అచ్చ తెలుగు అభినయం

ABN , First Publish Date - 2021-04-26T05:30:00+05:30 IST

చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. కట్టు... బొట్టు... తెలుగింటి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. అందం... అంతకు మించిన అభినయంతో ‘నంది’ పురస్కారాన్ని అందుకుంది. విభిన్న పాత్రలతో ఇంటింటా వినోదాన్ని పంచుతున్న బుల్లితెర నటి పల్లవి రామిశెట్టి ముచ్చట్లు...

అచ్చ తెలుగు అభినయం

చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. కట్టు... బొట్టు... తెలుగింటి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. అందం... అంతకు మించిన అభినయంతో ‘నంది’ పురస్కారాన్ని అందుకుంది. విభిన్న పాత్రలతో ఇంటింటా వినోదాన్ని పంచుతున్న బుల్లితెర నటి పల్లవి రామిశెట్టి ముచ్చట్లు ‘నవ్య’ పాఠకుల కోసం... 


అవి నేను పదో తరగతి చదువుతున్న రోజులు. మా బాబాయి ఒకాయన కమెడియన్‌గా చేసేవారు. ఆయనే నన్ను ఈ రంగానికి తీసుకువచ్చారు. ఆ వయసులో ఏదో అయిపోవాలనో... నటిని కావాలనో అనుకోలేదు. అసలీ ఫీల్డ్‌ ఏమిటో... ఎలా ఉంటుందో కూడా తెలియదు. అనుకోకుండా అవకాశం వచ్చింది... ఇంట్లోవాళ్లూ ఓకే అన్నారు. అలా 2009లో ‘శ్రీ శ్రీమతి కల్యాణం’తో నటిగా నా ప్రయాణం మొదలైంది. అందులో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర. అయితే ఆ సీరియల్‌ ప్రసారం ఆలస్యమైంది. అదే సమయంలో ‘ఆడదే ఆధారం’లో కథానాయికగా అడిగారు. సరేనన్నాను. నటిగా ‘శ్రీ శ్రీమతి కల్యాణం’ మొదటిదే అయినా... తొలిసారి బుల్లితెరపై కనిపించింది మాత్రం ‘ఆడదే ఆధారం’తోనే! పదకొండేళ్ల పాటు కొనసాగి, గత ఏడాదే ఆ సీరియల్‌ ముగిసింది. మొత్తం 3,300 ఎపిసోడ్స్‌ ప్రసారమైంది. ప్రస్తుతం ‘అత్తారింటికి దారేది’లో నటిస్తున్నా. ఇది ప్రారంభమై ఆరేళ్లయింది. కొత్త సీరియల్‌ ‘పాపే మా జీవనజ్యోతి’ ఈ సోమవారం నుంచి ‘స్టార్‌ మా’లో ప్రసారం కానుంది. 


ఇష్టం పెరిగింది... 

మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. నాన్నది ఆటోమొబైల్‌ బిజినెస్‌. అమ్మ గృహిణి. నేను పుట్టింది విజయవాడలో అయినా పెరిగింది, చదువుకున్నది హైదరాబాద్‌లోనే! ఎలాంటి ఆలోచనలు, అంచనాలు లేకుండానే ఈ రంగంలోకి అడుగు పెట్టాను. కానీ ఒక్కసారి వచ్చాక ఇష్టం పెరిగింది. ఒక పక్క నటిస్తూనే చదువుకోవాలనుకున్నాను. కేంద్రియ విద్యాలయంలో స్కూలింగ్‌, నలందాలో ఇంటర్‌ చదివాను. అయితే ఆ తరువాత కాలేజీకి వెళ్లడం కష్టమైంది. చదువా..? నటనా..? చేతి నిండా పని ఉన్నప్పుడు ఇక వెనకడుగు వేయదలుచుకోలేదు. చివరకు ఆ నటనే నా కెరీర్‌ అయిపోయింది. తరువాత ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్య ద్వారా బీఏ సోషియాలజీ చేశాను. 


కాస్త కష్టమనిపించినా... 

ఈ రంగంలోకి వచ్చిన కొత్తల్లో కొంత ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే దీనిపై నాకు పూర్తి స్థాయి అవగాహన లేదు కదా! కెమెరా ముందు ఎలా ఉండాలి... ఎలా అభినయించాలి... ఇవేవీ తెలియదు. నటనలో ఎక్కడా శిక్షణ కూడా తీసుకోలేదు. కానీ దర్శకులు చెప్పింది చెప్పినట్లు చేసుకుపోయేదాన్ని. నాకు అప్పుడు, ఇప్పుడు రీటేకుల సమస్య లేదు. ఏదైనా తొందరగా నేర్చుకొంటాను. బహుశా అందుకే రాణించగలుగుతున్నానేమో! ‘ఆడదే ఆధారం’లో బాలయ్య తదితర సీనియర్‌ నటులతో కలిసి పనిచేశాను. వారు నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. కొత్త అమ్మాయిలా ఎప్పుడూ చూడలేదు. చాలా సహకరించారు. 


స్ఫూర్తినింపిన ‘అర్పిత’...  

ఇప్పటి వరకు నేను చేసింది నాలుగైదు సీరియల్సే. కానీ అవి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అన్నింటి కంటే నటిగా నాకు సంతృప్తినిచ్చింది... ‘ఆడదే ఆధారం’లో కలెక్టర్‌ అర్పిత పాత్ర. మహిళా ప్రాధాన్యమున్న కథ అది. ఎన్ని కష్టాలు వచ్చినా, సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయకుండా... దృఢంగా నిలబడ్డ స్త్రీ అర్పిత. ఆ సీరియల్‌ చూసి స్ఫూర్తి పొందామంటూ చాలామంది సందేశాలు పంపించారు. ఒకసారి గుడికి వెళ్లినప్పుడైతే ఓ చిన్న పిల్ల నన్ను చూసి... ‘నేను కూడా మీలా కలెక్టర్‌ అవుతా’నని అంది. ఆ పాప మాటలు విని నాకెంతో ఆనందం కలిగింది. నటిగా నాకది పెద్ద కాంప్లిమెంట్‌! 


‘నంది’ వెలుగు... 

మనం ఎంచుకున్న రంగంలో విజయపథంలో దూసుకుపోతుంటే అందులో ఉండే సంతృప్తే వేరు. దానికి తగిన గుర్తింపు కూడా లభిస్తే... ఇక అంతకుమించిన ఆనందం ఏముంటుంది! తెలిసీ తెలియని వయసులో నటిగా మారినా... ఆ తరువాత ఇష్టంగా కష్టపడ్డాను. దానికి ప్రతిఫలం ఉత్తమ నటిగా ‘నంది పురస్కారం’. 2012లో ‘భార్యామణి’ సీరియల్‌కు గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌ దక్కింది. నాలో కొత్త వెలుగులు నింపింది. 


తమ ఇంటి పిల్లలా... 

ప్రస్తుతం నడుస్తున్న ‘అత్తారింటికి దారేది’ సీరియల్‌లో కూడా నాది భిన్నమైన పాత్ర. ‘కృష్ణవేణి’ ఒక పల్లెటూరి అమ్మాయి. ఆమెకు ఇష్టం లేకపోయినా బావకు ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తారు. చివరకు అతడిని ఆమె ఇష్టపడే సమయంలో ఎవరో విడగొడతారు. తరాలు మారే వైవిధ్య పాత్ర అందులో చేస్తున్నాను. ఇక రాబోయే సీరియల్‌ ‘పాపే మా జీవనజ్యోతి’లో భర్త తరుఫువారి ఆదరణకు నోచుకోని ఇల్లాలు... ‘జ్యోతి’ కేరెక్టర్‌ నాది. బిడ్డ ‘జీవన’ పుట్టాక అత్తమామలకు దగ్గరవుతుంది జ్యోతి. అయితే జీవన కిడ్నా్‌పతో ఆమె గుండె పగులుతుంది. ఒకరి కోసం ఒకరు పరితపించే, భావోద్వేగాలతో నిండిన తల్లీ కూతుళ్ల కథ ఇది. ఏ పాత్ర చేసినా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తమ ఇంట్లో పిల్లలా భావిస్తున్నారు. తెరపై హోమ్లీగా కనిపించడం, అలాగే నటనలో కూడా నాకంటూ ఓ ప్రత్యేకత చూపించడం వల్లే ఇంతగా అభిమానిస్తున్నారనుకుంటున్నాను. 

ఇప్పటి వరకు అన్ని సీరియల్స్‌లో కలిపి దాదాపు ఆరు వేలకు పైగా ఎపిసోడ్స్‌ చేసుంటాను. ఒకే పాత్ర ఏళ్లకు ఏళ్లు చేసుకొంటూ పోతున్నా బోర్‌ కొట్టకపోవడానికి కారణం... వాటిల్లోని వైవిధ్యం... విభిన్న నేపథ్యం. 




లక్ష్యాలంటూ లేవు...

నాకంటూ పెద్దగా లక్ష్యాలంటూ ఏమీ లేవు. అందరూ మెచ్చే మరిన్ని పాత్రలు చేయాలి. ఇలాగే మంచి నటినన్న ముద్ర కలకాలం ఉండిపోవాలి. అది చాలు. ప్రస్తుతం అంతా హ్యాపీ. చేతి నిండా పని... ప్రేక్షకుల హృదయాల్లో తగిన స్థానం... అర్థం చేసుకొనే భర్త. ఇంతకంటే ఏంకావాలి? అన్నట్టు... మావారి పేరు దిలీప్‌. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నారు. ఇక ఇండస్ర్టీలో నాకు మంచి స్నేహితులంటే సహనటులు సుధీర, సమీరా, ధరణి. మొదట్లో సినిమా రంగంలో కూడా అవకాశాలు వచ్చాయి కానీ... సీరియల్‌ షెడ్యూల్స్‌తోనే క్షణం తీరిక ఉండదు. దాంతో ఒప్పుకోలేదు. చూద్దాం... భవిష్యత్తులో ఏమైనా చేస్తానేమో!



ప్రతిభకు కొదవలేదు... 

సినిమాల్లో లాగానే సీరియల్స్‌లో కూడా పరభాషా నటీమణులు దిగుమతి అవుతున్నారని చాలామంది అంటుంటారు. అయితే వాళ్లని ఎందుకు తెస్తున్నారన్నది ఇప్పటికీ నాకు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. నేనైతే ఒక్క కరోనా సమయంలో తప్ప ఈ రంగంలోకి వచ్చినప్పటి నుంచి బ్రేక్‌ లేకుండా పనిచేస్తున్నాను. ఆఫర్స్‌ కూడా వస్తూనే ఉన్నాయి. మన తెలుగు అమ్మాయిల్లో ప్రతిభకు కొదవులేదు. నటించాలన్న ఉత్సాహమూ ఉంది. ‘టిక్‌టాక్‌’ తదితర సామాజిక మాధ్యమాలు చూస్తుంటే ఆ విషయం అర్థమవుతుంది. అయినా బయటవారి కోసం వెళుతున్నారంటే... ఒకవేళ ఈ పాత్ర ఫలానావాళ్లు చేస్తే బాగుంటుందనుకోవచ్చు. లేదంటే ఫ్రెష్‌ లుక్‌ కోసం కావచ్చు. కానీ తెలుగు నటీమణులు కూడా చాలామందే ఉన్నారిక్కడ! 

- హనుమా 





Updated Date - 2021-04-26T05:30:00+05:30 IST