిమితమైంది. తమను స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేయాలని విజయవాడకు చెందిన రతీశ్‌ అనే విద్యార్థి కోరారు. ఇండియన్‌ ఎంబసీ అధికారులు ఇండియాకు వెళితే మంచిదన్న సలహా మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాక చప్పుళ్లు వినబడితే టపాకాయలనుకున్నామని సిద్దిపేట జిల్లా బందారానికి చెందిన కొర్తివాడ అజిత్‌ చెప్పారు. నాలుగు రోజుల క్రితమే ఉక్రెయిన్‌ వచ్చానని ఎంబీబీఎస్‌ విద్యార్థి మహేశ్‌ రెడ్డి వాపోయారు. తమతో పాటు ఎంబీబీఎస్‌ చదువుతున్న అమెరికా, ఇజ్రాయిల్‌ విద్యార్థులు వారి దేశాలకు వెళ్లిపోయారని.. ఈ విషయంలో ఇండియన్‌ ఎంబసీ మాత్రం తమకు ఎలాంటి సహకారం అందించడం లేదని  జోయన్‌ సింధియా అనే విద్యార్థి అన్నారు. ఉపాధి కోసం 11 నెలల క్రితం ఉక్రెయిన్‌కు వచ్చానని.. ఓ రెస్టారెంట్‌ నడుపుతున్నానని హైదరాబాద్‌లోని బాలాపూర్‌ వాసి పిట్టల శ్రీకాంత్‌ చెప్పారు. ప్రస్తుతం  రెస్టారెంట్‌ నడవని పరిస్థితి నెలకొందన్నాడు. 


తెలంగాణ సర్కారు హెల్ప్‌ డెస్క్‌ 

రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు తగుసాయం అందించేందుకు న్యూఢిల్లీతో పాటు రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక హైల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎ్‌ససోమేశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇవీ నెంబర్లు: న్యూడిల్లీలోని తెలంగాణ భవన్‌ (7042566955; 9949351270; 9654663661).. తెలంగాణ సచివాలయం (040-23220603; 9440854433)


డబ్బుల్లేవు.. సరుకులు నిండుకుంటున్నాయ్‌

ఉక్రెయిన్‌ పశ్చిమాన ఉన్న చెర్నివిట్సి నగరంలో ఉన్నాం. ప్రస్తుతం తూర్పు వైపున రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. మాకు 400 కి.మీల దూరంలో ఉన్న క్యివ్‌లో నిన్న దాడులు జరిగాయి. ఎంబీబీఎస్‌ చదివేందుకు ఇక్కడికి వచ్చాం. చెర్నివిట్సిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాం.సైబర్‌ అటాక్‌ జరిగి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు పని చేయడం లేదు. హాస్టళ్లలో వంట ఎవరికి వారు చేసుకోవాలి. మేమున్న హాస్టల్‌లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 120, ఉత్తరాది విద్యార్థులు 500 వరకు ఉన్నారు. 30 మంది వరకు స్వస్థలాలకు వెళ్లిపోయారు. భారత ప్రభుత్వం మమ్మల్ని స్వదేశానికి తీసుకెళ్లాలి


కుమారస్వామి, శ్రీకాకుళం, అనస్‌ షరీఫ్‌ నెల్లూరు


ఉక్రెయిన్‌ సరిహద్దులకు భారత బృందం! 


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు 16వేల దాకా ఉంటారని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలకు నడుంబిగించింది. ఓ ప్రత్యేక బృందం ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి వెళ్లనుంది. రష్యన్‌ భాష మాట్లాడగల వారినే బృందంలోకి తీసుకోవడం విశేషం. పొలెండ్‌, రొమేనియా, హంగరీ, స్లొవేకియా మీదుగా మనవాళ్లను స్వదేశానికి తీసుకొచ్చే ప్రణాళికతో ఉన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌.. ఉక్రెయిన్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. భారతీయుల భద్రతే ప్రధానాంశంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ మాట్లాడతారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్ష్‌వర్దన్‌ చెప్పారు. 



Updated Date - 2022-02-25T08:45:43+05:30 IST